సాక్షి విలేకరి ‘గురిజా’ మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి | Sakshi
Sakshi News home page

సాక్షి విలేకరి ‘గురిజా’ మృతిపై వాస్తవాలు నిగ్గుతేల్చాలి

Published Sun, Dec 31 2023 5:18 AM

TDP false propaganda on sakshi reporter death - Sakshi

రణస్థలం: శ్రీకాకుళం జిల్లా లావేరు సాక్షి విలేకరి గురిజా దామోదరరావు మృతి బాధాకరమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌ అన్నారు. రణస్థలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. త­న పెదనాన్న గొర్లె శ్రీరాములునాయుడుకు, దామోదరరావు తండ్రి తవి­టయ్యతో మంచి అనుబంధం ఉందని, దామోదర్‌ కుటుంబ సభ్యులతో తనకు ఎలాంటి విభేదాల్లేవని చెప్పారు. విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాస్తవాలు తెలీకుండా టీడీపీ నేతలు కళా వెంకటరావు, చంద్రబాబు స్పందించిన తీరు శవాలపై రాజకీయం చేసేలా ఉందని విమర్శించారు.

దీనిపై పోలీసులు లోతైన విచారణ జరిపి నిజా నిజాలు నిగ్గు తేల్చాలని కోరారు. ఈ ఘటనపై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, దామోదర్‌ నాలుగు నెలలు ఎవరితో ఎక్కువ మాట్లాడారో కాల్స్‌ పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. దామోదర్‌ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి మాట్లాడుతూ కళా వెంకటరావు రాజకీయ లబ్ధి కోసమే దామోదర్‌ మృతిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఎనిమిదేళ్ల కిందట కళా వెంకటరావు తన తమ్ముడినే చంపేశాడని కుటుంబ సభ్యులే కేసు పెట్టారని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వేధించారంటూ వంగర ఎస్‌ఐ, కళాతో పాటు ఆయన పీఏపైనా కేసు పెట్టారని గుర్తు చేశారు.   

టీడీపీ నేతలు వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు   
లావేటిపాలెం వైఎస్సార్‌సీపీ నేతలు, మృతుడి బంధువులైన లావేరు ఎంపీటీసీ ఇనపకుర్తి సతీష్, ఇనపకుర్తి చంద్రశేఖర్, సగరం విశ్వనాథం మాట్లాడుతూ దామోదర్‌ ఎనిమిది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని తెలిపారు. టీడీపీ నేత జగ్గన్న దొరకు దామోదర్‌ రూ.10 లక్షలు అప్పు ఇచ్చాడని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్లు దామోదర్‌ చెప్పాడని పేర్కొన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కిరణ్‌కుమార్, లంకలపల్లి గోపిపై ఆరోపణలు చేస్తున్నారని, సూసైడ్‌ లెటర్‌ కూడా టీడీపీ వాళ్లు పెట్టించి ఉంటారని ఆరోపించారు.

Advertisement
Advertisement