ఉచిత కల్యాణ మండపం పైసా ఖర్చు లేకుండా పెళ్లికి ఏర్పాటు

Sri Satya Srinivasa Free Kalyana Mandapam In Annavaram - Sakshi

 అన్నవరం కొండపై ఉచిత కల్యాణ మండపం

పైసా ఖర్చు లేకుండా పెళ్లికి ఏర్పాటు

ఒకేసారి 12 వివాహాలకు వీలుగా నిర్మాణం

దాత విరాళంతో పేదలకు తీరనున్న కష్టం

సాక్షి, అన్నవరం: సత్యదేవుని సన్నిధిన పేదలు ఉచితంగా పెళ్లి చేసుకునేందుకు ‘శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం’ వేదిక కానుంది. దేవస్థానం అధికారులు ఇందుకు అనుమతిచ్చారు. ఆధునిక వసతులతో ఒకేసారి 12 వివాహాలకు వీలుగా ఇక్కడ వేదికలు నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రావణ మాసంలో జరిగే పెళ్లిళ్లకు అప్పుడే రిజర్వేషన్లు మొదలయ్యాయి.

అన్నవరంలో పెళ్లి అదో ‘వరం’
రత్నగిరిపై పెళ్లి చేసుకున్న వారి బతుకులు బాగుంటాయన్నది భక్తుల విశ్వాసం. ఈ కారణంతోనే ఉభయ గోదావరి జిల్లాల వారే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడ వివాహాలకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆర్థిక స్తోమతను బట్టి ఇక్కడ కల్యాణ మండపాలను అద్దెకు తీసుకుంటారు. ఏటా ఐదు వేలు పైగా పెళ్లిళ్లు జరుగుతాయి. తక్కువ ఖర్చుతో వివాహం చేసుకోవాలనుకునేవారు ఇప్పటి వరకూ ఆరుబయట చేసుకునేవారు. వర్షం వస్తే వీరు చాలా ఇబ్బంది పడేవారు. పెళ్లి మధ్యలో వర్షం వస్తే షెల్టర్‌ కిందకు పరుగులు పెట్టిన సందర్భాలెన్నో.

శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం

3.5 కోట్లతో కల్యాణ మండపం
కొండపై పెళ్లిళ్లకు పేదలు పడుతున్న ఇబ్బందులకు స్పందించి శ్రీ లలితా రైస్‌ ఇండస్ట్రీస్‌ అధినేతల్లో ఒకరైన మట్టే శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు పెద్ద మనసు చాటుకున్నారు. రూ.3.5 కోట్లతో శ్రీసత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మంటపం (ఏసీ) నిర్మించారు. ఈ నెల 16న టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి దంపతులు దీనిని ప్రారంభించారు. మంటపం కేటాయింపులో పేదలకే అగ్రాసనమని ఆలయ ఈఓ త్రినాథరావు తెలిపారు.


కల్యాణ మంటపంలో వివాహ వేదికలు

సదుపాయాలివీ..
► వివాహానికి 50 కుర్చీలు, జంబుఖానా, పెళ్లిపీటలు, కాడి, ఇతర వివాహ సామగ్రి. వధూవరులకు రెండు గదులు, బాత్‌రూం సౌకర్యం.
► వివాహ వేదికలు కావాలంటే వధూవరుల ఆధార్‌ కార్డులు, శుభలేఖ లేదా పురోహితుని లగ్నపత్రిక, అవసరం.
► నెల రోజులు ముందుగా రిజర్వ్‌ చేసుకోవాలి.

ఆగస్టులో పెళ్లికి బుక్‌ చేసుకున్నాం 
ఉచిత కల్యాణ మంటపం చాలా బాగుంది. వేదికలు ఇంకా బాగున్నాయి. ఆగస్టు 25న రాత్రి 2.37 గంటలకు జరిగే పెళ్లికి కల్యాణ వేదికను బుక్‌ చేసుకున్నాం. దాతకు, దేవస్థానం అధికారులకు కృతజ్ఞతలు.
– ఎన్‌.శ్రీనివాస్, అరసవిల్లి, శ్రీకాకుళం జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top