
చిత్తూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారం కోసం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ఆందోళన ఉధృతమవుతోంది. ఉద్యోగ సంఘాల పిలుపుమేరకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయ్యారు. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రతిరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. అయితే, ఉద్యోగ సంఘాలు నిరసన నోటీసులిచ్చిన అనంతరం గత బుధవారం ఉద్యోగులను చర్చలకని పిలిచి, తర్వాత ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది.
ఉద్యోగులు మాత్రం తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి పాల్గొననున్నట్టు ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ప్రకటించగా, మరో ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తాము పింఛన్ల పంపిణీని బహిష్కరిస్తామని ప్రకటన జారీ చేసింది.
వలంటీర్ల విధులు మేం చేయం
చిత్తూరు కలెక్టరేట్: ‘వలంటీర్లు చేయాల్సిన పనులను కూటమి ప్రభుత్వం మాకు అప్పగించడం సరికాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేం వలంటీర్ల విధులను నిర్వహించం. ఈ ప్రభుత్వం సర్వేల పేరుతో ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఇంటింటి సర్వే నుంచి మాకు విముక్తి కల్పించాలి’ అని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు సోమవారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.
అనంతరం కలెక్టర్ సుమిత్‌కుమార్ గాందీకి వినతిపత్రం అందజేశారు. జేఏసీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వినోద్‌కుమార్ మాట్లాడుతూ కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వలంటీర్ పనులు అప్పగించడం అన్యాయమన్నారు. వలంటీర్లు చేసిన పనులన్నీ తాము చేయాలని ఒత్తిడి చేయడం సరికాదన్నారు.
జేఏసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేష్ మాట్లాడుతూ సర్వేల పేరుతో సచివాలయ ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. సచివాలయ ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూడటం తగదన్నారు. ఇతర శాఖల ఉద్యోగుల మాదిరిగానే సచివాలయాల ఉద్యోగులకు కూడా పదోన్నతుల కల్పించాలని డిమాండ్ చేశారు.