8 నుంచి జేఈఈ మెయిన్‌ రెండో విడత దరఖాస్తులు

Second installment applications for JEE Main From 8th April - Sakshi

మే 3 వరకు గడువు 

ముగిసిన మొదటి విడత దరఖాస్తు గడువు 

మొదటి సెషన్‌కు తక్కువ మంది హాజరయ్యే అవకాశం 

పలు రాష్ట్రాల్లో బోర్డుల ఇంటర్‌/+2 పరీక్షలు ముగియకపోవడమే కారణం 

21 నుంచి మే 4 వరకు జేఈఈ మెయిన్‌ మొదటి సెషన్‌ పరీక్షలు 

రాష్ట్రంలో మే 6 నుంచి 24 వరకు ఇంటర్‌ పరీక్షలు 

మే 24 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్‌ సెకండ్‌ సెషన్‌ పరీక్షలు 

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2022–23 తొలిదశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ గురువారంతో ముగిసింది. రెండో దశ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభం కానుంది. మే 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఇంటర్‌ పరీక్షలకు ముందే తొలిదశ మెయిన్‌ పరీక్ష 
జేఈఈ మెయిన్‌ తొలిదశ పరీక్షలు ఏప్రిల్‌ 21 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21, 24, 25, 29, మే 1, 4 తేదీల్లో ఇవి జరగనున్నాయి. ఏప్రిల్‌లోనే వివిధ బోర్డుల ఇంటర్మీడియెట్‌/+2 పరీక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ తొలివిడత పరీక్షలకు విద్యార్థుల హాజరు తక్కువగానే ఉండొచ్చని అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలను మే 6 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా తరగతులు సరిగ్గా జరగకపోవడంతో ఇంటర్‌ బోర్డు.. సిలబస్‌ను 30 శాతం మేర తగ్గించింది. అయితే జేఈఈ మెయిన్‌ సిలబస్‌ను మాత్రం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) యథాతథంగానే ఉంచింది. దీంతో విద్యార్థులు జేఈఈ మెయిన్‌ సిలబస్‌ను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి వస్తోంది.

ఓవైపు కరోనాతో విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఇంటర్‌ సిలబస్‌ను పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం కావడానికే విద్యార్థులకు సమయమంతా సరిపోతోందని అధ్యాపకులు చెబుతున్నారు. జేఈఈ ప్రిపరేషన్‌కు అదనపు సమయం అవసరమవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షల కంటే ముందు జరిగే జేఈఈ మెయిన్‌ తొలివిడత పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధం కాలేకపోతున్నారని పేర్కొంటున్నారు. దీంతో తొలివిడత పరీక్షకు నమోదు చేసుకున్నా హాజరు కావడం కష్టమేనని చెబుతున్నారు. ఇంటర్‌ పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించే జేఈఈ మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉంటారని వివరిస్తున్నారు. మెయిన్‌ రెండో సెషన్‌ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు జరగనున్నాయి. కాగా, జేఈఈ మెయిన్‌కి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఈసారి కూడా భారీగానే ఉండొచ్చని కోచింగ్‌ సెంటర్ల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా జేఈఈకి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య 10 లక్షలు దాటుతోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top