కొండ దిగిన కోదండరాముడు

Sita Rama Lakshmana Idols Moved At Ramateertham - Sakshi

ఒక వైపు వేదపండితుల మంత్రోచ్ఛారణలు... మరోవైపు ప్రాయశ్చిత్త హోమాలు... ఇంకోవైపు పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ సీతా, లక్ష్మణ, ఆంజనేయుని సమేతంగా శ్రీ కోదండరాముడు నీలాచలం నుంచి దిగాడు. ఆగమ పండితులు సంప్రదాయబద్ధంగా హోమాలు జరిపించగా... ఆలయంలోని విగ్రహాలను తొలగించారు. వాటిని దిగువనున్న శ్రీరామస్వామి వారి ప్రధాన ఆలయంలోకి తరలించారు. 

సాక్షి, విజయనగరం : నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచలంపైనున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గల సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో శ్రీరాముడి విగ్రహాన్ని గతనెల 28 వ తేదీ అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై సిట్‌ దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆ విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న విగ్రహాలను తొలగించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ఉదయం 7 నుంచి 10గంటల వరకు ఆగమ పండితులు శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం నుంచి విచ్చేసిన ఆగమ పండితులు వంశీకృష్ణ, ఫణిరామ్, రామతీర్థం అర్చకులు కిరణ్‌కుమార్, పవన్‌ హోమాలు జరిపించారు. అనంతరం గోమాత తోకకు తాడును కట్టి ఆ తాడు సాయంతో విగ్రహాలను వాటి స్థానాల్లోంచి కదిలించారు. ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలతో పాటు పురాతన లక్ష్మణుడి విగ్రహాన్ని కూడా పక్కకు జరిపారు. 

అధికారుల పర్యవేక్షణలో తరలింపు 
శాస్త్ర ప్రకారం కదిలించిన విగ్రహాలను పోలీసులు, సీఐడీ అధికారుల పర్యవేక్షణలో కొండ దిగువనున్న ప్రధాన ఆలయంలోకి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కలి్పండంతో పాటు అత్యంత గోప్యత పాటించారు. ఇతరులెవరినీ పరిసరాల దరిదాపులకు కూడా రానివ్వలేదు. విగ్రహాలకు ఎలాంటి అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడ్డారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఓ రంగారావు చెప్పారు. ఇదిలా ఉండగా శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో పునఃప్రతిష్టించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతన విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి విగ్రహాల తయారీ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రామతీర్ధం చేరుకున్న తరువాత ఆ విగ్రహాలను ప్రధాన ఆలయంలోని బాలాలయంలో పునఃప్రతిష్టించేందుకు ఆలయ అ«ధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

ఆలయ ఆధునికీకరణకు సన్నాహాలు 
కొండపై ఉన్న పురాతన ఆలయాన్ని ఆధునికీకరించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆలయ పునఃనిర్మాణానికి, అభివృద్ధికి రూ.3కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతో జిల్లాలోని శ్రీరాముడి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో పూర్తి రాతికట్టడాలతో పూర్తయ్యే ఆలయ పునరి్నర్మాణంలో భాగంగా, మెట్ల మార్గాన్ని సరిచేయడంతో పాటు కొత్త మెట్లు నిర్మిస్తారు. దేవాలయ పరిసరాలు మొత్తం విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తారు. శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపరచి చుట్టూ గ్రిల్స్‌ ఏర్పాటు, ప్రాకార నిర్మాణం, హోమశాల, నివేదన శాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు జరగనున్నాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top