
మద్యం విధానం కేసులో హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో ముందస్తు బెయిల్‌పై బుధవారం (7వ తేదీన) జరిగే విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తమకు రక్షణ కల్పించాలంటూ కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేర్వేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కొనుగోళ్లలో తమకు ఎలాంటి సంబంధం లేదని.. ఈ వ్యవహారమంతా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలోనిదని.. తామే కుట్రదారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని పిటిషన్లలో పేర్కొన్నారు.
ఇదే కేసులో అరెస్టు నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రక్షణ కల్పించారని తెలిపారు. మద్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరగలేదని కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తేల్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై సోమవారం జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి మీరు హకోర్టులో పిటిషన్ ఎప్పుడు వేశారు?, కోర్టు ఎలాంటి నోటీసులు జారీ చేసిందని జస్టిస్ పార్దీవాలా పిటిషనర్ల తరఫు న్యాయవాదులను ప్రశ్నించారు.
ఈ నెల 2న వేశామని, మధ్యంతర రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్‌పై వాదనలు వినకుండానే తిరస్కరించి హైకోర్టు వాయిదా వేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో పీవీ మిథున్‌రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించాం కదా అంటూ ధర్మాసనం గుర్తు చేసింది. అయితే.. ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎలాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బుధవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నందున తాము ఇందులో జోక్యం చేసుకోలేమని, మధ్యంతర రక్షణ కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి 7న విచారణ ఎలా సాగింది? ఎలాంటి నిర్ణయం తీసుకున్నదనే విషయం తమకు చెప్పాలని ధర్మాసనం సూచించింది.
అప్పటివరకైనా అరెస్టు చేయకుండా మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. 7న చేపట్టనున్న విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచిస్తూ.. కేసుకు సంబంధించిన మెరిట్స్‌పై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. 7న హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా, ఫలితం ఏమొచ్చినా మరో వాయిదా అడగవద్దంటూ ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రాకు జస్టిస్ పార్దీవాలా సూచించారు.