
యూజీ, పీజీ సెట్ అడ్మిషన్లపై అలసత్వం
ఫలితాలు విడుదలైనా జాడ లేని కౌన్సెలింగ్
పలు కోర్సుల్లో చేరేందుకు 80వేల మంది ఎదురుచూపులు
కాసు క్కూర్చున్న ప్రైవేటు కళాశాలలు
ఉన్నత విద్యామండలి వైఖరిపై మండిపడుతున్న విద్యార్థులు
ఉన్నత విద్యామండలి నిర్లక్ష్యంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. యూజీ.. పీజీ సెట్ ఫలితాలు విడుదలైనప్పటికీ అడ్మిషన్లు చేపట్టకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. విద్యా సంవత్సంర ఆరంభమైనా కౌన్సెలింగ్ నిర్వహణకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ కళాశాలల యాజమానులు ప్రవేశాల కోసం కాసుక్కూర్చున్నారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడ చేరి్పంచాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆలస్యం చేస్తే రెంటికీ చెడ్డ రేవడిగా మిగలాల్సి వస్తుందేమో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్‌కు కొమ్ముకాసేలా ఉన్నత విద్యామండలి వైఖరి ఉందని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
తిరుపతి సిటీ: విద్యా సంవత్సరం ప్రారంభమై మాసం గడిచింది. డిగ్రీ, ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ, యూజీ కోర్సులలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇందు కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి పీజీ, యూజీ సెట్‌ను మే, జూన్‌లో నిర్వహించింది. దాదాపు అన్ని పీజీ, యూజీ సెట్‌ల ఫలితాలు సైతం విడుదలయ్యాయి. కానీ, ఇప్పటి వరకు ఒక్క పీజీ, యూజీ కోర్సులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించిన పాపాన పోలేదు. కొన్ని పీజీసెట్‌లకు కౌన్సెలింగ్ అధికారులను సైతం ఇప్పటివరకు నియమించిన దాఖలాలు లేవు. జూలై ప్రారంభమైనా కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సందిగ్ధంలో తల్లిదండ్రులు
పీజీ, యూజీ సెట్‌ల ఫలితాలు విడుదలైనా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కౌన్సెలింగ్‌లో పిల్లలకు సీటు దక్కకపోతే ఏం చేయాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థలలో ముందస్తు పీజీ, యూజీ, ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావస్తున్న నేపథ్యంలో తమ పిల్లల పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. ఇటు ప్రభుత్వ సంస్థలలో సీటు దక్కక అటు ప్రైవేటు కళాశాలల్లో సీటు దొరకని పరిస్థితిలో ఏంచేయాలనే అయోమయంతో ఉన్నారు. దీంతో ఇప్పటికే పలు విద్యాసంస్థలలో టోకెన్ అమౌంట్ చెల్లించి సీటు రిజర్వ్ చేసుకుంటున్నారు.
తప్పని ఎదురుచూపులు
జిల్లాలో పలు పీజీ, యూజీ కోర్సులో చేరేందుకు సుమారు 80వేల మంది విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏపీ ఐసెట్, ఏపీ లాసెట్, ఏపీ పీజీఈ సెట్, ఏపీ ఈఏపీ సెట్, ఏపీ ఈసెట్, ఏపీ పీజీసెట్, ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు ఇప్పటికే విడుదలై కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. ఇందులో పాలిసెట్‌కు మాత్రం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌ను ఈనెల 17వ తేదీ నుంచి మొదలుపెట్టనున్నట్లు సమాచారం.
మిగిలిన పీజీ సెట్లపై ఉన్నత విద్యామండలి ఇప్పటి వరకు కౌన్సెలింగ్ అధికారులను సైతం నియమించే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. మరో పక్క ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ ఫలితాలు విడుదలై నెలకు పైగా గడుస్తున్నా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం సైతం కౌన్సెలింగ్ ప్రారంభించకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
అగమ్యగోచరం
ఎంబీఏ, ఎంసీఏ, ఏంఏ, ఎమ్‌కామ్, ఎమ్మెస్సీ కోర్సులలో అడ్మిషన్లు వర్సిటీలలో దారుణంగా పడిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఉన్నత విద్యామండలి అలసత్వమే. ప్రవేశ పరీక్షలు నిర్వహించి నెలలు గడుస్తున్నా కౌన్సెలింగ్ చేపట్టకపోవడంతో విద్యార్థులు తమకు సీటు రాదనే అనుమానంతో ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. – డాక్టర్ బి.ఓబుల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
సీటు వస్తుందో రాదో అని..
మా అబ్బాయి ఇంటర్ పూర్తి చేశాడు. ఎంసెట్‌లో అర్హత సాధించాడు. కానీ, ఇప్పటి వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ముందస్తుగా ఫీజు చెల్లించి సీఎస్‌ఈ కోర్సులో అడ్మిషన్ చేయించాం. సకాలంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వ విద్యాసంస్థలోనే చేర్పించేవాళ్లం. – ప్రమీలమ్మ, విద్యార్థి తల్లి, తిరుపతి