ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ప్రత్యేక ఓపీ’ 

Special OP for Govt Employees under Employees Health Scheme - Sakshi

రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ జీజీహెచ్‌లో ప్రారంభం  

లబ్బీపేట(విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రత్యేక ఓపీ కౌంటర్‌ ఏర్పాటుచేశారు. ఈ కౌంటర్‌ను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు.

ప్రతి సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళవారం మానసిక వ్యాధులు, జనరల్‌ మెడిసిన్, బుధవారం గుండె, కిడ్నీ వ్యాధులు, గురువారం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్‌ మెడిసిన్, శుక్రవారం చర్మ వ్యాధులు, జనరల్‌ మెడిసిన్, శనివారం ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలియజేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.

రక్తపోటు, హైపో థైరాయిడ్, రుమటాయిడ్‌ ఆర్థరైటీస్, నెఫ్రోటిక్‌ సిండ్రోమ్, క్రానిక్‌ కిడ్నీ వ్యాధులు వంటి వాటికి పరీక్షలు చేసి మందులు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.సౌభాగ్యలక్ష్మి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ విఠల్‌రావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్‌ జె.సుమన్, ఆర్‌ఎంఓలు శోభ,    మంగాదేవి, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top