భక్తజన సాగరం..
● కిటకిటలాడిన అంతర్వేది
● స్వామివారికి చక్రస్నానం
● ఉత్సవాల్లో కమనీయ ఘట్టం
సఖినేటిపల్లి: సాగర తీరం భక్తజనంతో ఎగసిపడింది.. ఆ నారసింహుడిని చూసిన ప్రతి మది పులకించింది.. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనారసింహుని వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు స్వామివారి చక్రస్నానం అట్టహాసంగా జరిగింది. ఆదివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని అక్కడి సముద్ర తీరం భక్తిభావంతో ఉప్పొంగింది. ఎటు చూసినా భక్తజనం కనిపించింది. సుదర్శన చక్రం ధరించిన నారసింహస్వామి (సుదర్శన పెరుమాళ్ స్వామి) జలకమాడిన కడలిలోనే భక్తులు స్నానమాచరించి పులకించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో పేరూరు ఉద్దండ పండితులు స్వామిని శిరస్సుపై ఉంచుకుని సముద్ర స్నానం చేయించారు.
జల్లు స్నానానికి ఏర్పాట్లు
సముద్రంలో స్వామితో పాటు పుణ్యస్నానం చేయలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం జల్లు స్నానాలను ఏర్పాట్లు చేసింది. స్వామివారి కరుణా కటాక్షాలు కలగజేసేందుకు ఆలయ ఈఓ ఎంకేటీఎన్‌వీ ప్రసాద్ ఈ చర్యలు తీసుకున్నారు. ఒడ్డున స్వామివారిని ప్రత్యేక అరపపై ఆశీనులు చేసి, పైపు ద్వారా సముద్ర నీటిని స్వామి శిరస్సుపై నుంచి జార విడిచారు. అరప కింద ఏర్పాటు చేసిన క్యూలో భక్తులు ఆ నీటి కింద నుంచి వెళ్లి తడిసి పునీతులయ్యారు. తొలుత ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై, పల్లకిలో సుదర్శన చక్రధారుడైన నృసింహస్వామిని ఊరేగిస్తూ మంగళవాయిద్యాలతో తీరానికి అర్చకులు తోడ్కొని వచ్చారు. తీరంలో ఒడ్డున దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిరిలో వేదికపై స్వామి, అమ్మవార్లను ఆశీనులు గాలించారు. స్వామివారికి పంచామృతాలు, కొబ్బరి నీళ్లతో ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్, స్థానాచార్య రామరంగాచార్యులు, వేద పండింతుడు వెంకటశాస్త్రి, అర్చకులు అభిషేకాలు చేశారు. పేరూరు పండితులు సుదర్శన చక్రధారుడైన స్వామిని శిరస్సుపై ధరించి సముద్ర స్నానం చేయించారు. స్వామితో పాటు భక్తులు, అధికారులు, ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామిని అర్చకులు ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువెళ్లారు. దద్దోజనం, పానకాలను స్వామివారికి ఆలయ అర్చకులు నైవేద్యంగా పెట్టారు. ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం స్వామిని గరుడ పుష్ప వాహనంపై ఊరేగిస్తూ ఆలయానికి తోడ్కొని వచ్చారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఏఎస్పీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ ఎస్.మురళీ మోహన్, ఆర్డీవోలు అఖిల, శ్రీకర్, ఎండోమెంట్స్ డీసీ డీఎల్‌వీ రమేష్ బాబు, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమారరామ గోపాల రాజాబహద్దూర్, జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే సరికి క్యూలైన్లు మరింత రద్దీగా మారాయి.
అంగరంగ వైభవం.. వసంతోత్సవం
అంతర్వేదిలో నేడు
అంతర్వేది తీర్థమహోత్సవాల్లో తొమ్మిదో రోజు సోమవారం స్థానిక చెరువులో సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. విద్యుద్దీపాల మధ్య, బాణసంచా కాల్పులతో ఈ ఉత్సవం జరుపనున్నారు. సాయంత్రం 5 గంటలకు పుష్పక వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిప్తారు. చెరువు వద్ద ఆదివారం తెప్పోత్సవం ఏర్పాట్లను జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈవో ప్రసాద్ పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు ఉత్సవరులకు తిరుమంజనాలు, దర్పణసేవ, ధూపసేవ, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ద్వాదశ తిరువారాధన, శ్రీపుష్పోత్సవం, చెంగోలం విన్నపం, తీర్థగోష్టి, స్వామివారి పవళింపు సేవ అర్చకులు నిర్వహించనున్నారు.
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా పేరొందిన ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆదివారం భీమేశ్వరాలయంలో వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ముందుగా వేగాయమ్మపేటలోని ఆస్థాన మండపం నుంచి కల్యాణ మూర్తులైన మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, క్షేత్ర పాలకులైన లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్లను రథంపై దేవాలయానికి తీసుకుని వచ్చారు. ఆలయంలో వేద పండితులు, ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య తీర్థపు బిందె, బాలభోగం, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం, నాకబలి, గ్రామోత్సవాలు నిర్వహించిన అనంతరం త్రిశూల స్నానం, చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహించారు.
నేడు తెప్పోత్సవం
భీమేశ్వరస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం మేలుకొలుపు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల అర్చన, తీర్థపు బిందె, బాల భోగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం భక్తులచే విశేష అభిషేకాలు, మాణిక్యాంబా అమ్మవారికి వివిధ రకాల పుష్పార్చన, కుంకుమార్చన జరుపుతారు. మధ్యాహ్న కాలార్చన, రాజభోగ నివేదన సేవ అనంతరం రాత్రి 6.35 గంటలకు సప్త గోదావరి నదిలో శ్రీస్వామివార్లు, అమ్మవార్లకు కన్నుల పండువగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు.
భక్తజన సాగరం..
భక్తజన సాగరం..
భక్తజన సాగరం..
భక్తజన సాగరం..
భక్తజన సాగరం..


