
– హెడ్ నర్సు వేధిస్తుందంటూ ఆరోపణ
గోకవరం(తూర్పు గోదావరి జిల్లా): హెడ్ నర్సు వేధిస్తుందని ఆరోపిస్తూ స్టాఫ్ నర్సు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. గోకవరం ప్రభుత్వాస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, కొవ్వూరుకు చెందిన నారికమల్లి డేజి రత్నదీపిక స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రెండేళ్లుగా వైద్యవిధాన పరిషత్‌తో కాంట్రాక్టు విధానంలో స్టాఫ్ నర్సుగా పని చేస్తుంది. మధ్యాహ్నం విధి నిర్వహణలో ఉన్న ఆమె.. హెడ్ నర్సు వేధిస్తుందంటూ స్పిరిట్ తాగింది.
ఆమెను గుర్తించిన స్థానిక సిబ్బంది వెంటనే చికిత్స అందించారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, గత జనవరి నుంచి హెడ్ నర్సు లీల తనను మానసికంగా వేధిస్తుందన్నారు. అకారణంగా దూషించడం, పేషెంట్ల ముందు చులకనగా మాట్లాడుతుందన్నారు. మధ్యాహ్నం జనరల్ వార్డులో విధులు నిర్వహిస్తున్న తనను మందుల విషయమై ఇష్టానుసారంగా మాట్లాడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు తెలిపింది.
దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వనజను సంప్రదించగా, స్టాఫ్ నర్సును హెడ్ నర్సు వేధింపులకు గురి చేస్తుందన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఓపీ పెరగడం, సిబ్బంది తక్కువగా ఉండటంతో పని ఒత్తిడి పెరిగిందన్నారు. ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు, తాము సిబ్బందికి పనులు కేటాయిస్తున్నామని, వేధింపులు వంటి వాటికి తావులేదన్నారు. మందుల విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఈ ఘటనపై స్టాఫ్ నర్సు స్టేట్‌మెంట్‌ను హెచ్‌సీ వీర్రాజు రికార్డు చేశారు.