ఇసుకపై మళ్లీ అదే అక్కసు

Sand mining only in the reaches with environmental clearances - Sakshi

అక్రమ తవ్వకాలంటూ ఈనాడు రామోజీ అర్థంపర్థంలేని ఆరోపణలు

పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు

కలెక్టర్ల తనిఖీలపైనా అడ్డగోలు వ్యాఖ్యలు

ఒకవైపు తనిఖీలు జరుగుతున్నాయని రాస్తూనే... మరోవైపు ఎన్జీటికి నివేదికను ఇచ్చారంటూ పొంతనలేని రాతలు

టీడీపీ పాలనలో పెద్దఎత్తున ఇతర రాష్ట్రాలకు ఇసుక అక్రమ తరలింపు 

నాడు ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌ పైనే టీడీపీ నేతల దాడి

టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ద్వారా రావాల్సిన రూ.3,825 కోట్లకు గండి

ఈ దారుణాలను అడ్డుకునేందుకే అత్యంత పారదర్శకంగా ఇసుక విధానం రూపొందించిన జగన్‌ ప్రభుత్వం

ఇసుక పాలసీ ద్వారా గతంలో జరిగిన ఇసుక దందాకు చెక్‌ 

గత ప్రభుత్వంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి రూ.100 కోట్లు జరిమానా

ప్రస్తుత ప్రభుత్వపు ఇసుక పాలసీపై ఎన్జీటి సంతృప్తి 

దీంతో గతంలో విధించిన జరిమానా రద్దు

అయినా అసత్యాలు, అభూతకల్పనలతో రామోజీ దిగజారుడు కథనాలు

సాక్షి, అమరావతి: అసలే కోతి.. కల్లు తాగింది.. ఆపై నిప్పు తొక్కితే ఎలా ఉంటుంది..? ఈనాడు రామోజీరావు పరిస్థితి ఇప్పుడు అచ్చు అలాగే ఉంది. సీఎం వైఎస్‌ జగన్, రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక విషం చిమ్మందే తెల్లారని రాజగురువు పాడిందే పాడరా పాచిపళ్ల దాసరా.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇసుక తవ్వకాలపై ఇప్పటికే టన్నుల కొద్దీ అబద్ధాలను తన విషపుత్రిక ఈనాడులో అచ్చేసిన ఆయన ఇప్పుడు మరోసారి తన పైత్యాన్ని ప్రదర్శించి వికృత రాతలతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. జిల్లా కలెక్టర్లు చేసిన తనిఖీలను అడ్డగోలుగా వక్రీకరించి తన వక్రబుద్ధిని మళ్లీ బయటపెట్టుకున్నారు.

ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్‌ జగన్‌పైనా గుడ్డి వ్యతిరేకతతో ప్రతి విషయాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుని పారదర్శకంగా జరుగుతున్న ఇసుక తవ్వకాలపై అవాస్తవాలు, అభూత కల్పనలు ప్రచురించారు. 

బాబు పాలనలో తవ్వకాల బరితెగింపు..
నిజానికి.. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగింది. సహజ వనరుల ద్వారా వచ్చే రెవెన్యూని ప్రజాసంక్షేమానికి వినియోగించడానికి బదులు, ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. ప్రజలు ఇసుక కొనుగోలు చేయడానికి బ్లాక్‌ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి అరాచకాలను నిర్మూలించేందుకు సీఎం జగన్‌ కొత్త ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొ­చ్చారు. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలను ఒక క్రమపద్ధతిలో నిర్వహించేలా చేస్తున్నారు.

ఎక్కడా ఇసుక కొరత లేకుండా, అందు­బాటు ధరలోనే, కావాల్సినంత ఇసుకను పొందే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ కోసం పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందిన మినీరత్న ఎంఎస్‌టీసీ ద్వారా టెండర్లు నిర్వహించారు. అందులో సక్సెస్‌ఫుల్‌ బిడ్డర్లుగా ఎంపికైన ఏజెన్సీలు ఇసుక ఆపరేషన్స్‌ ప్రారంభించాయి. పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగు­తున్నాయి.

ఎక్కడా నిబంధనల ఉల్లంఘన లేదు. సంబంధిత శాఖల అనుమతులతోనే రిజర్వాయ­ర్లలో డీసిల్టింగ్‌ జరుగుతోంది. దీనిపై పర్యవేక్షణ, నిఘా కోసం ఎస్‌ఈబీని ఏర్పాటుచేశారు. అలాగే, జిల్లా స్థాయిలో రెవెన్యూ, పోలీస్, గనుల శాఖ అధికారులు కూడా తమకు ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక విజిలెన్స్‌ స్క్వాడ్‌ కూడా గనుల శాఖలో పనిచేస్తోంది. అంతేకాక.. రాష్ట్ర సరిహద్దులతో పాటు కీలకమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. 

బాబు హయాంలో దోపిడీకి ఈనాడు వత్తాసు..
అసలు చంద్రబాబు పాలనలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరిగినా రామోజీరావు, ఈనాడు పత్రిక కళ్లుమూసు­కున్నాయి. మహిళా సంఘాలకు ఇసుక తవ్వకాలను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించిన ఘనత చంద్రబాబుది.

ఆ తర్వాత ఉచిత ఇసుక విధానం పేరుతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. టీడీపీ నేతల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయో­గపడింది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ.3,825 కోట్ల ఆదాయానికి గండిపడింది. ఈ సొమ్మంతా ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది. మరోవైపు.. ప్రజలు అధిక ధరల్లో బ్లాక్‌ మార్కెట్‌లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు.

అప్పట్లో ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వోపైనే నాటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్‌ దాడిచేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దంపట్టింది. గత టీడీపీ ప్రభుత్వంలో ఇసుక లారీలు పెద్దఎత్తున పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కాపత్రం లేకుండా విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. 

పలు రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా..
ఇక మన రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్, పర్యవేక్షణకు పారదర్శకంగా అనుసరిస్తున్న విధానాలను పలు రాష్ట్రాలకు చెందిన మైనింగ్‌ అధికారులు కూడా పరిశీలించి, తమ రాష్ట్రాల్లో మోడల్‌గా అమలుచేసేందుకు విధానాలు రూపొందించుకుంటున్నారు. ఇవన్నీ ఈనాడుకు కనిపించడంలేదు. ఒకవేళ కనపడినా కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తూ.. అక్రమాలకు ప్రోత్సహి­స్తున్నా­రని, దాడులకు సంబంధించిన సమాచారం ముందే లీక్‌ చేస్తున్నారంటూ అసత్యపు రాతలు రాస్తోంది.

పొంతనలేని రాతలతో తప్పుడు ఆరోపణలు..
మరోవైపు.. రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలకు సంబంధించి అక్కడక్కడా వచ్చిన ఆరోపణలపై పలు జిల్లాల్లో కలెక్టర్లు, సంబంధిత అధికారులతో కూడిన బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీలు జరుగుతున్నాయని రాసిన ఈనాడు.. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు రీచ్‌ల వైపు రాలేదని, మరికొన్నిచోట్ల గనులు, కాలుష్య నియంత్రణ, భూగర్భ జలశాఖ, ఎస్‌ఈబీ అధికారులతో కమిటీలు వేసి వారితో తనిఖీలు చేయించారంటూ పొంతనలేని రాతలు రాసింది.

అలాగే, తనిఖీలు కొనసాగుతుంటే.. అప్పుడే ఎన్జీటీకి నివేదికలు ఇచ్చారంటూ అడ్డగోలు వాదనకు తెరతీసింది. వాస్తవంగా ఏం జరుగుతుందో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, కేవలం అధికారులపై బురదజల్లే ఉద్దేశంతోనే పరస్పరం పొంతనలేని కథనాలతో తప్పుడు ఆరోపణలు చేస్తోంది.

ఏటా రూ.785 కోట్ల ఆదాయం..
ఇప్పుడు ప్రతిఏటా ప్రభుత్వానికి రూ.785 కోట్లు ఆదాయం వస్తోంది. టన్ను ఇసుక ఓపెన్‌ రీచ్‌లలో రూ.475కి విక్రయిస్తున్నారు. అలాగే, రీచ్‌లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది.

అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, లేదా ఇసుక కొనుగోళ్లు, రవాణాలో ఎటువంటి సమస్యలున్నా టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ఇసుక తవ్వకాలపై పదేపదే అక్కసు వార్తలు వండి వారుస్తోంది.

ఎన్జీటీ సంతృప్తి.. ఈనాడు మొద్దు నిద్ర..
ఇప్పుడు సీఎంగా వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత.. పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక తవ్వకాలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే.

కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తంచేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాల­వల్ల విధించిన రూ.100 కోట్ల జరి­మానాను కూడా రద్దుచేసింది. ఈ విషయం తెలిసినా ఈనాడు తెలియ­నట్లు మొద్దునిద్ర నటిస్తోంది.

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top