రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి

Feb 2 2026 7:49 AM | Updated on Feb 2 2026 7:49 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

రాజానగరం/ చాగల్లు: వైద్య విద్య పూర్తయ్యింది.. మరో వారం రోజుల్లో ఇంటికి వస్తానన్న కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల్లో విషాదం నిండింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత (23) రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో డెంటిస్ట్‌గా బీడీఎస్‌ పూర్తి చేసింది. ఐదేళ్ల కోర్సు పూర్తి కావడంతో ఈ నెల 7న ఇంటికి వచ్చేస్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై దివాన్‌చెరువులోని ఐఓసీఎల్‌ పెట్రోల్‌ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొమ్మూరు ఎస్సై మురళీమోహన్‌ కథనం ప్రకారం.. స్థానిక జీఎస్‌ఎల్‌ దంత వైద్య కళాశాలలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న లిఖిత తనతో పాటే ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న విశాఖపట్నంకు చెందిన వట్టూరి వాత్సల్యసాయి, తునికి చెందిన సమయమంతుల జాహ్నవి రాజేశ్వరి, ఇంజినీరింగ్‌ చదువుతున్న కిశోర్‌తో కలసి, అతని కారులో శనివారం రాత్రి స్నేహితుల పుట్టినరోజు వేడుకలకు రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు భాగంలో ఎడమ వైపు కూర్చున లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మిగిలిన ముగ్గురిని అటుగా ప్రయాణిస్తున్న వారు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయ్యింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బొమ్మూరు ఎస్సై తెలిపారు.

శోకసంద్రంలో చాగల్లు

లిఖిత మృతితో చాగల్లులో విషాద చాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైద్య విద్య పూర్తి చేసి దంత వైద్యురాలుగా సేవలందించాలనే తల్లిదండ్రుల కోటి ఆశలు తీరకుండానే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. లిఖిత తండ్రి వీర్రాజు వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ పారామెడికల్‌ అధికారిగా పని చేస్తుండగా, తల్లి మహాలక్ష్మి చాగల్లులో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. లిఖిత మృతదేహం వద్ద తహసీల్దార్‌ ఎం.మెరికమ్మ, ఐసీడీఎస్‌ సీడీపీఓ ఎం.ఆశారోహిణి, ఏఎంసీ చైర్మన్‌ నాదేండ్ల శ్రీరామ్‌, స్థానిక నాయకులు నివాళులు అర్పించారు.

రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి1
1/1

రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement