మత్స్య సంపద మురిపిస్తోంది.. ఎగుమతుల్లో నాలుగో స్థానం 

 SPSR Nellore District a Major Source Of Income From Fisheries - Sakshi

ఏటా 3.50 లక్షల టన్నుల దిగుబడి

32 వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు

110 కిలోమీటర్ల సముద్ర తీరం

ఆక్వా రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రోత్సాహం

నూట పది కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగిన ఎస్పీ‌ఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా మత్స్య సంపదలో గణనీయ ఆదాయం సాధిస్తూ పురోగమిస్తోంది. జిల్లాలో సహజ సిద్ధంగా ఉన్న చెరువులు, రిజర్వాయర్లలో వివిధ రకాలైన చేపలు పెరుగుతుంటాయి. వాటిని కొన్ని పేద కుటుంబాలు పట్టుకుని జీవనం సాగిస్తుంటాయి. ఇక సముద్ర తీరంలో ఉన్న 98 మత్స్యకార గ్రామాల ప్రజలు ప్రధానంగా పడవలు, బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి రోజుల తరబడి అక్కడే ఉండి చేపలు, రొయ్యలు వేటాడి తీసుకొస్తుంటారు. వాటిని వ్యాపారులకు విక్రయించి ఆదాయం పొందుతుంటారు. ఇవే కాక జిల్లాలో సుమారు 32 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. బ్రాకిష్‌ వాటర్‌లో సాగుచేసే చెరువుల నుంచి ఏడాదికి దాదాపు 90 వేల టన్నుల రొయ్యలు పట్టుబడుతున్నాయి. ఇవన్నీ జిల్లా నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి.  
– సాక్షి, నెల్లూరు డెస్క్‌

జిల్లాలో అధికారికంగా సుమారు 8 వేల ఎకరాల్లో చేపల చెరువులున్నాయి. అనధికారికంగా ఇది ఇంకా ఎక్కువే ఉంటాయని సమాచారం. వీటిలో ఏటా దాదాపు రెండు లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రస్తుతం టన్ను చేపల ధర రూ.1.50 లక్షలు ఉంది. ఈ లెక్క ప్రకారం వాటి విలువ రూ.3,000 కోట్లు. పట్టుబడిన చేపల్లో కొంత జిల్లాలో వినియోగం అవుతుండగా, ఎక్కువ సరుకు ఇతర రాష్ట్రాలకు, పొరుగు జిల్లాలకు ఎగుమతి అవుతోంది. ఇవి కాకుండా జిల్లాలో సహజసిద్ధంగా ఏర్పడిన సాగునీటి చెరువులు, కాలువలు, నదుల్లో కూడా మత్స్యసంపద దొరుకుతోంది.  

భారీగా రొయ్యల చెరువులు 
జిల్లాలో దాదాపు 24 వేల ఎకరాల్లో రొయ్యల చెరువులు ఉన్నాయి. వీటిలో 80 శాతం బ్రాకిష్‌ వాటర్‌ (సెలెనిటీ తగినంతగా ఉన్నవి) చెరువులే. రొయ్యల ఉత్పత్తి జిల్లాలో ఏటా లక్ష టన్నులకు పైగానే ఉంటోంది. ఇందులో 90 వేల టన్నులు రాష్ట్రం నుంచి దేశంలోని పలు ప్రాంతాలతోపాటు విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రస్తుతం టన్ను రొయ్యల ధర రూ.2.50 లక్షల వరకు ఉంది. ఈ ప్రకారం లెక్కిస్తే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న రొయ్యల విలువ రూ.2,500 కోట్లు. ఆదాయం భారీగా ఉండటంతో రైతులు కూడా ఎక్కువమంది రొయ్యలు సాగుకే మొగ్గుచూపుతున్నారు.   

ఎగుమతులు ఎక్కడెక్కడికి.. 
బ్రాకిష్‌ వాటర్‌లో పెంచే రొయ్యలతోపాటు సముద్ర చేపలు ఎక్కువ భాగం జిల్లా నుంచి కృష్ణపట్నం పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కొంత వరకు చెన్నై, ముంబై, కోల్‌కతా, కొచ్చి, గుజరాత్‌కు కూడా ఎగుమతి అవుతున్నాయంటే జిల్లాలో సముద్ర ఉత్పత్తులు ఎంత మేరకు లభిస్తున్నాయో అర్థమవుతుంది. శీతలీకరణ వాహనాల (ఇన్‌సులేటెడ్‌ వెహికల్స్‌) ద్వారా కూడా రోడ్డు మార్గాన పొరుగు రాష్ట్రాలకు చేపలు, రొయ్యలను పంపుతున్నారు. ఆక్వా ఉత్పత్తులలో జిల్లా గణనీయ ప్రగతి సాధిస్తోందని అధికారులు వివరించే లెక్కలు తెలియజేస్తున్నాయి. 

ఉపాధి అవకాశాలు 
జిల్లాలో 9 తీర ప్రాంత మండలాల్లో 98 మత్స్యకార గ్రామాలున్నాయి. వాటిలో 1,98,000 మంది జనాభా ఉన్నారు. వీరంతా సముద్రంలో చేపలు, రొయ్యలు వేటాడి బతుకుతున్నారు. కుటుంబంలోని మగవారు సముద్రంలోకి వేటకు వెళతారు. ఒక్కోసారి చేపలు పట్టడానికి వారం రోజులు కూడా పట్టవచ్చు. అందుకే వేటకు వెళ్లే ముందు తగినంత ఆహారం కూడా తమతోపాటు తీసుకెళ్తారు. వేటాడి తెచ్చిన మత్స్యసంపదను వీరు వ్యాపారులకు విక్రయించి తమ కుటుంబాలను పోషించుకుంటారు. 

జిల్లా స్థానం ఇదీ
ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లా ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. సముద్రంలో, ఆక్వా చెరువుల్లోనే కాకుండా నదులు, కాలువలు, సాగునీటి చెరువులు తదితర వాటితో కలిపి జిల్లాలో ఏటా 3.50 లక్షల టన్నుల మత్స్య సంపద దొరుకుతోంది. ఇంత కంటే ఎక్కువ సంపదతో ముందు వరుసలో ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలున్నాయి. ప్రభుత్వ పరంగా ఆక్వా రంగానికి విద్యుత్‌ సబ్సిడీ ఇస్తుండటం, రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్‌ సరఫరా చేస్తుండటంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

ఆక్వా రైతులకు ప్రభుత్వ సహకారం
ఆక్వా సాగు రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తోంది. చేపలు, రొయ్యలకు ఫీడ్‌ కూడా నాణ్యమైనది అందించేలా శాఖా పరంగా చర్యలు తీసుకుంది. ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రాష్ట్రానికి ఏటా సుమారు రూ.2,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందుకు జిల్లా రైతులూ తమవంతుగా తోడ్పాటు అందిస్తున్నారు. సాగును ఇంకా ప్రోత్సహించేందుకు ప్రభుత్వపరంగా అన్నివిధాలుగా రైతులకు తోడ్పాటు అందిస్తున్నాం. 
– నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ 

రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌
గతంలో ఆక్వా సాగుకు యూనిట్‌ ధర రూ.4.86  ఉండేది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.2కే విద్యుత్‌ను అందిస్తామని చెప్పడంతో అధికారంలో ఉన్న చంద్రబాబు రూ.2కు యూనిట్‌ కరెంట్‌ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రస్తుతం ఆక్వా జోన్‌లోని రైతులకు యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తోంది. 
– ఫణీంద్రనాయుడు, ఆక్వారైతు, గంగపట్నం 

సబ్సిడీతో రైతులకు ఊరట
రొయ్యల చెరువులకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్‌ సబ్సిడీ వల్ల లాభం పొందుతున్నాం. నేను పది రొయ్యల చెరువులు సాగు చేస్తున్నా. ఈ ఏడాది మొత్తం చూస్తే మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఏడాదికి మూడుసార్లు సాగు జరుగుతుంది. గతేడాది మేలో వేసినప్పుడు రొయ్యల రేటు బాగుంది. 100 కౌంట్‌ రూ.280, 70 కౌంట్‌ రూ.340 వరకు పలికింది. సెప్టెంబర్‌లో రేటు భారీగా తగ్గి 100 కౌంట్‌ రూ.160 పలికింది. ఈ సమయంలో నష్టపోయాం. ప్రస్తుతం 100 కౌంట్‌ రూ.240 పలుకుతోంది. ప్రభుత్వం విద్యుత్‌పై యూనిట్‌కు రూ.1.50 పైసలు సబ్సిడీ ఇస్తుండటంతో నష్టపోయే పరిస్థితి లేదు. 
– ఆవుల సోమయ్య, పెదపట్టపుపాళెం, రొయ్యల సాగు రైతు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top