బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి: అర్ధరాత్రి పాము హల్‌చల్‌

Snake Entered Alaram In Atmakur SBI  - Sakshi

అలారంలోకి దూరిన పాము

పరుగులు పెట్టిన అధికారులు, పోలీసులు

దొంగతనం జరిగిందేమోనని ఆందోళన

ఆత్మకూరు:  బ్యాంక్‌లో పాము దూరి హల్‌చల్‌ చేసింది. అనంతపురము జిల్లా ఆత్మకూరులోని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) శాఖలో శుక్రవారం అర్ధరాత్రి ఓ పాము కలకలం రేపింది. శనివారం తెల్లవారుజాము 4.30 గంటల వరకూ బ్యాంక్‌ అధికారులు, పోలీసులకు కంటి మీద కునుకులేకుండా చేసింది. బ్యాంక్‌ మేనేజర్‌ పరుశురాం, ఏఎస్‌ఐ వరుణాచారి తెలిపిన మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బ్యాంక్‌ అలారం ఒక్కసారిగా మోగింది. అప్పటికే అనంతపురంలోని తన గృహంలో నిద్రిస్తున్న బ్యాంక్‌ మేనేజర్‌ మొబైల్‌ ఫోన్‌లో సైతం అలారం (బ్యాంక్‌ సైరన్‌తో అనుసంధానం) మోగడంతో వెంటనే ఆయన అప్రమత్తమై పోలీసులకు, స్థానికంగా ఉన్న బ్యాంక్‌ సిబ్బందికి సమాచారం అందించారు.

ఆగమేఘాలపై బ్యాంక్‌ వద్దకు చేరుకున్నారు. అప్పటికే అలారం మోతకు చుట్టుపక్కల వారు నిద్రలేచి బ్యాంక్‌ చుట్టూ గుమిగూడారు. దొంగలు పడ్డారేమోననే అనుమానాలు అందరిలోనూ వ్యక్తమవుతుండగా బ్యాంక్‌ ఉద్యోగులు తలుపులు తీశారు. లోపల అనుమానాస్పద వ్యక్తులు ఎవరూ కనిపించలేదు. క్షుణ్ణంగా గాలించారు. అలారం స్విచ్‌ వద్ద ఓ పాము కనిపించడంతో దానిని చంపేశారు. అప్పటికే తెల్లవారుజాము 4.30 గంటలైంది. పాము కదలికలతో అలారం స్విచ్‌ ఆన్‌ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top