పోర్టుల అభివృద్ధికి రూ.395 కోట్లు

Rs 395 crore for port development - Sakshi

భూసేకరణ, మౌలిక వసతుల కల్పనకు వినియోగం

ఆగస్టులో రామాయపట్నం పోర్టు పనులు ప్రారంభం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోర్టుల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా ఏర్పాటు చేసే పోర్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.395 కోట్లు కేటాయించింది. వీటి ద్వారా ప్రస్తుత పోర్టుల హ్యాండిలింగ్‌ సామర్థ్యాన్ని 110 టన్నులకు చేర్చడంతో పాటు పోర్టుల నిర్వహణ సామర్థ్యాన్ని 62 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కాకినాడ పోర్టులో రూ.43 కోట్లతో మౌలిక వసతులు పెంచడంతో పాటు సాగరమాల ప్రాజెక్టు కింద కాకినాడ యాంకరేజ్‌ పోర్టు సామర్థ్యాన్ని భారీగా పెంచనున్నారు. కొత్త లోడింగ్‌ ప్లాట్‌ఫామ్‌లు, భారీ నౌకలు సులభంగా వచ్చేందుకు డ్రెడ్జింగ్, కాంక్రీటు రోడ్డులు తదితర పనులు చేపట్టనున్నారు. అలాగే కొత్తగా నిర్మించే మచిలీపట్నం పోర్టులో రూ.150 కోట్లతో రోడ్లు, విద్యుత్‌ తదితర మౌలిక వసతులతో పాటు 250 ఎకరాలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భావనపాడు పోర్టు వద్ద 200 ఎకరాల భూ సేకరణకు రూ.100 కోట్లు, రామాయపట్నం వద్ద భూసేకరణకు రూ.100 కోట్లను కేటాయించింది. 

రుణ సమీకరణతో హార్బర్లు, పోర్టులు.. 
అంతేకాకుండా ఏపీ మారిటైమ్‌ బోర్డు రుణ సమీకరణ ద్వారా ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టుల నిర్మాణం చేపట్టనుంది. ఇందుకోసం తొలి దశలో రూ.1,500 కోట్ల రుణం తీసుకోనున్నట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు సీఈవో మురళీధరన్‌ తెలిపారు. ఇప్పటికే రామాయపట్నం పోర్టు టెండర్లు గెలుచుకున్న సంస్థ త్వరలోనే పనులు ప్రారంభించనుందని చెప్పారు. సాంకేతికంగా ఒకటి రెండు అనుమతులు రావాల్సి ఉన్నాయని, ఆగస్టు నుంచి పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. బందరు పోర్టుకు టెండర్లు పిలిచామని, వచ్చే నెల 5న ఈ ప్రక్రియ పూర్తయితే.. వేగంగా పనులు మొదలుపెట్టే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఫిషింగ్‌ హార్బర్లకు సంబంధించి నాబార్డు రుణం రాగానే పనులు మొదలు పెడతామన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top