
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పీఠాన్ని తమ వారికి కట్టబెట్టేలా పావులు
సంయుక్త కార్యదర్శి మినహా ఇతర పదవులకు సింగిల్ నామినేషన్లే
అధ్యక్షుడిగా కేశినేని చిన్ని, కార్యదర్శిగా సానా సతీష్ నామినేషన్
ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కు, సంయుక్త కార్యదర్శి విష్ణుకుమార్‌రాజుకు మొండిచెయ్యి
సాక్షి, అమరావతి: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికల్లో రాజకీయ సిఫార్సుల పర్వం నడుస్తోంది. ఏసీఏ పీఠాన్ని తమవారికి ఏకగ్రీవంగా కట్టబెట్టేందుకు కూటమి సర్కార్ పాచిక వేసింది. ఇందులో భాగంగానే గుట్టుచప్పుడు కాకుండా ఆదివారం నామినేషన్ల పర్వం నడిపించింది. మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఏసీఏ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవులకు నామినేషన్లు సమర్పించారు.
చంద్రబాబు తనయుడు లోకేశ్ కనుసన్నల్లో పాత అపెక్స్ కౌన్సిల్ సభ్యులే మరోసారి ఏసీఏ పీఠంపై కూర్చునేందుకు మార్గం సుగమం చేశారు. ముందుగా ఊహించినట్టే అధ్యక్ష, కార్యదర్శులకు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పేరుతో ఒక్కొక్క నామినేషన్ దాఖలైంది. గతంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేసిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజును పక్కన పెట్టేసినట్టు సమాచారం.
ఆయన ఈసారి ఎలాగైనా తనకే ఉపాధ్యక్ష పదవి కావాలని చేసిన ప్రయత్నాలు ఫలించకపోగా.. ఉన్న పోస్టును కూడా ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. సంయుక్త కార్యదర్శి ఎన్నికకు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఏసీఏ మాజీ అధ్యక్షుడు గోకరాజు గంగరాజు అనుచరుడు బి.శ్రీనివాసరాజు, ప్రస్తుత పాలకమండలి ప్రోద్బలంతో బి.విజయ్‌కుమార్ నామినేషన్లు వేశారు.
డిప్యూటీ సీఎం కోటాలో ఉపాధ్యక్షుడి భర్తీ
ఏసీఏ ఉపాధ్యక్షుడిగా ఇంతకాలం భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు కుమారుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అల్లుడు వెంకటరామ ప్రశాంత్ కొనసాగుతున్నారు. ఈ పదవిని డిప్యూటీ సీఎం పవన్ తమ అనుచరుడికి ఇవ్వాలని సిఫార్సు చేసినట్టు సమాచారం. అందుకే బండారు నరసింహారావుతో నామినేషన్ వేయించారు. మరోవైపు తనకు ఎలాగైనా ఉపాధ్యక్ష పదవి కావాలని ప్రశాంత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆ పదవిని ప్రశాంత్‌కు ఇవ్వొద్దని పవన్ కరాఖండిగా చెప్పినట్టు సమాచారం.
వీరితో పాటు కౌన్సిలర్‌కు పాత వ్యక్తి దంతు గౌరువిష్ణ తేజ, కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్ మాత్రమే నామినేషన్ వేశారు. ఈ నెల 16న ఏసీఏ ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. జూన్‌లోనే వార్షిక సర్వసభ్య సమావేశం ముగిసినప్పుడు.. 16న మరోసారి ఎలా వార్షిక సమావేశం నిర్వహించి ఎలా ఎన్నికలు జరుపుతారని కోర్టుల్లోను, బీసీసీఐలోను పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతోపాటు ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకమే తప్పంటూ క్రికెట్ అభిమానులు కేసులు వేయడం గమనార్హం.