దీపికా పాటిల్‌ నిజంగా ధైర్యే సాహసే లక్ష్మి! 

Sakshi Interview With SP Deepika Patil On Varalakshmi Vratam Puja

మౌనరోదన వద్దు మనోధైర్యమే రక్షణ 

మహిళలు, యువతులకు భరోసా 

'దిశ’ యాప్‌ వినియోగంపై చైతన్యం  

ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక వీడియో ప్రదర్శన 

సాక్షి ఇంటర్య్వూలో ఎస్పీ దీపికా పాటిల్‌

సాక్షి , విజయనగరం: సమస్త ప్రకృతినీ స్త్రీ మూర్తిగా ఆరాధించే సంప్రదాయం భారతీయులది. ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ ఉత్తమ సమాజం పరిఢవిల్లుతుంది. అందుకు భిన్నంగా కొందరు కామాంధులు మహిళలు, యువతులు, చివరకు చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి పైశాచిక వ్యక్తుల పీచమణచడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ‘దిశ’ చట్టంతో నాంది పలికింది. మహిళా ప్రపంచానికి భరోసా ఇచ్చేందుకు దిశ యాప్‌ను తీసుకొచ్చింది. మౌనరోదన వీడి మనోధైర్యంతో దిశ యాప్‌ ద్వారా ఎస్‌ఓఎస్‌ లేదా స్పీడ్‌ డెయిల్‌తో సమాచారం ఇస్తే చాలు తగిన రక్షణ కల్పిస్తామని ఎస్పీ దీపికా పాటిల్‌ తెలిపారు. శ్రావణ శుక్రవారంతో మహిళలు చైత న్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. మహిళా లోకానికి ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. గురువారం ‘సాక్షి’ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... 

‘దిశ’పై బస్సుల్లో ప్రత్యేక వీడియో ప్రదర్శన... 
దిశ యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించడానికి వినూత్న కార్యక్రమాలు చేస్తున్నాం. ఆండ్రాయి డ్‌ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి బస్సులు ఏర్పాటు చేశాం. అవి పోలీస్‌ శాఖకు సంబంధించినవి. సాధారణ ప్రయాణానికి వీలుకావు. ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడాం. ఎంపిక చేసిన పోలీసులు ఆర్టీసీ బస్సుల్లో వెళ్తూ ప్రయాణికులకు దిశ యాప్‌ వినియోగంపై అవగాహన కల్పిస్తారు. విజయనగరం నుంచి ప్రతిరోజూ 165 వరకూ బస్సులు దూర ప్రాంతాలకు వెళ్తున్నాయి. వాటిలో ఉండే టీవీల్లో ‘దిశ’పై ప్రత్యేకంగా రూపొందించిన వీడియో ఫిల్మ్‌ను ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశాం. ఢిల్లీలో బస్సులో వెళ్తున్న యువతిపైన, పొరుగు రాష్ట్రంలో మహిళా డాక్టర్‌పై జరిగిన అఘాయిత్యాల వంటివి చెక్‌ చెప్పేందుకు ఏపీ సర్కారు దిశ చట్టానికి అంకురార్పణ చేసింది. బస్సుల్లో ప్రయాణించే మహిళలు, విద్యార్థినులకు దిశచట్టం, యాప్‌ వినియోగంపై చైతన్యం చేస్తున్నాం. 

మందుబాబుల ఆటకట్టు... 
జిల్లాలో మహిళలపై జరిగిన నేరాలను పరిశీలిస్తే ఎక్కువ అఘాయిత్యాలు మామిడి తోటలు, నగర శివార్లలోని లేఅవుట్లు, నిర్మానుష్యంగానున్న బహిరంగ ప్రదేశాల్లోనే చోటుచేసుకున్నాయి. అక్కడ బహిరంగ మద్యపానమే దీనికి కారణం. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ దృష్యానే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై కేసులు నమోదు చేస్తున్నాం. గత నెలలో రోజుకు వంద వరకూ ఉండేవి. పోలీసుల నిరంతర నిఘా ఫలితంగా ఇప్పుడు 50కి మించట్లేదు. వాటిని ఇంకా తగ్గించాలి. మందుబాబుల సమాచారం ఇవ్వాలని ఆయా లేఅవుట్లు, తోటల్లో ఉంటున్న వాచ్‌మన్‌లకు పోలీసులతో అవగాహన కల్పిస్తున్నాం.

 

పదేపదే నేరాలకు పాల్పడేవారిపై షీట్‌.. 
ఇటీవల గుర్ల పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ 35 ఏళ్ల ఆటో డ్రైవర్‌ 14 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాచిపెంట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఓ ఉపాధ్యాయుడు బాలికపై లైంగిక వేధింపులకు తెగించాడు. సాధారణంగా వారి వయసును బట్టి చూస్తే వారు ఇలాంటి దారుణాలకు  పాల్పడతారని ఎవరూ అనుమానించరు. అందుకే మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిపై పోలీసుస్టేషన్‌లో షీట్‌ తెరిచే ఉంటుంది. వారిపై నిరంతర నిఘా ఉంటుంది. వారి నేర తీరును కుటుంబసభ్యులకు ‘దిశ’ పోలీసులు చెబుతారు. పరిసర ప్రాంతాల వారినీ అప్రమత్తం చేస్తారు.  

నేరగాళ్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌... 
మహిళలపై ముఖ్యంగా చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిలో పైశాచిక మనస్తత్వం ఉంటుంది. వారానికి ఒకసారి సైకాలజిస్టుతో కౌన్సెలింగ్‌ చేయిస్తున్నాం. ఇప్పటికే కొన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది.  

సైబర్‌ నేరాలపైనా అవగాహన... 
ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌మీడియాలో స్నేహాల పేరుతో మోసపోతున్న మహిళలు, యువతుల సంఖ్య మన జిల్లాలోనూ పెరుగుతోంది. సైబర్‌ నేరాల సంఖ్య ఎక్కువవుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటీఎం కార్డు వినియోగం కూడా తెలియనివారు ఉన్నారు. మహిళలు, యువతులు సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా అవగాహన కల్పించే మూడు రోజుల ప్రత్యేక శిక్షణను త్వరలోనే ప్రారంభిస్తాం. మహిళా పోలీసులు, డ్వాక్రా మహిళల ప్రతినిధులు, టీచర్లు, బ్యాంకర్లు, పోలీసులను భాగస్వాములను చేస్తున్నాం.  

బాధితులకు ‘దిశ’ భరోసా... 
మహిళలు, యువతులు, బాలికలు తమపై జరిగిన అఘాయిత్యాలను ధైర్యంగా పోలీసులకు చెప్పాలి. దీనివల్ల నేరగాళ్లపై సత్వరమే కేసు నమోదు చేస్తూ పోలీసు శాఖ ఆయా బాధితురాళ్లకు అండగా నిలబడుతుంది. దిశ కేసులకు ప్రత్యేకంగా ఒక డీఎస్సీని ప్రభుత్వం నియమించింది. దిశ పోలీసుస్టేషన్‌లో సగం మంది మహిళా పోలీసులే ఉంటారు. ఎస్సై కూడా మహిళే ఉన్నారు. ఆ కేసులను సత్వరమే పరిష్కరించడానికి ప్రత్యేక నైపుణ్యం ఉన్న పోలీసులను ఒక ప్రత్యేక పరీక్ష ద్వారా ఎంపిక చేసి నియమించాం. హెల్స్‌ డెస్క్‌లోనూ మహిళనే ఉంచుతున్నాం. 

‘దిశ’ సద్వినియోగంతోనే రక్షణ... 
పాచిపెంట ఘటనలో బాధితురాలు దిశ ఎస్‌వోఎస్‌ను పంపడం వల్లే నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోగలిగాం. జిల్లాలో ఇప్పటివరకూ 3.38 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలో స్మార్ట్‌ ఫోన్ల వాడకం తక్కువ. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంటర్‌నెట్, సిగ్నల్స్‌ తదితర సాంకేతిక సమస్యలు ఉన్నాయి. అందుకే అలాంటిచోట్ల సాధారణ ఫోన్లలో స్పీడ్‌ డయిల్‌ ఆప్షన్‌ పెట్టిస్తున్నాం. కీ ప్యాడ్‌పై 1 నంబరు నొక్కగానే పోలీసులకు లోకేషన్‌ సహా సమాచారం వచ్చేస్తుంది.   

మహిళలపై అఘాయిత్యాలు సాగవిక... 
అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా ఉన్న చీకటి ప్రదేశాలు, మహిళలపై గతంలో తరచుగా దాడులు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించాం. ఈవ్‌టీజింగ్‌ జరుగుతున్న కళాశాలల పరిసర ప్రాంతాలు, బస్టాప్‌లు, నగరాల్లో మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలు ఇలా... జిల్లాలో దాదాపు 225 వరకూ ఉన్నాయి. అక్కడ నిఘాకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. ఫుట్‌ పెట్రోలింగ్‌ కూడా చేస్తారు. ఒకవేళ ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే దిశ యాప్‌ ద్వారా ఎస్‌ఓఎస్‌ను పోలీసులకు ఏవిధంగా పంపించాలో బాధితులకు అవగాహన కల్పించేలా బోర్డులు పెట్టిస్తున్నా. ఫోన్‌ నంబర్లు కూడా ఉంటాయి. అత్యాచారం, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్‌ వంటి నేరాలకు పాల్పడితే ఎంతటి కఠిన శిక్షలు పడతాయో ఆకతాయిలకు హెచ్చరికలు కూడా ఉంటాయి. డ్రోన్‌తోనూ నిఘా ఉంచుతున్నాం. ప్రతి రోజూ ఏదొక ప్రదేశంపై డ్రోన్‌ సర్వైలెన్స్‌ ఉంటుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top