జెండా ఎత్తేసిన చంద్రబాబు

TDP Boycott AP Mptc Zptc Elections Is A Chandrababu Failure - Sakshi

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నుంచి పలాయనం

అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ

పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఘోర పరాజయం

ఎంపీటీసీ, జెడ్పీటీసీల్లోనూ అదే భంగపాటు తప్పదని బెంబేలు

అందుకే ఎన్నికలకు దూరం అంటూ ప్రకటన

భగ్గుమన్న టీడీపీ సీనియర్లు

తిరుగుబాటు బావుటా ఎగరేసిన అశోక్‌ గజపతి, జ్యోతుల నెహ్రూ

అంతటా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు

ఇది ఆత్మహత్యా సదృశం అంటున్న రాజకీయ పరిశీలకులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజకీయ యవనిక నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దాదాపు ఎత్తేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో రాజకీయంగా సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారు. అసెంబ్లీ, పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో మాదిరిగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా టీడీపీకి ఘోర పరాభవం తప్పదని బెంబేలెత్తి, స్థానిక సంస్థల ఎన్నికల నుంచి పలాయనం చిత్తగించడం టీడీపీ పాలిట ఆత్మహత్యా సదృశంగా మారుతోంది. టీడీపీలో ముసలం పుట్టించి చంద్రబాబు నాయకత్వంపై తిరుగుబాటు బావుటాకు నాంది పలుకుతోంది. టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు చంద్రబాబుపై మండిపడుతున్నారు.

సీనియర్‌ నేత అశోక్‌ గజపతి రాజు పొలిట్‌ బ్యూరో సమావేశానికి గైర్హాజరై అసమ్మతి వ్యక్తం చేయగా.. జ్యోతుల నెహ్రూ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆగ్రహం ప్రదర్శించారు. మరోవైపు ఇన్నాళ్లూ గ్రామాల్లో పార్టీ జెండా మోసిన టీడీపీ కార్యకర్తలు చంద్రబాబుపై భగ్గుమంటున్నారు. ‘మా ఎన్నికలు మీకు పట్టనప్పుడు మీరు పోటీ చేసే ఎన్నికలను మేమూ పట్టించుకోం. జెండా వదిలేస్తున్నాం’ అని తేల్చి చెబుతున్నారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలన్న రాజకీయ పార్టీ ప్రాథమిక ధర్మాన్ని టీడీపీ విస్మరించిందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజులో వేగంగా జరిగిన ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో టీడీపీలో సంభవించనున్న కల్లోలానికి సంకేతంగా నిలుస్తున్నాయి. 

2019 ఎన్నికలతో టీడీపీ పతనానికి నాంది
ఐదేళ్లపాటు ప్రజా వ్యతిరేక విధానాలు, కుంభకోణాలతో సాగిన చంద్రబాబు పాలనకు 2019 ఎన్నికల్లో ప్రజలు ముగింపు పలకడంతోనే టీడీపీ పతనానికి బీజం పడింది. సొంతంగా ప్రజాదరణ లేని చంద్రబాబు ఇక పార్టీని అధికారంలోకి తేవడం కల్లేనని తేటతెల్లమైపోవడంతో టీడీపీ శ్రేణులు నీరుగారిపోయాయి. మరోవైపు అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న దాదాపు 90 శాతం హామీలను ఏడాదిలోపే అమలు చేసి ప్రజాదరణను మరింత పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో 2020 ఫిబ్రవరి చివరి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రకటించగానే చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. ఏకంగా 126 జెడ్పీటీసీ స్థానాల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులే లభించకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పట్టింది. ఎన్నికలు జరిగితే ఘోర పరాజయం తప్పదని అవగతమవడంతో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ద్వారా చంద్రబాబు రాజకీయ కుతంత్రానికి తెరతీశారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసిపోతుందనగా కరోనా సాకుతో ఎన్నికలను అర్ధంతరంగా వాయిదా వేయించారు.

నిమ్మగడ్డను అడ్డు పెట్టుకున్నా ఫలితం శూన్యం
మరోవైపు టీడీపీకి ప్రయోజనం చేకూర్చేందుకు నిమ్మగడ్డ కొత్త ఎత్తుగడ వేశారు. మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కాకుండా పార్టీ రహితంగా నిర్వహించే పంచాయతీ ఎన్నికల ప్రక్రియ చేపట్టడం గమనార్హం. దాంతో ఎవరు గెలిచినా సరే తమ పార్టీ వారే అని చెప్పుకుని ముఖం చాటేసుకోవచ్చన్నది చంద్రబాబు ఎత్తుగడ. పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభిమానులు దాదాపు 82 శాతం పంచాయతీలను గెలుచుకున్నారు. అయితే టీడీపీ బలపరిచ్చిన అభ్యర్థులు 40 శాతం పంచాయతీలు గెలిచారని చంద్రబాబు స్వయంగా ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ దొంగ లెక్కలతో కనికట్టు చేసేందుకు యత్నించారు. తమ అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుని టీడీపీ శ్రేణులను కాపాడుకునేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ఈ ఏడాది మార్చిలో జరిగిన మునిసిపల్‌ ఎన్నికలు చంద్రబాబు గాలి తీసేశాయి. ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించిన 11 మునిసిపల్‌ కార్పొరేషన్లనూ వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 75 మునిసిపాలిటీలలో ఏకంగా 74 మునిసిపాలిటీలను కైవసం చేసుకుంది. సీఎం వైఎస్‌ జగన్‌ వెన్నంటి ఉన్నామని ప్రజలు కుండబద్దలు కొట్టారు.  

భంగపాటు తప్పదని పలాయనం
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రకటించడంతో చంద్రబాబు పరిస్థితి మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లయింది. అసలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనీయకుండా చేయడానికి ఆయన కొంత కాలంగా యత్నిస్తున్నారు. అందుకే గత ఏడాది నోటిఫికేషన్‌ను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేయాలనే అసంబద్ధ వాదనను లేవనెత్తారు. చంద్రబాబు తెరచాటు రాజకీయ పార్ట్‌నర్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా అందుకు వత్తాసు పలకడం గమనార్హం. ఇదే సమయంలో ఏకగ్రీవమైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో.. తిరిగి అక్కడి నుంచే ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ తేదీని ప్రకటించడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోయారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్ల అత్యంత ప్రజాదారణ ఉన్న ప్రస్తుత నేపథ్యంలో టీడీపీ కనీసం ఒక్క జిల్లాలో కూడా జెడ్పీ చైర్మన్‌ పీఠాన్ని గెలుచుకునే అవకాశాలు లేవు.

చాలా జిల్లాల్లో ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కూడా గెలుచుకుంటుందన్న నమ్మకం కూడా లేదు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించనున్న 660 మండల పరిషత్‌లలో కూడా కనీసం పదింటిని కూడా గెలుచుకుంటుందన్న విశ్వాసం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఎన్నికలను ఎదుర్కొన్ని మరోసారి అంతటి ఘోర పరాజయాన్ని తట్టుకోడానికి చంద్రబాబు సాహసించలేకపోయారు. ఇప్పటికే తన నాయకత్వంపై పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి రగులుతోందని ఆయన గుర్తించారు. తన తనయుడు లోకేశ్‌ను పార్టీ నేతలే కాదు, కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేదన్నదీ ఆయనకు తెలుసు. మరో వైపు జూనియర్‌ ఎన్టీఆర్‌ పార్టీలోకి రావాలని కుప్పంలోనే కార్యకర్తలు చంద్రబాబు ఎదుటే డిమాండ్‌ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. జూనియర్‌ ఎన్టీఆర్‌ పార్టీలోకి రావాల్సిన ఆవశ్యకత ఉందని పార్టీ వేదికపైనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి ఘోర పరాజయం మూటగట్టుకుంటే, పార్టీ నేతలు బహిరంగంగానే తన నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తారని గుర్తించారు. అందుకే అసలు ఎన్నికల్లోనే పోటీ చేయకూడదని చంద్రబాబు నిర్ణయించారు. 

చారిత్రక తప్పిదం
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో చంద్రబాబు రాష్ట్ర రాజకీయ రణ క్షేత్రం నుంచి టీడీపీ జెండాను దాదాపు ఎత్తేసినట్టేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారానే ఏ పార్టీ అయినా తమ కార్యకర్తలను కాపాడుకోగలదు. అందుకే గెలుపోటములతో నిమిత్తం లేకుండా పార్టీలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తుంటాయి. అందుకు భిన్నంగా చంద్రబాబు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించడం టీడీపీకి రాజకీయంగా ఆత్మహత్యా సదృశ్యమేనని, చారిత్రక తప్పిదమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అసలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసి, పార్టీని అధికారంలోకి తెచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేనేలేదని వారు గుర్తు చేస్తున్నారు.

పోరాడింది ఎప్పుడు?
► 1995లో ఎన్టీరామారావును కుట్రతో తొలగించి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎంగా ఉండగా జరిగిన 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రంలో రెండో స్థానానికే పరిమితమైంది. దాంతో బీజేపీతో పొత్తుపెట్టుకుని చంద్రబాబు 1999 ఎన్నికల్లో గట్టెక్కారు. 
► 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 18 శాతం ఓట్లు సాధించి, నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం 1998–99 మధ్య అణు పరీక్షలు నిర్వహించడం, కార్గిల్‌ యుద్ధంలో విజయం, ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి పదవి కోల్పోవడం తదితర పరిణామాలతో అప్పటి ప్రధాని వాజ్‌పేయి ఇమేజ్‌ ఆకాశాన్ని అంటింది. దీన్ని గుర్తించిన చంద్రబాబు రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. 
► 2004 ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు 2009 వరకు ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారు. 2009లో మహా కూటమితో జట్టుకట్టినా సరే పార్టీని గెలిపించలేకపోయారు. 
► రాష్ట్ర విభజన పరిస్థితుల నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా నరేంద్ర మోదీ అనుకూల పరిస్థితిని గమనించిన చంద్రబాబు.. బీజేపీ, జనసేనలతో పొత్తు పెట్టుకున్నారు. దీనికి తోడు అమలు సాధ్యం కాని హామీలతో ప్రజల్ని మోసగించడంతో అతికొద్ది శాతం ఓట్ల మెజార్టీతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంతేగానీ ప్రతిపక్ష నేతగా పోరాడి ప్రజల ఆదరణ పొంది పార్టీని గెలిపించిన చరిత్ర చంద్రబాబుకు లేనే లేదు. 

చంద్రబాబుపై భగ్గుమన్న టీడీపీ నేతలు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం టీడీపీలో ముసలం పుట్టించింది. చంద్రబాబు నిర్ణయంపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. అధినేతపై తిరుగుబాటుకు శుక్రవారం నిర్వహించిన టీడీపీ పోలిట్‌ బ్యూరో సమావేశమే వేదిక కావడం గమనార్హం. ఎన్నికల్లో పోటీ  చేయకూడదనే చంద్రబాబు నిర్ణయానికి ఆమోద ముద్ర వేయడమే ప్రధాన అజెండాగా ఈ సమావేశాన్ని నిర్వహించగా, అది కాస్త బూమరాంగ్‌ అయ్యింది. సాధారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయాలపై బహిరంగంగా స్పందించని సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు తన అసంతృప్తిని కుండబద్దలు కొట్టారు. ఆయన ఏకంగా పోలిట్‌ బ్యూరో సమావేశానికి హాజరు కాకుండా తన అసమ్మతిని వెల్లడించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న చంద్రబాబు నిర్ణయం రాజకీయ తప్పిదమని ఆయన పార్టీ నేతల వద్ద వ్యాఖ్యానించారు. జిల్లా పార్టీ నాయకత్వాలు, నామినేషన్లు వేసిన అభ్యర్థులతో చర్చించకుండా ఈ నిర్ణయం ఏమిటన్న ఆయన ప్రశ్నకు టీడీపీ అధిష్టానం వద్ద సమాధానమే లేకుండా పోయింది. 

పార్టీ క్యాడర్‌ను ఇతర పార్టీలకు అప్పగిస్తారా..
మరోవైపు విజయనగరం జిల్లాలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారని అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితి గజపతి రాజు ప్రకటించడం టీడీపీలో కలకలం రేపుతోంది. చంద్రబాబు వైఖరిపై తీవ్ర నిరసనగా సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మిగిలి ఉన్న కాస్తో కూస్తో పార్టీ క్యాడర్‌ను చంద్రబాబే చేజేతులా ఇతర పార్టీలకు అప్పగించేసినట్టు అయ్యిందని ఉత్తరాంధ్రలో పార్టీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఇక ప్రజా పోరాటాలు చేయమని కార్యకర్తలకు చెప్పే నైతిక హక్కును పార్టీ కోల్పోయిందని రాయలసీమకు చెందిన మాజీ మంత్రి ఒకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఉనికి కాపాడుకోడానికి నానా పాట్లు పడుతున్న తమ కుటుంబం ఇక కాడి వదిలేయాల్సిందేనని టీడీపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కింజరాపు కుటుంబ సభ్యులే నిర్వేదం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. 40 ఏళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా ఉన్న చరిత్ర టీడీపీకి లేదని.. చంద్రబాబు తొలిసారి ఆ దురవస్థ పార్టీకి తీసుకు వచ్చారని ఉభయ గోదావరి జిల్లాల నేతలు మండి పడుతున్నారు. 

మీకేమో కానీ.. పరిషత్‌ ఎన్నికలు మాకు ముఖ్యం
ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్న మండల స్థాయి నేతలు, కార్యకర్తలు చంద్రబాబుపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు. ‘ఈ లెక్కన చంద్రబాబునో ఆయన కొడుకు లోకేశ్‌నో ముఖ్యమంత్రిని చేసేందుకు అవసరమైన ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. కానీ మేము జెడ్పీటీసీ సభ్యుడో, ఎంపీటీసీ సభ్యుడో అయ్యే అవకాశం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పార్టీ పోటీ చేయదా?’ అని స్థానిక నేతలు తమ నియోకజవర్గ ఇన్‌చార్జ్‌లను నిలదీస్తున్నారు. ‘ఎమ్మెల్యే ఎన్నికలు చంద్రబాబు కుటుంబానికి ఎంత ముఖ్యమో.. పరిషత్‌ ఎన్నికలు మాకూ అంతే ముఖ్యం. మా రాజకీయ ఉనికికి సంబంధించిన ఎన్నికలను చంద్రబాబు పట్టించుకోనప్పుడు ఇక ఆయనకు పదవులు తెప్పించడానికి అసెంబ్లీ ఎన్నికల కోసం మేమెందుకు పని చేస్తాం? ఇక టీడీపీ జెండాను వదిలేస్తున్నాం. మా దారి మేము చూసుకుంటాం’ అని వారు తేల్చి చెబుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకూడదన్న నిర్ణయంతో టీడీపీలో పుట్టిన ముసలం ఆ పార్టీ పుట్టి ముంచడం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.

ఇదో నాటకం!
పరిషత్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చంద్రబాబు ప్రకటించినంత మాత్రాన పోలింగ్‌ రోజున టీడీపీ అభ్యర్థులు బరిలో ఉండకుండా పోరు. బ్యాలెట్‌ పేపర్లలో ఎక్కడికక్కడ ఆ పార్టీ అభ్యర్థుల పేరు, పార్టీ గుర్తు ఉంటుంది. స్వల్ప సంఖ్యలో అయినా ఓట్లు పడతాయి. టీడీపీకి ఇంత తక్కువ ఓట్లు వచ్చాయని ఎవరైనా అంటే.. తాము ఎన్నికలను బహిష్కరించినందు వల్లే ఇలా వచ్చాయని చెప్పుకోడానికి ఒక సాకు దొరుకుతుందనే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top