కృష్ణా జలాల విడుదల ఆపండి

Tamil Nadu Govt written letter to Government of Andhra Pradesh - Sakshi

ఆంధ్రా సర్కారుకు తమిళనాడు లేఖ

సాక్షి, చెన్నై: తమకు తెలుగుగంగ జలాల విడుదలను ఆపాలని తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. జూలై 1వ తేదీ నుంచి నీటి సరఫరా నిలుపుదల చేసి సెప్టెంబర్‌లో విడుదల చేయాలని కోరింది. తమిళనాడు రాజధాని నగరం చెన్నైకి తాగునీటి కోసం గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆంధ్రా నుంచి కృష్ణా జలాలు పంపిణీ అవుతున్నాయి.

ఈనేపథ్యంలో వారం రోజుల కిందట చెన్నై, శివారు జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలకు అన్ని రిజర్వాయర్లలోకి సమృద్ధిగా నీరు చేరింది. చెన్నైకి తాగునీరు అందించే పూండి, చోళవరం, పుళల్, సెంబరంబాక్కం, తేర్వాయ్‌ కండ్రిగ రిజర్వాయర్లు నిండాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెన్నైకి తెలుగుగంగ కాలువ ద్వారా కృష్ణా జలాలను సమృద్ధిగా పంపిణీ చేస్తున్నారు.

ఈ ఏడాది మే 8వ తేదీ నుంచి ఇప్పటివరకు 2.4 టీఎంసీల నీటిని చెన్నైకి విడుదల చేశారు. సోమ, మంగళవారాల్లో కూడా తెలుగుగంగ కాలువ ద్వారా సెకనుకు 610 ఘనపుటడుగుల నీరు చెన్నైకు చేరుతోంది. ఈ నీటిని పూండీ రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి సెంబరంబాక్కం, పుళల్‌ రిజర్వాయర్లకు తరలిస్తున్నారు.

ప్రసుత్తం అన్ని రిజర్వాయర్లు నిండుకుండలుగా మారడంతో కృష్ణా జలాల అవసరం తగ్గింది. దీంతో జూలై 1వ తేదీ నుంచి నీటి సరఫరా నిలిపేసి సెప్టెంబర్‌లో విడుదల చేయాలని తమిళనాడు నీటిపారుదలశాఖ అధికారులు ఏపీ అధికారులకు లేఖ రాశారు. గతంలో ఎప్పుడూ నీటివిడుదల కోసం లేఖలు రాసే అధికారులు.. తొలిసారిగా నీటివిడుదలను ఆపాలని కోరుతూ లేఖ రాయడం విశేషం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top