సారా రహిత పార్వతీపురమే లక్ష్యం...

SEB Officials Are Targeting Sara Free Parvatipuram - Sakshi

పార్వతీపురం టౌన్‌: సారా రహిత పార్వతీపురమే లక్ష్యంగా ఎస్‌ఈబీ అధికారులు అడుగులేస్తున్నారు. సారా తయారీ, విక్రయాలపై ముమ్మర దాడులు నిర్వహిస్తున్నారు. స్థానిక ఎస్‌ఈబీ స్టేషన్‌ పరిధిలో ఎక్కువ శాతం ఆంధ్రా, ఒడిశా సరిహద్దు గ్రామాలు ఉన్నందున ఒడిశా రాష్ట్రంలో తయారవుతున్న సారా పార్వతీపురం పట్టణ ప్రాంతానికి అక్రమార్కులు తరలిస్తున్నారు.

విషయాన్ని గ్రహించిన ఎస్‌ఈబీ అధికారులు పరివర్తన, అంతర్రాష్ట్ర ఆపరేషన్‌ పేరుతో ముమ్మరంగా దాడులు నిర్వహిస్తూ అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. సారా తయారీ కేంద్రాలపై పోలీసులతో కలసి ఎస్‌ఈబీ సిబ్బంది మెరుపుదాడులు గతంలో ఎన్నడూ లేనివిధంగా నిర్వహిస్తున్నారు. పార్వతీపురం ఎస్‌ఈబీ స్టేషన్‌ పరిధిలో సంవత్సర కాలంలో 578 కేసులు నమోదు చేసి 148 వాహనాలను సీజ్‌ చేశారు.  సారా రహిత ఆంధ్రప్రదేశ్‌గా  తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.

కఠినంగా వ్యవహరిస్తాం.. 
సారా రవాణా, అమ్మకాలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నాం. ఇటువంటి కేసుల్లో గరిష్టంగా ఎనిమిది సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమాన లేదా రెండూ విధిస్తారు. ఒకటికి పైబడి కేసుల్లో నిందితులు పట్టుబడితే నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేస్తాం.   
– ఎల్‌.ఉపేంద్ర, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఈబీ, పార్వతీపురం

దాడులు నిర్వహిస్తున్నాం.. 
సారా తయారీ కేంద్రాలపై  ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నాం. ఒడిశా రాష్ట్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న సారాపై ప్రత్యేక నిఘా పెట్టాం. గ్రామాల్లో సారా తయారీ, రవాణా చేయడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఒడిశా సరిహద్దుల్లో రూట్‌వాచ్‌లు నిర్వహించి కేసులు నమోదు చేస్తున్నాం. 
– ఎంవీ గోపాలకృష్ణ, టాస్క్‌ఫోర్స్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్, పార్వతీపురం   

(చదవండి: ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వీరఘట్టం వాసి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top