16 నుంచి అయ్యప్ప దర్శనం

Sabarimala Ayyappa darshanam from 16th November - Sakshi

శబరిమలకు రాష్ట్రం నుంచి 5 లక్షలకు పైగా భక్తులు వెళ్తారని అంచనా

ఆలయ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకున్న వారికే అనుమతి  

యాత్ర మార్గంలోనూ స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాలు 

ప్లాస్టిక్, యూజ్‌ అండ్‌ త్రో సంచుల వినియోగంపై ఆంక్షలు 

భక్తులు గుడ్డ సంచుల్ని మాత్రమే తెచ్చుకోవాలని కేరళ ప్రభుత్వ సూచన 

దక్షిణాది రాష్ట్రాల దేవదాయ శాఖ అధికారులతో కేరళ మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ 

సాక్షి, అమరావతి: నిర్దిష్ట వేళల్లో మాత్రమే కొనసాగే శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 18వ తేదీ వరకు ఈ విడత దర్శనాలు కొనసాగుతాయి. కేరళలోని శబరిమల అయ్యప్ప దర్శనానికి రాష్ట్రం నుంచి ఈసారి 5 లక్షలకు పైగా భక్తులు తరలివెళ్తారని అంచనా.

వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టే చర్యల్లో భాగంగా ఏటా శబరిమల యాత్ర ప్రారంభానికి ముందు కేరళ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వివిధ దక్షిణాది రాష్ట్రాల దేవదాయ శాఖ మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన ఏర్పాట్లపై కేరళ మంత్రి రాష్ట్ర దేవదాయ శాఖ అధికారులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల అధికారులతో మూడు రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే దర్శనం 
కరోనా నేపథ్యంలో మూడేళ్లగా శబరిమల ఆలయానికి సంబంధించిన ‘వర్చువల్‌ క్యూ సిస్టమ్‌’ ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే ఆలయ అధికారులు దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ ఏడాది కూడా ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారినే అనుమతిస్తున్న విషయాన్ని ఏపీలోని భక్తులకు తెలిసేలా ప్రచారం చేయాలని కేరళ మంత్రి విజ్ఞప్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం శబరిమలకు వచ్చే మార్గంలోని నిలక్కల్, ఎడతావళం ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.  

ఆలయాల్లో ప్రత్యేక బోర్డులు 
శబరిమల యాత్రకు వెళ్లే భక్తులు పాటించాల్సిన నిబంధనల్ని తెలియజేసేలా రాష్ట్రంలోని పెద్ద ఆలయాల్లో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసేలా రాష్ట్ర దేవదాయ శాఖ చర్యలు చేపట్టింది. రూ.25 లక్షలకు పైబడి ఆదాయం వచ్చే దాదాపు 270 ఆలయాల్లో  ఈ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కేరళ ప్రభుత్వం చేసిన సూచనలతో తెలుగులో బుక్‌లెట్‌ రూపొందించి, వాటిని ఆయా ఆలయాల వద్ద ఆయ్యప్ప భక్తులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 

ఈ నిబంధనలు తప్పనిసరి 
► దర్శనాలకు వచ్చే భక్తులు వైద్యుడు ఇచ్చే మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. 
► భక్తులు ప్లాస్టిక్, వాడి పడేసే కొన్ని రకాలైన పేపర్లు వంటివి కలిగి ఉండకూడదని.. కప్పులు, గ్లాస్‌లు వంటివి ఒకసారి వాడిన తర్వాత కడుక్కొని తిరిగి వాడుకోవడానికి అవకాశం ఉండేవి మాత్రమే వెంట తీసుకెళ్లాలి. అన్నిరకాల ప్లాస్టిక్‌ వస్తువులు, యూజ్‌ అండ్‌ త్రో కవర్ల వినియోగంపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 
► గుడ్డ సంచులను మాత్రమే భక్తులు వెంట తీసుకువెళ్లాలి.  
► పంబ, అయ్యప్పస్వామి ఆలయ సన్నిధానం ప్రాంతాల్లో సెల్‌ఫోన్ల వాడకంపై నిషేధం అమలులో ఉంటుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top