'పట్టు' జారుతోంది! | The silk industry is going through tough times | Sakshi
Sakshi News home page

'పట్టు' జారుతోంది!

Jul 8 2026 3:41 AM | Updated on Jul 8 2026 3:41 AM

The silk industry is going through tough times

3 వేల నుంచి 300 ఎకరాలకు పడిపోయిన పట్టు సాగు 

నష్టాలు భరించలేక పంట మార్పిడికి రైతుల యత్నం 

రూ.4 కోట్ల మేర ఇన్సెంటివ్‌ల బకాయి 

సిల్క్‌ హబ్‌.. సిల్క్‌ సిటీ చేసేస్తా అన్న పవన్‌ కల్యాణ్‌ 

ఆనక ఆ మాటే విస్మరించిన వైనం

పిఠాపురం: స్వదేశీ సిల్క్‌ ఉత్పత్తిలో రాష్ట్రంలో పేరెన్నిక గన్న గొల్లప్రోలు మండలంలో పట్టుకు గడ్డుకాలం నడుస్తోంది. పట్టు సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో పెట్టుబడులు రాక, పంటకు ధర లేక, కౌలుకు తీసుకునేవారు సైతం లేక రైతులు మల్బరీ సాగుకు వెనకడుగు వేస్తున్నారు. సుమారు 3వేల ఎకరాల్లో సాగయ్యే ఈ పంట నేడు 300 ఎకరాలకు పరిమితమైంది. 

పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తానని, సిల్క్‌ సిటీ నిర్మిస్తానని వాగ్దానాలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇలాకాలోనే ఈ పరిశ్రమ మూతపడే పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో పలమనేరు, హిందూపురంతో పాటు స్థానిక గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పట్టుగూళ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో కోనసీమ అమలాపురం, రాజమహేంద్రవరం మినహా ఎజన్సీలో 5, పెద్దాపురం డివిజన్లో 12, కాకినాడ డివిజన్లో 2 మండలాల్లో 4500 ఎకరాల్లో 1100 మంది రైతులు మల్బరీ సాగు చేసేవారు.  

జగన్‌ హయాంలో ప్రోత్సాహం
గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో పట్టు సాగుకు ప్రోత్సాహం ఇచ్చేవారు. 2019కి ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు రూ.3 కోట్ల వరకు విడుదల చేసి రైతులకు పంపిణీ చేశారు. ప్రభుత్వ ప్రోత్సాహం పెంచడంతో రైతులు మల్బరీ సాగుపై ఆసక్తి చూపారు. గతంలో షెడ్ల నిర్మాణానికి యూనిట్‌ విలువ రూ.7 లక్షల వరకు ఉండగా మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు ప్రభుత్వం యూనిట్‌ విలువను రూ.10 లక్షలకు పెంచింది. దీనిలో పట్టు పరిశ్రమ ద్వారా రూ.3 లక్షలు, రైతు వాటాగా రూ.లక్ష, ఉపాధి పథకం ద్వారా రూ.6 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించారు. 

బయోల్టిన్‌ (తెలుపు) కిలోకు రూ.50, సీబీ (ఎల్లో కలర్‌)కు రూ.20 ఇన్సెంటివ్‌ ప్రభుత్వం ఇచ్చేది. గతంలో పలమనేరు, హిందూపురం, హనుమాన్‌ జంక్షన్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి పట్టును విక్రయించే పని లేకుండా గత ప్రభుత్వంలో ఈ–మార్కెట్‌ ద్వారా కొనుగోళ్లు జరపడంతో చేబ్రోలులోనే అమ్మకాలు నిర్వహించేవారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉండడంతో కేజీ పట్టు గూళ్లు రూ.900 వరకు అమ్ముడైన సందర్భాలున్నాయి.  

ప్రభుత్వ ప్రోత్సాహం కరువు 
గతంలో జిల్లాలో పండించిన పట్టుగూళ్లకు కిలో రూ.550 వరకు అమ్ముడు పోగా ప్రస్తుతం రూ.250కి కూడా కొనే వారు లేక తీవ్ర నష్టాల పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్‌లు సైతం రూ.4 కోట్ల మేర బకాయి పెట్టారని రైతులు చెప్తున్నారు. షెడ్ల నిర్మాణానికి ఇచ్చే ప్రోత్సాహకాలు అందడం లేదని, దీంతో ఎవరూ ఈ సాగు చేపట్టే పరిస్థితి లేదని రైతులు అంటున్నారు. వీటికి తోడు తెగుళ్లు పంటలను నాశనం చేస్తున్నాయి.  

సిల్క్‌ హబ్‌ ఎక్కడ...? 
ఎన్నికల్లో చేబ్రోలు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ పట్టు రైతులతో సమావేశం నిర్వహించి న్యాయం చేస్తానని, అండగా ఉంటానని, సిల్‌్కసిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటికీ ఆ ఊసు ఎత్తడం లేదని రైతులు వాపోతున్నారు. కొనే వారు లేక దీంతో రూ.లక్షల్లో నష్టం వచ్చే అవకాశం ఉండడంతో పంటను తీసేస్తున్నామంటున్నారు రైతులు.   

ప్రభుత్వం ఆదుకోవాలి 
కనీస పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోతున్నాం. అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకుని పట్టు రైతును ఆదుకోవాలి. లేకపోతే గొల్లప్రోలు మండలంలో పట్టు సాగు లేకుండా పోయే పరిస్థితి ఎదురవుతుంది.  – వులవకాయల రాంబాబు, పట్టు రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం 

ప్రత్యేకత ఉన్న పంటను పట్టించుకోపోతే ఎలా? 
పట్టు పరిశ్రమ అంటే దేశంలోనే అత్యంత ప్రాధాన్యమైనది. ఈ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వకపోవడం దురదృష్టకరం. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో పాత బకాయిలతో సహా ఇన్సెంటివ్‌ ఇచ్చి ఎక్కువ ధర వచ్చేలా చూసి పట్టు గూళ్లు ఇక్కడే కొనుగోలు జరిగేలా ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు కనీసం పట్టించుకోడం లేదు. ఇచ్చిన హామీలు విస్మరించారు. దానికి నిదర్శనమే పట్టుసాగు తగ్గిపోవడం. బకాయిలు వెంటనే విడుదల చేయాలి. లేకపోతే రైతులతో కలిసి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. – వంగా గీత, వైఎస్సార్‌ సీపీ కోఆర్డినేటర్, పిఠాపురం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement