
సాక్షి, అమరావతి: నేతన్నలకు ఉచిత విద్యుత్ అమలుపై కూటమి సర్కారు ఏపాటి చిత్తశుద్ధితో ఉందో ప్రభుత్వ పెద్దల ప్రకటనలే అద్దం పడుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 1న మంత్రి సవిత విడుదల చేసిన ప్రకటనకు తాజాగా గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన లెక్కలకు పొంతన లేకపోవడం గమనార్హం. లబ్ధిదారుల సంఖ్యపై పరస్పర విరుద్ధంగా లెక్కలు చెప్పడంతో నేతన్నలు నివ్వెరపోతున్నారు.
ముఖ్యమంత్రి ఇలా అన్నారు..
మంగళగిరిలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలో చేనేత మగ్గాలున్న 93 వేల కుటుంబాలకు, పవర్ లూమ్స్ ఉన్న 50 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దీనికోసం ప్రభుత్వం ఏడాదికి రూ.190 కోట్లు ఖర్చు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికులు ఆధారపడి జీవిస్తున్న చేనేత రంగంలో దాదాపు 1,22,644 కుటుంబాలు ఉన్నాయన్నారు.
2014–19లో 90,765 కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చామని చెప్పిన ముఖ్యమంత్రి మరి ఇప్పుడు మగ్గాలున్న 93 వేల కుటుంబాలకు 200 యూనిట్లు, మర మగ్గాలున్న 50 వేల కుటుంబాలకు 500 యూనిట్లు (ఈ లెక్కన మొత్తం 1.43 లక్షల కుటుంబాలు) ఉచిత విద్యుత్ అని ప్రకటించడం గమనార్హం.
ప్రభుత్వ ప్రకటనలో ఇలా..
రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అత్యధికులు చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని, 2.50 లక్షల మంది చేనేత వస్త్రాల తయారీనే జీవనాధారంగా చేసుకున్నారని బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొనడం గమనార్హం. మగ్గాలపై నేసే నేతన్నలకు ఏడాదికి రూ.14,956, మర మగ్గాలపై ఆధారపడిన వారికి రూ.32,604 మేర లబ్ధి కలగనుందని ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం రూ.300 కోట్లుపైనే అవుతుంది.
మంత్రి ప్రకటన మరోలా..
రాష్ట్రంలో 65 వేల చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ రూపంలో రూ.125 కోట్ల మేర లబ్ధి చేకూరుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఈ నెల 1న విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. 50 వేల మగ్గాలు, 11,500 మర మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్నట్లు తెలిపారు. ఈ లెక్కన చూస్తే 61,500 మంది మాత్రమే అవుతారు. లబ్ధిదారుల సంఖ్య, ప్రయోజనం మొత్తంపై ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు గందరగోళంగా వ్యవహరిస్తుంటే పథకం ఏ మేరకు చిత్తశుద్ధితో అమలవుతుందో ప్రభుత్వానికే ఎరుక!!