
తెనాలిలో పోలీసుల మరో అకృత్యం
యువకుడి మృతిపై తీవ్ర అనుమానాలు
పోలీసులను చూసి చెరువులో దూకిన యువకుడు
అతడిని అదుపులోకి తీసుకుని తరలించిన పోలీసులు
రెండు రోజుల తర్వాత అదే చెరువులో మృతదేహం
చెరువులో దూకినపుడు ఉన్న దుస్తులు తర్వాత లేవు..
మృతుడి శరీరంపైన పలు చోట్ల తీవ్ర గాయాలు, న్యాయం చేస్తామని రాజీ కోసం పోలీసుల విశ్వప్రయత్నం..
పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు అత్యంత నిఘా
మా అబ్బాయిది ముమ్మాటికీ హత్యే..: తల్లి ఆరోపణ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెనాలి పోలీసుల రెడ్‌బుక్ రాజ్యాంగంలో మాతంగి భరత్ అనే యువకుడి ప్రాణం పోయింది. కోర్టు వాయిదాకు హాజరు కాకపోవడంతో ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు పేరుతో అతడిని పొట్టన పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెరువుగట్టు వద్ద నివాసం ఉంటున్న భరత్ ఇంటికి బుధవారం రాత్రి త్రీ టౌన్ ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ, మఫ్టీలో ఉన్న పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో భరత్, అతడి తమ్ముడు నవీన్, మరో ముగ్గురు మాట్లాడుకుంటున్నారు.
ఆటోలోంచి దిగిన ముగ్గురు పోలీసులు.. భరత్ అనుకుని మరొకరిని గట్టిగా పట్టుకున్నారు. దీంతో భరత్ పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకాడు. పోలీసులు కూడా చెరువులోకి దిగి వెంబడించారు. భరత్ ఈదుకుంటూ మరోవైపు వెళ్లగా అక్కడ మాటువేసిన మరికొందరు పోలీసులు పట్టుకుని బైక్ మీద తీసుకువెళ్లారని స్థానికులు చెబుతున్నారు.
ప్యాంట్ లేకుండా.. తీవ్ర గాయాలతో విగతజీవిగా
రెండు రోజుల తర్వాత శుక్రవారం ఉదయం భరత్ అదే చెరువులో విగతజీవిగా కనిపించాడు. అయితే, అతడు చెరువులో దూకే సమయంలో నల్ల ప్యాంట్, టి షర్ట్ ధరించి ఉన్నాడు. మృతదేహంపైన మాత్రం ప్యాంట్ లేదు. కట్ డ్రాయర్, టి షర్ట్ మాత్రమే ఉన్నాయి. భరత్ తొడలు వాచిపోయాయి. తల, ముఖంపై తీవ్రంగా, శరీరంపై గాయాలున్నాయి. దీంతో పోలీసులే కొట్టి చంపి, చెరువులో పడేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తీవ్రస్థాయిలో బెదిరింపుల మధ్య అంత్యక్రియలు
భరత్ మృతి తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాలను మరింత బలపరుస్తోంది. పోస్టుమార్టం నుంచి అంత్యక్రియల వరకు 5 పోలీస్ జీప్‌లు, ఒక స్పెషల్ పార్టీ బస్సు అనుసరించాయి. గతంలో తెనాలిలో పనిచేసి, ప్రస్తుతం జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులు వచ్చి.. భరత్ కుటుంబ సభ్యులతో రాజీ ప్రయత్నాలు చేయడం గమనార్హం.
పోలీసుల తప్పు లేకపోతే ఎందుకు ఈ తతంగం నడుపుతున్నారన్న ప్రశ్నలు స్థానికుల నుంచి వచ్చాయి. అంతేకాదు.. ‘‘ఎలాంటి హడావుడి చేయకుండా అంత్యక్రియలు జరిపించండి. తేడా వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’’ అని కుటుంబసభ్యులను బెదిరించినట్లు తెలిసింది. భరత్ శరీరంపై లాఠీదెబ్బలుంటే విచారించి న్యాయం చేస్తామని ఎలాంటి ఆందోళనలు చేయొద్దని కూడా కోరినట్లు సమాచారం.
» భరత్‌పై గత నవంబరులో త్రీ టౌన్ స్టేషనులో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో విచారణకు గైర్హాజరయ్యాడు. ఈ నెల 14న వాయిదా కోసం తెనాలిలోని పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో 9వ తేదీ రాత్రి పొద్దుపోయాక పోలీసులు భరత్ ఇంటికి వెళ్లారు. కాగా, భరత్ తో పాటు ఇద్దరు పోలీసులు చెరువులో దూకినా కొంతసేపటి తర్వాత అతడు దొరకలేదంటూ తిరిగివెళ్లారని చెబుతున్నారు.
అయితే, భరత్ విగతజీవిగా తేలేవరకు పోలీసులు చెరువు వైపు చూడకపోవడం అనుమానాలను మరింత తీవ్రం చేస్తోంది. భరత్ వారి వద్ద ఉన్నందునే పోలీసులు చెరువు వద్దకు మళ్లీ రాలేదని అంటున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సీరియస్ అయ్యారు. శనివారం సెట్ కాన్ఫరెన్స్‌లో తెనాలి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. తెనాలిలో వరుస ఘటనలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని డీఎస్పీపైనా నిప్పులు చెరిగినట్లు సమాచారం.
పోలీసులు చిత్రహింసలు పెట్టి నా బిడ్డను చంపేశారు
మావాడు ఎంతసేపైనా ఈదగలడు. అలాంటివాడు చెరువులో మునిగి ఎలా చనిపోతాడు? పోలీసులే పట్టుకెళ్లి చిత్రహింసలు పెట్టి చంపి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులను ఏమార్చి పారిపోయి ఉంటాడని అనుకున్నాం. శవమై తేలతాడని ఊహించలేదు. భరత్‌పై పోక్సో కేసు కూడా బూటకమే. పోలీసులకు ఎప్పుడేది అనిపిస్తే ఆ కేసు పెట్టడం, లోపల వేయడం అలవాటైంది. అబ్బాయిని తీసుకుని స్టేషన్‌కు రమ్మంటే తీసుకెళ్లేదాన్ని. చంపేయడం ఎందుకు? –భరత్ తల్లి సుశీల
బీర్జాల మీద కొట్టారు.. ఒంటిపైన లాఠీదెబ్బలు ఉన్నాయి
మా అన్నను ఐడీ పార్టీ కానిస్టేబుల్ మురళీ మరో పదిమంది కానిస్టేబుళ్లు కలిసి పట్టుకుని తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి చంపేశారు. అతడి ఒంటిపై లాఠీ దెబ్బలు ఉన్నాయి. బీర్జాల మీద కొట్టడంతోనే మరణించాడు. తర్వాత తెచ్చి చెరువులో వేసి తొక్కేశారు. పోలీసులు వెళ్లాక రాత్రంతా చెరువు చుట్టూ వెదికాం. కానీ, విగతజీవిగా కనిపించాడు. ఇది పోలీసులు చేసిన హత్యే. ఫిర్యాదు చేసినా కేసు పెట్టలేదు. తెనాలిలో పనిచేసిన నరసింహారావు అనే పోలీసు వచ్చి రాజీ ప్రయత్నాలు చేశారు. –భరత్ తమ్ముడు నవీన్
పోలీసులు చేసిన హత్యగా కనిపిస్తోంది
భరత్ మృతి పోలీసులు చేసిన హత్య అని స్పష్టంగా కనిపిస్తోంది. కుటుంబ సభ్యుల ఆరోపణలు బలమైనవే. అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన కేసును హత్య కేసుగా మార్చాలి. పోలీసుల ప్రమేయం ఉన్నందున, స్థానిక అధికారులు విచారిస్తే న్యాయం జరగదు. బయటి పోలీసులు లేదా సీఐడీతో విచారణ చేయించాలి. –జి.శాంతకుమార్, అధ్యక్షుడు, ఇండియన్ లాయర్స్ అసోసియేషన్