టీడీపీ కట్టల్లోకి వైఎస్సార్‌సీపీ ఓట్లు! 

Serious Mistake in the counting of Rayalaseema MLC elections - Sakshi

8వ రౌండులో ఆరు ఓట్లు టీడీపీ ఖాతాలోకి 

మొత్తం ఓట్లు తిరిగి లెక్కించాలని అభ్యర్థి  రవీంద్రారెడ్డి డిమాండ్‌ 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో తీవ్ర తప్పిదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి వేసిన ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండిల్స్‌లో కలిపారు. 8వ రౌండు ఓట్ల లెక్కింపులో 19వ టేబుల్‌ వద్ద ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారాన్ని గమనించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌంటింగ్‌ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ ఓట్లను తిరిగి లెక్కించగా ఆరు ఓట్లు  టీడీపీ కట్టలో కలిశాయని స్పష్టమైంది. దీనిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా ఎన్ని ఓట్లను ఇలా కలిపారోనన్న అనుమానం ఉందని, మొత్తం ఓట్లను తిరిగి లెక్కించాలని రిటర్నింగ్‌ అధికారి కేతన్‌గార్గ్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ కూడా రాశారు.

ఇంతమంది కౌంటింగ్‌లో ఉన్నప్పుడే ఇలా తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపేయడం దారుణమన్నారు. తొలి, రెండో రౌండులో వెయ్యి ఓట్లకు పైగా మెజారిటీ వస్తే, మూడో రౌండు నుంచి 20, 30 ఇలా తూకమేసినట్టు మెజారిటీ రావడంపైనా అనుమానాలున్నాయన్నారు. కాగా, ఒకసారి కౌంటింగ్‌ పూర్తయి బండిల్స్‌ను కలిపేస్తే తిరిగి లెక్కించడం కుదరదని, అభ్యంతరం వ్యక్తం చేసిన ఏ బాక్స్‌ అయినా తిరిగి లెక్కిస్తామని రిటర్నింగ్‌ అధికారి చెప్పారు. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top