షాపుల కేటాయింపులో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించలేదు

Srisailam Temple Eo Lavanna on Shops Allotment Srisailam Temple - Sakshi

ఆ షాపుల యజమానులే వేలం ప్రక్రియలో పాల్గొనలేదు

హైకోర్టుకు స్వయంగా హాజరై నివేదించిన శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న

సాక్షి, అమరావతి: శ్రీశైలంలోని వ్యాపారులకు లలి­తాంబిక వ్యాపార సముదాయంలో షాపులు కేటా­యించే వ్యవహారంలో కోర్టు ఇచ్చిన ఆదేశా­లను ఏ దశలోనూ ఉల్లంఘించలేదని శ్రీశైలం దేవ­స్థా­నం ఈ­వో లవన్న మంగళవారం హైకోర్టుకు నివే­దించా­రు. కో­ర్టు ఉత్తర్వులంటే తమకు ఎనలేని గౌరవం అని లవన్న తరఫు న్యాయవాది అశోక్‌ రామ్‌ కో­ర్టుకు వి­న్నవించారు.

షాపుల కేటాయింపుపై రాద్ధాంతం చే­స్తున్న పిటిషనర్లు, అసలు షా­పుల వేలం ప్ర­క్రియలో పాల్గొనలేదని,  అందువల్ల వారు షాపులు పొంద­లే­కపోయారని తెలిపారు. షాపుల కేటాయింపు కోసం వారు వినతిపత్రం సమర్పిస్తే, దానిని పరి­గణనలోకి తీసుకుని మరోచోట షాపులు కేటా­యిస్తామన్నారు. 8 నెలల కాలంలో 24 పిటిష­న్లు దాఖలు చేసి, షాపుల కేటా­యింపు విషయంలో ముం­దు­కెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశార­న్నారు.

షాపుల కేటా­యిం­పు కోసం నిర్వహించిన వే­లం­లో గరిష్ట ధర రూ.24 లక్షలకు చేరిందని తెలిపారు. పిటిషనర్లు కోర్టును ఆశ్రయించే నాటికే షాపుల కూల్చివేత పూర్తయిందన్నారు. అం­త­­­కు­­­­ముందు పిటిషనర్ల తరఫు న్యాయ­వాది ఎం.విద్యా­సాగర్‌ వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశా­లున్నా ఈవో ఆదేశాల మేరకు పిటిషనర్ల షాపులను అధికారులు కూల్చేశా­రన్నారు.

ఇరు­పక్షాల వాద­నలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణ­మోహన్‌.. షాపుల కేటాయింపు కోసం ఈవోకు వి­నతిపత్రం సమర్పించాలని పిటిషనర్లను ఆదేశించా­రు. ఆ వినతి ఆధారంగా షాపుల కేటా­యింపులో ని­ష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలని ఈవోకు స్పష్టం చేశారు. తదుపరి విచార­ణను మూడు వారాలకు వాయిదా వేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top