పారని టీడీపీ పాచిక

TDP Failure In Raghu Rama Krishna Raju Issue - Sakshi

రఘురామ ఎపిసోడ్‌లో క్షత్రియులను రెచ్చగొట్టే యత్నాలు విఫలం

టీడీపీ ఎమ్మెల్సీ పాందువ్వ శ్రీను నేతృత్వంలో ప్రయత్నాలు

ఎంపీకి తమ మద్దతు లేదన్న క్షత్రియ సేవా సమితి ప్రకటనతో కంగుతిన్న టీడీపీ పెద్దలు

పశ్చిమలో మూడు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లిచ్చి క్షత్రియులను సీఎం జగన్‌ ఆదరించారని స్పష్టీకరణ  

సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని అస్థిర పరచడం, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని దుర్భాషలాడటం, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టిన కేసులో నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందేందుకు టీడీపీ వేసిన పాచికలు పారలేదు. టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా కలిసి రఘురామను నడిపిస్తున్నాయనే విమర్శలకు బలంచేకూరుస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ముసుగు తొలగించి నేరుగా రంగంలోకి దిగడం గమనార్హం. తనను పోలీసులు కొట్టారని రఘురామ ఆరోపిస్తే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం దారుణమంటూ ఈ ఎపిసోడ్‌ను చంద్రబాబు రక్తి కట్టించారు. గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ కూడా లేఖలు రాశారు. మరోవైపు దీన్ని రాజకీయం చేసి కులం సెంటిమెంట్‌ రగిల్చేందుకు చంద్రబాబు పథక రచన చేశారు. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను)ను రంగంలోకి దించారు. రఘురామ అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం క్షత్రియులకు అన్యాయం చేస్తోందంటూ దుష్ప్రచారానికి తెరతీశారు. కులం సెంటిమెంట్‌ రంగరించి విద్వేషాలు రేకెత్తించేలా పాందువ్వ శ్రీను నేతృత్వంలో రెండు రోజులుగా విఫల యత్నాలు జరిగాయి. 

స్వలాభం, ఆస్తులు కాపాడుకునేందుకే...
తెలుగు రాష్ట్రాల్లో క్షత్రియులకు కేంద్ర బిందువు లాంటి భీమవరంలో సమావేశమైన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు రఘురామకు తమ మద్దతు లేదని తేల్చి చెప్పారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి ఆ పార్టీపై, ప్రభుత్వంపై రఘురామకృష్ణరాజు దూషణలకు దిగడం సరికాదని స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలోనూ ఆయన్ను గెలిపించిన నియోజకవర్గ ప్రజల వైపు కన్నెత్తి కూడా చూడలేదని, ఆయన తీరు సమంజసం కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్షత్రియులకు తగిన ప్రాధాన్యం ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. రఘురామ వ్యక్తిగత పోకడలతో చోటు చేసుకున్న పరిణామాలతో క్షత్రియులకు ముడిపెట్టవద్దని, స్వలాభం కోసం, ఆస్తులు కాపాడుకోవడానికే ఆయన అలా మాట్లాడుతున్నారని క్షత్రియ నాయకులు పేర్కొన్నారు.

రఘురామకు మా మద్దతు లేదు: క్షత్రియ సేవా సమితులు
భీమవరం(ప్రకాశం చౌక్‌): ఎంపీ రఘురామకృష్ణరాజుకు తమ మద్దతు లేదని నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని పలు ప్రాంతాల క్షత్రియ సేవా సమితుల సభ్యులు ప్రకటించారు. ఆదివారం భీమవరంలోని ఏఎస్‌ఆర్‌ భవనంలో జరిగిన విలేకరులతో సమావేశంలో క్షత్రియ ఫెడరేషన్‌ మాజీ ఉపాధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, గణపవరం సమితుల సభ్యులు మాట్లాడారు. రఘురామకృష్ణరాజుకు క్షత్రియ సమితుల మద్దతు ఉందన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. గత 14 నెలల కాలంలో ఆయన ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో సఖ్యత లేకుండా వారిని విమర్శించడం, దూషించడం తప్ప ప్రజల కోసం ఆయన చేసింది ఏమీ లేదన్నారు. టీవీ చానళ్లలో ముఖ్యమంత్రి పట్ల గౌరవం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం, కులాలను కించపర్చడం లాంటి చేయకూడని పనులను రఘురామకృష్ణరాజు చేశారన్నారు. క్షత్రియులు ఎవరూ ఇతర కులాలను కించపరుస్తూ మాట్లాడరన్నారు. రఘురామకృష్ణరాజు సహనం కోల్పోయి సీఎంను, ప్రభుత్వ పెద్దలను ఏక వచనంతో సంబోధిస్తూ మాట్లాడటం, విమర్శించడం సరికాదన్నారు. తమపై అభిమానంతో నరసాపురం పార్లమెంట్‌ పరిధిలోని మూడు నియోజవర్గాల్లో క్షత్రియులకు ఎమ్మెల్యే టిక్కెట్లు, ఎంపీ టిక్కెట్‌ ఇచ్చి గౌరవించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందన్నారు. ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతూ అన్ని హామీలను నెరవేరుస్తున్న ముఖ్యమంత్రిపై రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖలు బాధాకరమన్నారు. 

గొట్టుముక్కల ప్రకటన ఆయన వ్యక్తిగతం: క్షత్రియ సేవాసంఘం
మధురానగర్‌ (విజయవాడ సెంట్రల్‌): తమ సంఘాన్ని టీడీపీ నేతలు స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకోవటాన్ని క్షత్రియ సేవాసంఘం సీనియర్‌ సభ్యులు డాక్టర్‌ ఎస్‌వీ సుబ్బరాజు, పీవీ సుబ్బరాజు తీవ్రంగా ఖండించారు. టీఎన్‌టీయూసీ నాయకుడు గొట్టుముక్కల రఘు రాష్ట్ర క్షత్రియ సేవాసంఘం అధ్యక్షుడి పేరుతో ప్రకటన చేయటాన్ని ఖండించారు. ఆయన క్షత్రియ సేవాసంఘం అధ్యక్షుడు కాదని, ఆ ప్రకటన పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, క్షత్రియ సేవాసంఘం, క్షత్రియులకు దీనితో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. క్షత్రియుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించటం మానుకోవాలని హితవు పలికారు. తాము రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలతో సమానంగా వ్యవహరిస్తూ క్షత్రియుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top