తిరుగుతూ.. పంజా విసురుతూ | - | Sakshi
Sakshi News home page

తిరుగుతూ.. పంజా విసురుతూ

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

తిరుగ

తిరుగుతూ.. పంజా విసురుతూ

చినకొండేపూడి టూ తొర్రేడు

మూగజీవాలపై పులి దాడి

భయాందోళనలో ప్రజలు

రాజమహేంద్రవరం రూరల్‌: పులి సంచారం దడ పుట్టిస్తోంది.. అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జనావాసాల్లో తిరుగుతోంది. పులి దాడులకు మూగజీవులు మృత్యువాత పడుతుండడంతో పాడి రైతులు, ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం, పోలవరం రూరల్‌ మండలంలో గత నెల 29వ తేదీ నుంచి సంచరించిన పులి దాడిలో సుమారు 11 పశువులు మృత్యువాత పడ్డాయి. అక్కడి నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతం వద్ద నుంచి సీతానగరం మండలం చినకొండేపూడి, పెదకొండేపూడి గ్రామాల మధ్య పులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి అప్రమత్తమయ్యారు. ఆదివారం ఉదయం చూసేసరికి తొర్రేడు గ్రామంలో పులి సంచరించి రెండు ఆవులు, ఒక దూడపై దాడి చేయడంతో అవి మృతి చెందాయి. దూడను అరటి తోటల్లోకి తీసుకువెళ్లి తినేసినట్లు ఆనవాళ్లను బట్టి అటవీ అధికారులు గుర్తించారు. ఈ విషయం ఉదయం నుంచి గ్రామంలో విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రజల్లో భయాందోళన మొదలైంది. సంఘటన స్థలానికి ప్రజలు అధిక సంఖ్యలో చేరుకుని పులి పాద ముద్రలు, మృతి చెందిన ఆవులను చూసేందుకు ఎగబడ్డారు. అక్కడకు సమీపంలోని మొక్కజొన్న తోటలో పులి సంచరిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సంఘటన స్థలానికి జిల్లా అటవీ శాఖ అధికారి ప్రభాకరరావు, రేంజ్‌ అధికారి దావీదురాజు, సిబ్బంది చేరుకుని పులిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

ట్రాప్‌ కెమెరాలు, బోను ఏర్పాటు

తొర్రేడులో సంచరిస్తున్న పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ఒక బోను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నారు. అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఏమైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అటవీ అధికారులు కోరారు.

గతంలోనూ సంచారం

తూర్పుగోదావరి జిల్లాలో పులులు, చిరుత పులుల సంచారం కొత్తేమీ కాదు. రాజమహేంద్రవరం లలితానగర్‌లో 2008 మే నెలలో ఒక ఇంట్లోకి ప్రవేశించింది. చివరికి ఆ పులికి అధికారులు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ సంఘటన మరువకు ముందే కొద్ది రోజులకే రాజమహేంద్రవరం ఓఎన్జీసీ బేస్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో పులి సంచరించింది. నాలుగు రోజులకు బోన్‌లో చిక్కడంతో అప్పుడు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2024 సెప్టెంబర్‌ నెలలో దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో చిరుత పులి వారం రోజుల పాటు సంచరించి, అక్కడి నుంచి కడియం మండలం వీరవరం, కడియపులంక మధ్యలో దోసాలమ్మ కాలనీలో సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించాయి. అక్కడ గోదావరి లంకల్లో నుంచి ఆ పులి వెళ్లిపోయినట్లు అధికారులు తేల్చారు.

తిరుగుతూ.. పంజా విసురుతూ1
1/2

తిరుగుతూ.. పంజా విసురుతూ

తిరుగుతూ.. పంజా విసురుతూ2
2/2

తిరుగుతూ.. పంజా విసురుతూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement