చిన్నారికి అట్లకాడతో వాతలు | Step mother tourture to 7 years old Kid in Jangareddygudem | Sakshi
Sakshi News home page

చిన్నారికి అట్లకాడతో వాతలు

Feb 6 2022 5:35 AM | Updated on Feb 6 2022 7:49 AM

Step mother tourture to 7 years old Kid in Jangareddygudem - Sakshi

పెంపుడు తల్లి యనమదల లక్ష్మిని పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తున్న దృశ్యం

జంగారెడ్డిగూడెం: కాల్చిన అట్ల కాడతో చిన్నారికి వాతలు పెట్టిన పెంపుడు తల్లి కటకటాల పాలైంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో శనివారం వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. యనమదల నాగ వెంకటలక్ష్మి (7) పట్టణంలోని బాలాజీ నగర్‌ మండల పరిషత్‌ స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. ఈ చిన్నారిని యనమదల లక్ష్మి అనే మహిళ పెంచుకుంటోంది. చిన్నారి తల్లి దుర్గ భర్త మరణించడంతో జీవనోపాధి నిమిత్తం కువైట్‌ వెళ్లింది. తల్లి దుర్గకు, పెంపుడు తల్లి లక్ష్మికి అక్కడ పరిచయం ఏర్పడింది. లక్ష్మికి అప్పటికే ఇద్దరు మగపిల్లలు ఉండగా, ఆడపిల్ల కావాలి పెంచుకుంటానని దుర్గని అడగడంతో చిన్నారి నాగవెంకటలక్ష్మిని రెండేళ్ల వయసులోనే లక్ష్మికి పెంచుకోవడానికి ఇచ్చింది. కాగా, కొంతకాలంగా చిన్నారి నాగవెంకటలక్ష్మిని పెంపుడు తల్లి లక్ష్మి చిత్రహింసలు పెడుతోంది.

ఇంటి పనులు చేయించడం, కర్రలతో కొట్టడం, అట్ల కాడతో కాల్చడం వంటి దురాగతాలకు పాల్పడుతోంది. ఇటీవల చిన్నారి శరీరంపై అట్ల కాడతో తీవ్రంగా కాల్చింది. కనీసం ప్రాథమిక చికిత్స కూడా చేయించలేదు. ఆ గాయాలతోనే నాగవెంకటలక్ష్మి పాఠశాలకు వెళుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం కూడా చిన్నారి నాగవెంకటలక్ష్మిని తీవ్రంగా కొట్టింది. అనంతరం చిన్నారి పాఠశాలకు వెళ్లింది. ఆడుకుంటూ పడిపోవడంతో బాలిక ఒంటిపై కాలిన గాయాలను తోటి విద్యార్థులు గమనించి ప్రధానోపాధ్యాయిని గణేష్‌ లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే ఆమె జంగారెడ్డిగూడెం ఎస్సై ఎం.సాగర్‌బాబుకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్‌ సీడీపీవో యూఎన్‌ స్వర్ణకుమారి, సూపర్‌వైజర్‌ పి.బ్యూలా పాఠశాలకు వచ్చి చిన్నారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం చిన్నారిని ఏలూరు సీడీపీవో కార్యాలయానికి తరలించి పూర్తి వైద్యం చేయిస్తామని, అనంతరం చిల్డ్రన్‌ హోమ్‌కు తరలిస్తామని సీడీపీవో స్వర్ణకుమారి చెప్పారు. చిత్రహింసలు పెట్టిన పెంపుడు తల్లి లక్ష్మిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఎం.సాగర్‌బాబు చెప్పారు.

స్పందించిన ప్రభుత్వం
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులు పెంపుడు తల్లిని అదుపులోకి తీసుకుని ఆమెపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. బాలికను దెందులూరులోని బాలసదన్‌కు తరలించి సంరక్షించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement