పనిభారం, అధికారుల ఒత్తిడితో తీవ్ర మనస్తాపం
చల్లపల్లి (అవనిగడ్డ): చంద్రబాబు ప్రభుత్వంలో పనిభారం, అధికారుల ఒత్తిడి పెరగడంతో మనస్తాపానికి గురైన స్టాఫ్‌నర్సు కాజ అనిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పనిచేయడం కంటే చావడమే మేలనుకుని నిద్రమాత్రలు మింగింది. ఈ ఘటన కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, శ్రీకాకుళం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం రాత్రి జరిగింది. అనిత తల్లి నాగమణి, అత్త పద్మావతి తెలిపిన వివరాల ప్రకారం.. కాజ అనిత (34) నాలుగేళ్లుగా శ్రీకాకుళం పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్సుగా పనిచేస్తున్నారు.
ఆమెకు భర్త శ్రీకాంత్, కుమారుడు ఆనంద్‌కుమార్, కుమార్తె బేబీ సునైన ఉన్నారు. భర్త శ్రీకాంత్, కొడుకు ఆనంద్‌కుమార్‌కు అనారోగ్య సమస్యలున్నాయి. భర్త, కుమారుడిని చూసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో గుడివాడలో ఉన్న అత్తమామల వద్దే ఉంటూ అక్కడి నుంచే రోజూ విధులకు హాజరవుతోంది. ఈ క్రమంలో కొంత కాలంగా పనిభారం ఎక్కువైంది. రాత్రి, పగలూ విరామం లేకుండా వెంటవెంటనే డ్యూటీలు వేస్తున్నారు.
భర్త, కొడుకుని ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించేందుకు అనితకు ఒక్క రోజు కూడా సెలవు ఇవ్వడం లేదు. నాలుగు నెలల క్రితం వచ్చిన వైద్యురాలు మరింత వేధింపులకు గురి చేస్తూ మెమోలు ఇస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒక వైపు జిల్లా అధికారుల చుట్టూ తిప్పుతూ, మరోవైపు అదనపు పనిభారం మోపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనిత శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉండగా నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరుకుంది.
తోటి సిబ్బంది వెంటనే చల్లపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఈ ఘటన జరిగితే శనివారం సాయంత్రం వరకూ ఏ ఒక్క అధికారీ వచ్చి పలకరించలేదని అనిత కుటుంబ సభ్యులు వాపోయారు. అనితకు ఈ పరిస్థితి కల్పించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రెండేళ్లుగా పెరిగిన పనిభారం
రెండేళ్ల నుంచి పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, ప్రాణం మీదకు వచ్చినా ఒక్కరోజు సెలవు కూడా ఇవ్వడం లేదని అనితను చూసేందుకు చల్లపల్లి ఆస్పత్రికి వచ్చిన శ్రీకాకుళం పీహెచ్‌సీ వైద్య సిబ్బంది వాపోయారు. తాము అనారోగ్యానికి గురైతే చేతికి సెలైన్ సీసాలు కట్టుకుని ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నామని, తమ కష్టం ఎవరికీ రాకూడదని వేడుకొంటున్నారు. స్టాఫ్‌నర్సుల పరిస్థితే ఆత్మహత్య చేసుకునేలా ఉందంటే కింది స్థాయి సిబ్బంది ఇంకెంత దయనీయస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలని పలువురు సిబ్బంది తమ ఆవేదన వ్యక్తం చేశారు.


