వెలుగు చూస్తున్న అక్రమ ‘ఆమోదాలు’.. ఆంధ్రజ్యోతికి

The TDP government has allotted valuable land to Andhra Jyoti in Renigunta - Sakshi

తోక పత్రికకు భూముల పందేరం 

అడిగిందే తడవుగా కేటాయింపులు 

ఆంధ్రా ప్రింటర్స్‌ పేరిట 1986లో ఎకరన్నర ఏపీఐఐసీ భూమి 

యాజమాన్యం మార్పిడి తర్వాత విక్రయం 

2015లో ఆమోద పబ్లికేషన్స్‌ పేరిట మరోసారి ఎకరన్నర 

వెలుగు చూస్తున్న అక్రమ ‘ఆమోదాలు’ 

వడ్డించే వాడు మనవాడయితే ఎక్కడ అడిగినా.. ఎన్నిసార్లు అడిగినా భూ పందేరాలు ఇష్టారాజ్యంగా జరిగిపోతాయనేందుకు ఆమోద పబ్లికేషన్స్‌కు విలువైన స్థలాన్ని కట్టబెట్టడమే ప్రబల నిదర్శనం. తెల్లారి లేచింది మొదలు పాఠకులకు అదేపనిగా నీతులు చెప్పే ఓ తోక పత్రిక నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా భూమి కొట్టేసిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు హయాంలో కోరిన చోట కోరుకున్న ధరకు రూ.కోట్ల విలువైన భూమిని కారుచౌకగా దక్కించుకున్న వైనానికి ముందు జరిగిన ఓ తతంగం ఇప్పుడు చర్చకు తెరలేపింది. 

సాక్షి ప్రతినిధి, తిరుపతి : రేణిగుంట మండలం తూకివాకం రెవెన్యూ గ్రామంలో బీసీ వర్గాల రైతులకు నిర్దేశించిన భూమిని అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమోద పబ్లికేషన్స్‌కు అతి తక్కువ ధరకు కేటాయించింది. ఈ విషయమై ‘అక్రమ ఆమోదం’ పేరిట బుధవారం ‘సాక్షి’లో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. కలకలం రేపిన  ఈ కథనం నేపథ్యంలో సదరు సంస్థ గతంలో వెలగబెట్టిన భూ నిర్వాకం ఇప్పుడు బయటికొచ్చింది. 

రేణిగుంట ఎస్టేట్‌లో వివిధ పరిశ్రల కోసం ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌) 1983లో ఓ వెంచర్‌ను నెలకొల్పింది. వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే ఆంధ్ర ప్రింటర్స్‌ పేరిట ఉన్న అప్పటి ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి 1986 మే 6న ఎర్రంరెడ్డిపాలెం సర్వే నంబర్‌ 516లో 1.50 ఎకరాలను 1, 2, 3, 4 ప్లాట్లుగా కేటాయించింది.  

ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం సంస్థకు లేదా పరిశ్రమకు కేటాయించిన భూములను విక్రయించడానికి వీల్లేదు. ఒకవేళ సదరు సంస్థకు నష్టం వస్తే ఆ భూమిని తిరిగి ఏపీఐఐసీకే అప్పగించాలి. లేనిపక్షంలో ఏపీఐఐసీ నుంచి ఎన్‌ఓసీ తీసుకుని భూ బదలాయింపు చేసుకోవచ్చు. కానీ తర్వాతి కాలంలో ఆంధ్ర ప్రింటర్స్‌ నుంచి పత్రికను కొనుగోలు చేసిన ప్రస్తుత ఆంధ్రజ్యోతి యాజమాన్యం ఎవరి అనుమతి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా రూ.3కోట్లకు విక్రయించేసుకుంది. కనీసం ఏపీఐఐసీ దృష్టికి తీసుకెళ్లకుండా, ఎన్‌ఓసీ లేకుండానే అమ్మేసుకున్నట్లు సమాచారం.
 
మళ్లీ 2015లో భూ పందేరం 
నిబంధనల ప్రకారం ఓ సంస్థకు ఒకేసారి భూ కేటాయింపులు జరపాలి. అయితే చంద్రబాబు తాబేదారుగా వ్యవహరించే సదరు తోక పత్రికకు ఎప్పుడు కావాలంటే అప్పుడు.. ఎక్కడ కావాలంటే అక్కడ.. ఎలా కావాలంటే అలా భూ పందేరం జరిగిపోయింది. 2015లో తూకివాకం వద్ద ఆమోద పబ్లికేషన్‌ పేరుతో మరోసారి విలువైన భూములు కొట్టేసిన సంగతి తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top