
భూ సేకరణ కోసం ప్రభుత్వానికి రూ.500 కోట్లు చెల్లింపు
ఇంజనీరింగ్ డిౖజñ న్లు, పరికరాలు, మౌలిక వసతులకు ఇప్పటికే సుమారు రూ.1,200 కోట్లు వ్యయం
వాళ్లు ఇచ్చి న డబ్బుతోనే భూసేకరణ జరిపి.. ఇండోసోల్‌ను అక్కడి నుంచి బయటకు పంపడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏంటి?
ఇండోసోల్‌కు కేటాయించిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతం కేటాయించడం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఏమిటి?
ఈ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వ వయబులిటీ గ్యాప్ ఫండ్ కూడా ఉంది.. రైతులు వ్యతిరేకించే ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలని కోరడం దురుద్దేశం కాదా?
ఇప్పటికే ఒక గిగా వాట్ సామర్థ్యంతో ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధమైన ఇండోసోల్‌ను అక్కడి నుంచి తరిమేయడం ఏమిటి?
నిజంగా పరిశ్రమకు తోడ్పాటు అందించే ఉద్దేశం ఉంటే మామిడి పండ్లకు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఉలవపాడులో భూమి కేటాయిస్తారా?
ఇప్పటికే కంపెనీ ఏర్పాటుకు అంతా సిద్ధం చేసుకున్న ఇండోసోల్‌పై ఇది కుట్ర కాదా?
సాక్షి, అమరావతి: ఇండోసోల్ యూనిట్‌పై కూటమి సర్కారు కుట్ర మరోసారి బహిర్గతమైంది. ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టుపై విషం కక్కిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అడ్డంకులు సృష్టించింది. ఇప్పటికే ఉత్పత్తికి అన్ని విధాలా సిద్ధమైన ఇండోసోల్ యూనిట్‌ను రైతుల ఆమోదయోగ్యం లేని మరో చోటుకు తరలించడం ద్వారా మొత్తం ప్రాజెక్టునే గందరగోళంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వం చేవూరు, రావూరు మండలాల్లో ఎటువంటి వివాదం లేని, పంటలు పండని 5,148 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇప్పుడు దాన్ని రద్దు చేసి, రైతుల ఆమోదయోగ్యం లేని రెండు పంటలు పండే భూమిని కేటాయించడం ద్వారా వివాదం రాజేసింది.
గత ప్రభుత్వం ఇండోసోల్ కోసం రైతులను ఒప్పించి, ఏపీ మారిటైమ్ బోర్డు ద్వారా భూ సేకరణ పూర్తి చేస్తే, ఇప్పుడు ఈ భూమిని ప్రభుత్వం ఇవ్వనంటోంది. దీనికి ప్రతిఫలంగా కారేడు, ఉలవపాడు మండలాల్లో 8,348 ఎకరాలను సేకరించి ఇస్తానంటోంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉలవపాడు మామిడి, రెండు పంటలు పండే భూమిని కేటాయించడం ప్రభుత్వ దురుద్దేశాన్ని బహిర్గతం చేస్తోంది. చేవూరు, రావూరు వద్ద భూసేకరణ కోసం గత ప్రభుత్వ హయాంలోనే ఇండోసోల్ రూ.500 కోట్లు చెల్లించింది. 114 ఎకరాల్లో తొలి దశ కింద ఒక గిగావాట్ సామర్థ్యంతో యూనిట్‌ను ఏర్పాటు చేసి ఉత్పత్తికి సిద్ధంగా ఉంది.
విస్తరణ కోసం ఇప్పటికే రూ.1,200 కోట్లతో డిజైన్లు, పరికరాలు, మౌలిక వసతులను కల్పించింది. ఇప్పుడు భూ మారి్పడితో మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. 114 ఎకరాల్లో ఉన్న యూనిట్‌ను ఇక్కడే కొనసాగిస్తూ మిగిలిన విస్తరణ పనులను కారేడు, ఉలవపాడులో కొనసాగించమని చెప్పడంపై పారిశ్రామికవేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర పెట్టుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ఎంపిక చేసుకున్న పనులు ప్రారంభించిన తర్వాత యూనిట్‌ను ఎలా తరలిస్తారని వారు ప్రశి్నస్తున్నారు.
రూ.76,033 కోట్ల పెట్టుబడులు
గత ప్రభుత్వ హయాంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ కంపెనీ అయిన ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.76,033 కోట్ల పెట్టుబడితో 13,200 మందికి ఉపాధి కల్పించేలా విశాఖలో 2023లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్æ (జీఐఎస్)లో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రామాయపట్నం పోర్టు సమీపంలో రూ.42,040 కోట్ల వ్యయంతో సోలార్ పీవీ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. 20 గిగా వాట్ల పాలీసిలికాన్, 15 గిగావాట్ల వేఫర్స్, 10 గిగావాట్ల పీవీ మ్యాడ్యూల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ యూనిట్ ద్వారా పరోక్షంగా మరో 8,000 మందికి ఉపాధి లభించనుంది.
ఈ యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్‌ఐ) కింద రూ.1,875 కోట్ల మేర అనుమతులు కూడా లభించాయి. దిగుమతులు తగ్గించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎల్‌ఐ పథకం ద్వారా యూనిట్ ఏర్పాటు చేసి, ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. దీనికి భిన్నంగా కూటమి సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచి భూమి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఇప్పుడు ఏకంగా పచ్చని పంట పొలాలను కేటాయించి కొత్త వివాదాన్ని సృష్టించింది. తద్వారా ప్రాజెక్టుకు పూర్తిగా అడ్డంకులు కల్పిస్తోంది.