శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర చీమల దండయాత్ర.. హడలిపోతున్న జనం..

Srikakulam District: Ants Attack On Isukalapeta Village People  - Sakshi

ఆమదాలవలస రూరల్‌(శ్రీకాకుళం జిల్లా): బెల్లం చుట్టూ ఈగలు ముసరడం ఎంత సహజమో.. ఆహార పదార్థాలు ఎక్కడుంటే అక్కడ చీమల దండు చేరడం సహజం. మనం దాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. చీమల మందు చల్లి అవి చేరకుండా జాగ్రత్త పడతాం. మన సమీపంలో ఒకటి రెండు చీమలు కనిపిస్తే నలిపి పారేస్తాం. కానీ ఆ చీమలే ఒక గ్రామానికి నరకం చూపిస్తున్నాయి అంటే నమ్మగలమా?!.. కానీ అది వాస్తవం.
చదవండి: మస్కట్‌లో ఏం జరిగింది..? మహిళ సెల్ఫీ వీడియో కలకలం..

చలి చీమల చేతికి విష సర్పం చిక్కినట్లు.. ఈ చీమల దండ యాత్రతో ఆమదాలవలస మండలం ఇసుకలపేట గ్రామస్తులు విలవిల్లాడుతున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా చీమల దండే కనిపిస్తోంది. సాధారణంగా చీమలు కరుస్తాయి. కాసేపు మండినట్లు అనిపించి తగ్గిపోతుంది. కానీ ఇక్కడి చీమలు శరీరంపై పాకినప్పుడు విడిచిపెడుతున్న లార్వా లాంటి ద్రవం వల్ల అలెర్జీ వస్తోంది. దద్దుర్లు, కురుపులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

ఎర్ర చీమలు బెంబేలెత్తిస్తున్నాయి. కరవకుండానే తీవ్ర అస్వస్థతకు గురి చేస్తున్నాయి. శరీరంపై పాకి వెళ్లిన పది నిమిషాల్లో దద్దుర్లు వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. దీంతో ఎర్రచీమలు అంటేనే ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీ ఇసుకలపేట గ్రామస్తులు హడలిపోతున్నారు.

ఇంటిలో ఎర్ర చీమల దండు 

శరీరం అంతా అలర్జీ.. 
ఇసుకలపేటలో ఎర్ర చీమలు దండు వల్ల ఇప్పటికే పలువురు అంతుచిక్కని అలర్జీకి గురవుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాళ్లు, చేతులపై ఎక్కడ పాకినా అక్కడ అలర్జీ వస్తుంది. పది నిమిషాల్లో దురద వచ్చి చిన్నపాటి పొక్కులు వస్తున్నాయి. చీమల నోటి నుంచి వచ్చే లార్వా, గుర్తు తెలియని రసాయనం విడిచిపెట్టడం వల్లే ఈ సమస్య వస్తోందని  పలువురు చెబుతున్నారు. అలర్జీతో పాటు చిన్నపాటి జ్వరం వచ్చి శరీరం అంతా నొప్పులు వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.

బాధితులు సమీపంలోని ఆర్‌ఎంపీలు, ప్రైవేట్‌ ఆస్పత్రుల వద్ద చికిత్స పొందుతున్నారు. గాయాలు నయం కావడానికి 10 రోజుల పాటు చికిత్స తీసుకోవాల్సి వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఇందుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చవుతోందని అంటున్నారు. చీమల వలన ఇలా ఎందుకు జరుగుతుందో వైద్యులు సైతం చెప్పలేకపోతున్నారు. ఎర్ర చీమలతో ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలకు గురవుతున్నామంటూ గ్రామస్తులు ఇటీవలే కలెక్టర్‌ స్పందనలో ఫిర్యాదు చేశారు. చీమలదండు కట్టడికి చర్యలు తీసుకుని, అలర్జీకి గల కారణాలు గుర్తించాలని కోరారు.

చీమల నివారణకు చర్యలు.. 
ఎర్రచీమలు ఇళ్లలోకి రాకుండా గ్రామస్తులు సొంతంగా రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇళ్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆహార పదార్థాలకు రక్షణ ఏర్పాట్లు చేస్తున్నారు. పురుగు మందులు పిచికారీ చేయడం, చీమల మందును చల్లడం వంటి చర్యలు చేపడుతున్నారు. అధికారులు సైతం తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇబ్బంది పడుతున్నాం.. 
చీమలు కాళ్లపై పాకడంతో పుండ్లు ఏర్పడి గాయాలయ్యాయి. ఆమదాలవలసలోని ఓ వైద్యుడి వద్దకు వెళ్లి చికిత్స చేయించుకున్నాను. ఈ ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించాలి.  
– సూర గోవిందమ్మ, ఇసుకలపేట, ఆమదాలవలస మండలం 

చికిత్సకు రూ.10 వేలు ఖర్చు  
చీమల వల్ల అలర్జీ వస్తుందని మొదట్లో గుర్తించలేకపోయాం. కాలిపై ఎక్కువ గాయాలు కావడంతో శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చర్మవ్యాధి నిపుణుడి వద్దకు చికిత్స కోసం వెళితే రూ.10 వేలు ఖర్చయ్యింది.  పశువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి.  
– అన్నెపు సూర్యనారాయణ, ఇసుకలపేట 

వైద్య సేవలు అందిస్తున్నాం 
చీమల బాధితులకు వైద్యసేవలు అందజేస్తున్నాం. ఇప్పటికే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. ప్రస్తుతానికి  వైద్య శిబిరం ఏర్పాటు చేసి మందులు పంపిణీ చేస్తున్నాం. చీమల నోటి ద్వారా రసాయనం విడుదల చేయడంతో అలర్జీ వస్తుందని గుర్తించాం. మందులు వాడాక మళ్లీ అలర్జీ వస్తే ప్రమాదం. చీమ లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదు.  
– శ్రీనివాసరావు, వైద్యాధికారి, తొగరాం పీహెచ్‌సీ, ఆమదాలవలస మండలం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top