విద్యుత్‌ చార్జీలు స్వల్పంగా పెంపు

Slight increase in electricity charges in Andhra Pradesh - Sakshi

విద్యుత్‌ వినియోగదారులు, డిస్కమ్‌లను దృష్టిలో ఉంచుకుని 2022–23 టారిఫ్‌

విద్యుత్‌ చార్జీలను సవరించిన ‘ఏపీఈఆర్సీ’ 

పంపిణీ సంస్థలకు రూ.1,400 కోట్ల ఆదాయం 

ఒకే గ్రూపు టెలిస్కోపిక్‌ విధానంతో గృహ విద్యుత్‌కు ఆరు శ్లాబులు 

ఆదాయపు పన్ను చెల్లించే రైతులకూ ఉచిత విద్యుత్‌  

మతపరమైన ప్రదేశాలు, గోశాలలకు యూనిట్‌ రూ.4.80 నుంచి రూ.3.85కు తగ్గింపు 

ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి కొత్త చార్జీలు 

సాక్షి, అమరావతి: ఇటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూనే అటు డిస్కమ్‌లకు ఆర్థిక భరోసా కల్పిస్తూ 2022–23 రిటైల్‌ విద్యుత్‌ సరఫరా ధరలను సవరించి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి కొత్త చార్జీలను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న కేటగిరీల స్థానంలో కొత్తగా ఒకే గ్రూపు కింద ఆరు శ్లాబులను తెచ్చి గృహ విద్యుత్‌ వినియోగదారులపై అధిక భారం లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం తిరుపతిలో వెల్లడించారు. అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా సగటున 3.26 శాతం పెరిగిన చార్జీల కారణంగా మూడు డిస్కమ్‌లకు ఏటా దాదాపు రూ.1,400 కోట్ల రాబడి అదనంగా సమకూరనుంది. ఏప్రిల్‌ 1వతేదీ నుంచి ఈ చార్జీలు అమలులోకి రానున్నాయి.   

కామన్‌ టెలిస్కోపిక్‌ విధానం 
డొమెస్టిక్‌ కేటగిరీలో ఉన్న మూడు గ్రూపులను కామన్‌ టెలిస్కోపిక్‌ బిల్లింగ్‌ సిస్టమ్‌తో ఒకే  గ్రూపుగా కమిషన్‌ తాజాగా విలీనం చేసింది. ఈ విధానంలో వినియోగదారుడు తక్కువ స్లాబ్‌లో చేసిన వినియోగానికి సంబంధిత తక్కువ స్లాబ్‌ టారిఫ్‌లో బిల్‌ వేస్తారు. పేద గృహ వినియోగదారుల కోసం 0–30 యూనిట్ల కొత్త స్లాబ్‌ను ప్రవేశపెట్టారు. దీనివల్ల యూనిట్లు పెరిగినప్పటికీ స్లాబుల ప్రకారమే బిల్లు పడుతుంది. కమర్షియల్‌ 2 కేటగిరీ కింద ఉన్న మైనర్, మేజర్‌ సబ్‌ కేటగిరీలను విలీనం చేయడంతో నెలకు 50 యూనిట్ల కంటే తక్కువ వినియోగించే వినియోగదారులకు ఎనర్జీ ఛార్జీలు తగ్గుతాయి.

గృహ విద్యుత్‌ టారిఫ్‌ను స్వల్పంగా పెంచినా వీరిలో 90 శాతం మంది సగటు సరఫరా వ్యయం యూనిట్‌ రూ.6.98 కంటే తక్కువ టారిఫ్‌లోకి వస్తారు. 75 యూనిట్ల వరకు వినియోగానికి సంబంధించి టారిఫ్‌ ఇప్పటికీ సగటు సరఫరా వ్యయంలో 50 శాతం కంటే తక్కువగా ఉంది. దీని పరిధిలోకి వచ్చే వినియోగదారుల సంఖ్య మొత్తం గృహ వినియోగదారుల సంఖ్యలో 50 శాతం ఉంటుంది. వీరికి డిస్కమ్‌లు కొనుగోలు ధర కంటే తక్కువకే విద్యుత్‌ను సరఫరా చేస్తాయి.     

కామన్‌ గ్రూపు వల్ల స్వల్పంగానే పెంపు
ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్ల విద్యుత్‌ వాడితే మొదటి 30 యూనిట్ల వరకూ యూనిట్‌కు రూ.1.90, తర్వాత 45 యూనిట్లకు యూనిట్‌కు రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.4.50, అనంతరం 100 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.6.0, చివరి 25 యూనిట్లకు యూనిట్‌కు రూ. 8.75 చొప్పున పడుతుంది. ఆ విధంగా వినియోగదారునికి బిల్లు మొత్తం రూ.1235.75 అవుతుంది. ఇదే బిల్లు పాత విధానం ధరల ప్రకారం అయితే మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.65, తర్వాత 50 యూనిట్లకు రూ.3.35, ఆ తర్వాత 100 యూనిట్లకు రూ.5.40, చివరి 50 యూనిట్లకు రూ.7.10 చొప్పున పడుతుంది. ఈ లెక్కన మొత్తం బిల్లు రూ.1,195 వస్తుంది. అంటే కొత్త చార్జీల ప్రకారం పెరుగుతున్న బిల్లు రూ.40.75 మాత్రమే.

పరిశ్రమలకు ‘టైమ్‌ ఆఫ్‌ డే’ రాయితీలు 
టీఓడీ చార్జీలు పగలు 0.75 పైసలు తగ్గించడం ద్వారా పగటిపూట మాత్రమే పనిచేసే అధిక శాతం పరిశ్రమలు ప్రయోజనం పొందుతాయి. పౌల్ట్రీ ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్లకు రాయితీ టారిఫ్, ఆక్వా, పౌల్ట్రీ హేచరీలకు టీఓడీ నుంచి మినహాయింపునిచ్చారు. 2 కిలోవాట్‌ కంటే తక్కువ, 2 కిలోవాట్‌ కంటే ఎక్కువ కనెక్టెడ్‌ లోడ్‌ కలిగిన మతపరమైన ప్రదేశాలను దృష్టిలో ఉంచుకుని టారిఫ్‌ను కిలోవాట్‌కు ప్రస్తుతం ఉన్న రూ.4.80 నుంచి  రూ.3.85కు మండలి తగ్గించింది. గోశాలలకు వర్తించే టారిఫ్‌ను కూడా ఇదే ప్రకారం కుదించారు.

గ్రిడ్‌ సపోర్ట్‌ చార్జీలు.. 
గ్రిడ్‌ సపోర్ట్‌ చార్జీలను పునరుద్ధరించాలని డిస్కమ్‌లు కోరగా కిలోవాట్‌కి రూ.15 నుంచి రూ.50 వరకు విధించడం ద్వారా సంబంధిత విద్యుదుత్పత్తిదారులకు ఊరట కల్పించారు. ఓ కేటగిరిలోని పారిశ్రామిక వినియోగదారులపై ఓల్టేజ్‌ సర్‌చార్జీ  విధించాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనను మండలి అంగీకరించలేదు. రాష్ట్రంలో మొదటిసారిగా 132 కేవీ కంటే 220 కేవీ ఓల్టేజీ వినియోగదారులకు 0.5 పైసలు తక్కువ టారిఫ్‌ను మండలి నిర్ణయించింది.

పంపిణీ వ్యాపారం సర్దుబాటు
ఏపీఎస్పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్‌కు సంబంధించి విద్యుత్‌ పంపిణీ వ్యాపారం సర్దుబాటు ఖర్చులను రూ.3,368, రూ.609 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే 2022–23లో వినియోగదారుల నుంచి రూ.2,910.74 కోట్ల కంటే తక్కువ మొత్తం మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఆగస్టు 1 నుంచి ఈ వసూలు మొదలవుతుంది. సరఫరా వ్యాపారం సర్దుబాటు  ఖర్చులకు సంబంధించి 3వ నియంత్రణ కాలానికి రూ.492 కోట్లుగా మండలి నిర్ణయించింది. అయితే ఏపీ ట్రాన్స్‌కోకు రానున్న పాయింట్‌ ఆఫ్‌ కనెక్షన్‌ (పీఓసీ) ఛార్జీల నుంచి దీన్ని సర్దుబాటు చేయాలని ఆదేశించడం ద్వారా వినియోగదారులపై భారం పడకుండా చర్యలు తీసుకుంది.

అదనపు లోడ్‌ క్రమబద్ధీకరణకు పోర్టల్‌
వినియోగదారులు అదనపు లోడ్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు పంపిణీ సంస్థల వెబ్‌సైట్‌లలో సౌకర్యాన్ని కల్పించాలని మండలి ఆదేశించింది.
పైలట్‌ ప్రాజెక్ట్‌లకు రూ.3 కోట్లు
విద్యుత్‌ పొదుపు ఉపకరణాలు, సౌర విద్యుత్తుతో వ్యవసాయం మొదలైన ప్రయోగాత్మక ప్రాజెక్టులను చేపట్టడానికి నెలలోగా తమ బకాయిల నుంచి రూ.కోటి చొప్పున ఏపీసీడ్కోకు మూడు డిస్కంలు మొత్తం రూ.3 కోట్లు విడుదల చేయాలని మండలి ఆదేశించింది.

అందరికీ ఆమోదయోగ్యంగానే నిర్ణయం
తిరుపతి రూరల్‌: వినియోగదారులకు ఊరట కల్పించటంతోపాటు డిస్కంలకు ఆర్థిక భరోసా కల్పించేలా విద్యుత్‌ టారిఫ్‌లను ఆమోదించినట్లు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీయూ సెనెట్‌ హాలులో ఆయన విద్యుత్‌ టారిఫ్‌ విడుదల చేసి మీడియాతో మాట్లాడారు. విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆదాయ అవసరాలు, ధరల ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి టారిఫ్‌ ప్రకటించినట్లు తెలిపారు.

గతంలో ఉన్న మూడు రకాల శ్లాబ్‌లను ఎత్తివేసి అందరికీ ఉపయోగపడేలా కొత్తగా కామన్‌ టెలిస్కోపిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఫంక్షన్‌ హాళ్లు తెరవకున్నా గతంలో నెలకు కిలోవాట్‌కు విధించిన రూ.100 కనీస చార్జీల్ని ఎత్తివేశామన్నారు. విద్యుత్‌ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించేందుకు యూనిట్‌కు రూ.6.70 ధరను కొనసాగిస్తున్నట్లు వివరించారు.  కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకూర్‌ రామ్‌సింగ్, రాజగోపాల్‌రెడ్డి, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్‌.హరనాథరావు, జె.పద్మజనార్ధనరెడ్డి, సంతోషరావు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top