ప్రేక్షకుడిపై భారం పడకూడదనే.. 

Same guidelines for all movies about ticket prices - Sakshi

సామాన్యుడికి అందుబాటులో సినిమా టికెట్ల ధరలు  

అన్ని సినిమాలకు ఒకే తరహా మార్గదర్శకాలు

కానీ, వకీల్‌సాబ్‌ కోసమే ధరలు మార్చారంటూ టీడీపీ, బీజేపీ, జనసేన రాద్ధాంతం 

సాక్షి, అమరావతి: వినోదం కోసం సినిమా థియేటర్‌కు వెళ్లే సగటు ప్రేక్షకుడిపై భారం పడకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రతిపక్షాలు అనవసర రాజకీయం చేసి రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కొత్త సినిమా పేరుతో అడ్డగోలుగా ధరలు పెట్టి, ఇష్టం వచ్చినన్ని షోలు వేసి ప్రేక్షకుల జేబులు గుల్లచేయడానికి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుడ్డిగా వ్యతిరేకించడం ఎంతవరకూ సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రేక్షకులకు మేలు జరిగేలా తీసుకున్న నిర్ణయాలను వక్రీకరించి.. పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించిన వకీల్‌సాబ్‌ సినిమాను అడ్డుకోవడం కోసమే కొత్త నిబంధనలు తెచ్చారని బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి సునీల్‌ దేవ్‌ధర్, చంద్రబాబు, జనసేన నాయకులు ఈ సినిమా రేట్లపై రాద్ధాంతం చేయడం వెనుక రాజకీయ లబ్ధి కోణమే తప్ప సామాన్యుల కోణం ఏమాత్రం కనిపించడంలేదు.  

ఉన్నతస్థాయి కమిటీ మార్గదర్శకాలు.. 
సినిమా టికెట్ల ధరలు ఎంత ఉండాలనే దానిపై ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. సామాన్యులకు అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలు నిర్ణయించింది. ఈ రేట్లకు మించి అమ్మితే థియేటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. థియేటర్లలో సౌకర్యాలు, పార్కింగ్, అక్కడ అమ్మే తినుబండారాల ధరలపైనా మార్గదర్శకాలు ఇచ్చింది. అన్నింటికీ మించి కొత్త సినిమాలు విడుదలైనప్పుడు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేసి టికెట్లు అమ్మే విధానానికి స్వస్తి పలికింది. అందరికీ ఒకే ధరలో టికెట్లు అందేలా చర్యలు తీసుకుంది. 24 గంటలపాటు షోలు వేసే విధానానికి అడ్డుకట్ట వేసింది. ఈ నిబంధనలు రాష్ట్రంలో విడుదలయ్యే చిన్నా, పెద్దా అన్ని సినిమాలకు వర్తిస్తాయి. 

అందరికీ ఒకే ధరలు 
సామాన్య, మధ్యతరగతి ప్రేక్షకులు సరదాగా సినిమాకెళ్లి ఎంజాయ్‌ చేయడం కోసమే మేం టికెట్ల ధరలను నిర్ణయించాం. ఇవి ఏ హీరోకైనా, ఏ సినిమాకైనా ఒకటే. కొత్త సినిమాలు విడుదలైతే టికెట్లు ఎక్కువ రేట్లకు అమ్మడం, బ్లాక్‌లో అమ్మడం వంటి వాటికి చెక్‌ పెట్టాం. దీనివల్ల సామాన్యులకు మేలు జరుగుతుంది.  
– పేర్ని నాని.. రవాణా, సినిమాటోగ్రఫీ మంత్రి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top