ఆయనకు కాళ్లు, ఒళ్లు పట్టాలి.. | SDC vijay Kumar Using Attenders For Personal Work Prakasam | Sakshi
Sakshi News home page

ఎస్‌డీ'ఛీ '

Aug 5 2020 1:11 PM | Updated on Aug 5 2020 6:20 PM

SDC vijay Kumar Using Attenders For Personal Work Prakasam - Sakshi

కాళ్లు పడుతున్న అటెండర్‌ గౌస్‌ ,ఎస్‌డీసీ ఒంటికి మసాజ్‌ చేస్తున్న అటెండర్‌ అనిల్‌

బేస్తవారిపేట: రాజ్యాలు పోయాయి.. రాజులు పోయారు..రాచరికం అంతమైంది..కానీ అదే రాచరికపు పోకడలను గుట్టుగా కొనసాగిస్తున్నాడు ఓ ఉన్నతాధికారి. ఉన్నత ఉద్యోగం చేస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి తనకింది స్థాయి సిబ్బందితో ఊడిగం చేయించుకుంటున్నాడు. రాచరికపు పోకడలను అనుసరిస్తూ తనను తాను రాజులా భావించుకుంటున్నాడు. సిబ్బందితో చెయ్యకూడని పనులు చేయించుకుంటూ హీనాతి హీనంగా చూస్తుండటంతో కాంట్రాక్ట్‌ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఆ అటెండర్లు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తన ప్రవర్తనతో విసుగు చెందిన సిబ్బంది కలెక్టర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  

ఇదీ..కథ 
బేస్తవారిపేట మండలం చింతలపాలెం వద్ద వెలిగొండ ప్రాజెక్ట్‌ భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయంలో ఐదుగురు అటెండర్లు ఉన్నారు. ఎస్‌డీసీ ఎన్‌.విజయ్‌కుమార్‌ వారిని హీనంగా చూస్తున్నారు. ప్రభుత్వ నుంచి హౌస్‌ రెంట్, టీఏ, డీఏ పొందుతూ కార్యాలయంలోనే నివాసం ఉంటున్నాడు. కంభంలో నివాసం ఉండే అటెండర్‌ అనిల్‌ ఉదయం ఐదు గంటలకే వేడినీళ్లు, కాఫీ తీసుకురావాలి. అటెండర్లు కాళ్లు పట్టాలి అవసరమైతే ఆయన ఒంటికి మసాజ్‌ చేయాలి. అంతేకాదు ఆయన దుస్తులను సైతం ఉతికి శుభ్రం చేసి పెట్టాలి. ఇవి చేయకుంటే బూతు పురాణం మొదలు పెడతాడు. ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తుండటంతో ఏడాదిగా అటెండర్లు మనసు చంపుకుని చాకిరీ చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేసే ఓ చిరుద్యోగి రోజూ మధ్యాహ్నం భోజనం ఉచితంగా పట్టుకు రావాల్సిందే. కార్యాలయంలోనే నివాసం ఉంటుండటంతో టీవీ ఒకరు, సన్‌ డైరెక్ట్‌ ఒకరు తెచ్చి పెట్టే వరకు ఒప్పుకోలేదు.  వెహికిల్‌ అలవెన్స్‌లు తీసుకుంటున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ఆ దొర కోసం కోళ్లు పెంచాలి  
క్యాంపుకు వెళ్లివచ్చేటప్పుడు సదరు ఉన్నతాధికారి రైతుల నుంచి కోళ్లు పట్టుకొస్తాడు. మీరు ఏం పెట్టి పెంచుతారో తనకు తెలియదని, పది రోజుల్లో మంచి సైజు రావాలంటూ ఆయన అటెండర్లను ఆదేశిస్తాడు. కోడిని కార్యాలయంలోనే కట్టేసి పెంచాల్సిన దుస్థితి. బాగా పెరిగిన తర్వాత ఆయన ఇంటికి పంపాల్సిన బాధ్యత కూడా అటెండర్లదే.

నెల్లూరు వెళ్లి బాత్‌రూమ్‌లు శుభ్రం చేయాల్సిందే 
అటెండర్‌గా పనిచేసే మురళికి డ్రైవింగ్‌ కూడా వచ్చు. ఆయన్ను తన కారుకు డ్రైవర్‌గా ఉపయోగించుకుంటున్నాడు. నెల్లూరు, విజయవాడ, కడప ప్రాంతాల్లో తన సొంత అపార్ట్‌మెంట్లకు మురళిని తీసుకెళ్తాడు. మూడు.. నాలుగు రోజులు అక్కడే ఉండాల్సి రావడంతో కరోనా సమయంలో ఇంట్లో ఉన్న ముసలి తల్లిదండ్రుల ఆలనపాలన చూసుకోలేక మురళి తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. నెల్లూరు అపార్ట్‌మెంట్‌లో ఎవరైనా ప్లాట్‌ ఖాళీ చేస్తే దానిలో టాయిలెట్స్, లెట్రిన్‌ క్లీన్‌ చేయాలి. గృహాల్లో బూజు దులపాలి. ఉన్నత ఉద్యోగం చేస్తూ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను సైతం సదరు అధికారి కాజేశాడు. ఫ్యాన్‌లు, బాత్‌రూమ్‌ షింక్‌లు నెల్లూరులోని తన సొంత ఇంటికి చేర్చుకున్నాడు. 

కలెక్టర్‌కు ఫిర్యాదు  
వ్యక్తిగత పనులు చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తానని వెలిగొండ ప్రాజెక్ట్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయ్‌కుమార్‌ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రిజిస్టర్‌ పోస్టులో ఫిర్యాదును కలెక్టర్, సీఏం కార్యాలయానికి బాధితులు పంపారు. సొంత పనులు చేస్తూ రాత్రి పూట కూడా కాపాలాగా ఉండాల్సిన పరిస్థితి ఉందని, కాళ్లు పట్టించుకోవడం, మరుగుదొడ్లు శుభ్రం చేయించుకోవడం వంటి పనులు చేస్తున్నాడని వారి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement