మరణించింది టైగర్‌ 123 | T 123 tigress dies suddenly | Sakshi
Sakshi News home page

మరణించింది టైగర్‌ 123

May 3 2025 4:14 AM | Updated on May 3 2025 4:14 AM

T 123 tigress dies suddenly

నిర్ధారించిన అటవీశాఖ నాడు ఉచ్చుకు చిక్కి.. నేడు అర్ధంతరంగా మృతిచెందిన పెద్దపులి నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్‌ ముసలిమడుగు సెక్షన్‌లో ఇటీవల కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన పెద్దపులిది తొలుత సహజ మరణమని అధికారులు భావించారు. అయితే పులి చర్మంపై ఉన్న చారల ఆధారంగా శ్రీశైలం బయో లాబ్‌లో పరిశీలించగా అది టి123(ఎఫ్‌)గా నిర్ధారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాలుగేళ్ల వయసున్న ఈ ఆడపులి గతేడాది వేటగాళ్ల ఉచ్చులోపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. - ఆత్మకూరు రూరల్‌

టైగర్‌ 123కి ఏం జరిగిందంటే 
పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఈ టి123 ఆడపులి హఠాత్తుగా మరణించడం వెనక ఏడాది క్రితం ఉచ్చుకు బిగుసుకుని తప్పించుకున్న ప్రభావమేనని భావిస్తున్నారు. అప్పట్లో ఉచ్చు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఈ ఆడపులి నడుముకు ఉచ్చుకు సంబంధించిన ఇనుప తీగ ఉన్నట్టు ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల్లో గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు పులిని ట్రాంక్విలైజర్‌ గన్‌తో అపస్మారక స్థితిలోకి చేర్చి, ఆ తీగను తొలగించారు. 

వన్యప్రాణి వైద్యులు చికిత్స చేసి, పూర్తిగా నయమైన తర్వాత అడవిలో వదిలిపెట్టారు. అదే పులి సంవత్సరం తరువాత చనిపోవడం వెనుక నాటి ఉచ్చు గాయమే కారణమని తెలుస్తోంది. గాయం పైపైన నయమైనప్పటికీ అంతర్గత అవయవాలైన గర్భాశయం(గర్భ సంచి), కాలేయం వంటి వాటికి ఇన్‌ఫెక్షన్‌ సోకి అది క్రమేపి విస్తరించి పులి మరణానికి కారణమైనట్లు భావిస్తున్నారు.

మరణాన్ని ముందే ఊహించే పులి 
పెద్దపులి జీవనశైలిలో ప్రత్యేకత ఏంటంటే... అది తన మరణాన్ని ముందే ఊహించడం. వృద్ధాప్యంలో వేటాడలేని స్థితిలో కొండ అంచుకు చేరుకుంటుంది. అక్కడ ఏ ఇతర జంతువులు గమనించలేని ప్రదేశంలో విశ్రమించి మరణం కోసం వేచి చూస్తూ... అలాగే మరణిస్తుంది. మరణించిన పులి కళేబరం ఎవరి కంటా పడకపోవడానికి కారణం అదే. ఈ కోవలోనే టి123 పులి కూడా తన చావు సమీపించే కొద్దీ ఒంటరి ప్రదేశానికి వెళ్లి తనువు చాలించినట్లుగా అనుమానిస్తున్నారు. అది ఎవరి కంటాపడని ప్రదేశం కాబట్టే చనిపోయిన 20 రోజులకు గానీ గుర్తించలేక పోయారని సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement