హంద్రీ–నీవా కాలువ పనుల్లో.. రూ.3,000 కోట్లు కొట్టుకుపోయాయ్‌! | Rs 3000 Crores Swindled in Handri-Neeva Canal Works: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

హంద్రీ–నీవా కాలువ పనుల్లో.. రూ.3,000 కోట్లు కొట్టుకుపోయాయ్‌!

Apr 20 2026 5:34 AM | Updated on Apr 20 2026 5:35 AM

Rs 3000 Crores Swindled in Handri-Neeva Canal Works: Andhra Pradesh

అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో కూలిపోయిన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌

నీటి ప్రవాహం ఆగడంతో హంద్రీ–నీవా, పుంగనూరు, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ లైనింగ్‌ డొల్లతనం బహిర్గతం 

లైనింగ్‌ ఎక్కడికక్కడ కరిగిపోవడం, జారిపోవడం, గట్లు కోతకు గురవడంతో స్వరూపమే మారిన కాలువ

అత్యంత నాసిరకం పనులే కారణం.. భారీగా ప్రజాధనం వృథా అంటున్న ఇంజనీరింగ్‌ నిపుణులు, రైతులు 

నిబంధనలు తుంగలో తొక్కి పని స్వభావాన్ని మార్చేసిన కాంట్రాక్టర్లు 

ఈ అక్రమాన్ని గతేడాది జూలై 14న ‘ఈ లైనింగ్‌ దండుకునేందుకే’ శీర్షికన వెల్లడించిన ‘సాక్షి’ 

కాంట్రాక్టర్లు ఆర్వీఆర్, బీఎస్సార్, ఎస్సార్, రిత్విక్, మేఘా, వీపీఆర్‌ అందరూ ముఖ్యనేతకు సన్నిహితులే 

రూ.972.19 కోట్లతో రెండో దశ ప్రధాన కాలువ మూడు ప్యాకేజీల పనులు ఈనాడు కిరణ్‌ వియ్యంకుడు రాయల రఘు చేతికి.. రెండు ప్యాకేజీలు చంద్రబాబు సన్నిహితుడు బీఎస్సార్‌కు అప్పగింత 

రూ.319.6 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు.. రూ.480.22 కోట్లతో ఎన్‌సీసీకి పుంగనూరు బ్రాంచ్‌ కాలువ లైనింగ్‌ పనులు..  

సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి మొదటి దశ ప్రధాన కాలువ వెడల్పు.. రెండో దశ ప్రధాన కాలువ, దానిలో అంతర్భాగమైన పుంగ­నూరు బ్రాంచ్‌ కెనాల్‌(పీబీసీ), కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ (కేబీసీ) లైనింగ్‌ పనుల్లో డొల్లతనం బట్టబ­యలైంది. గత నెల 24న మల్యాల పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోయడం ఆపేయడంతో.. కాలువలో నీటి ప్రవాహం ఆగిపోయి పనితనం తేలిపోయింది. కర్నూలు, అనంతపురం జిల్లాలలో హంద్రీ–నీవా ప్రధాన కాలువ వెడల్పు మొదటి దశ పనులను ఇష్టారాజ్యంగా చేయడంతో ప్రవాహ ఉద్ధృతికి కాలు­వ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. కాంక్రీట్‌ నిర్మాణాలు ఉన్న చోట్ల నాసిరకంగా చేసిన లై­నింగ్‌ కొట్టుకుపోయింది.

ఇక అనంతపురం, శ్రీసత్య­సాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో హంద్రీ­–నీవా రెండో దశ, పీబీసీ, కేబీసీ కాలువ సైడ్‌ స్లోప్స్‌ (వాలు) సరిచేసి, గట్టిపరచకుండా నాసిరకంగా లైనింగ్‌ చేయడంతో అనేక చోట్ల జారిపోయింది. సిమెంటు కాంక్రీట్‌ కరిగిపోయి కొట్టుకుపోయింది. నిబంధనలు తుంగలో తొక్కి.. పని స్వభావాన్ని మా­ర్చేసి నాసిరకంగా లైనింగ్‌ చేస్తుండటాన్ని గతేడాది జూలై 14న ‘ఈ లైనింగ్‌ దండుకునేందుకే’ శీర్షికన ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తొలి దశ ప్రధాన కాలువ విస్తరణ పనులకు సంబంధించి గతంలో చేసినవే మళ్లీ ఇప్పుడు చేసినట్లుగా చూపడంపై ‘హంద్రీ–నీవాలో మహాపాతకం’ శీర్షికన గతేడాది జూలై 16న ప్రచురించిన కథనం ద్వారా ‘సాక్షి’ బహిర్గతం చేసింది.

ఆ కథనాలు అక్షర సత్యమన్నది హంద్రీ–నీవా కాలువను పరిశీలిస్తే స్పష్టమవుతోందని ఇంజనీరింగ్‌ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. రికార్డు సమయంలో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకునేందుకు నాసిరకంగా పనులు చేయడం వల్ల రూ.3 వేల కోట్ల మేర ప్రజాధనం వృథా చేశారని ఆరోపిస్తున్నారు. హంద్రీ–నీవా మొద­టి దశ ప్రధాన కాలువలో రోజుకు 3,850 క్యూసె­క్కులు తరలించేలా వెడల్పు చేసే పనులు, రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ లైనింగ్‌ పనులను రూ.­3,500 కోట్లతో చేపట్టి రికార్డు సమయంలో పూర్తి చేశామని చంద్రబాబు సర్కార్‌ గొప్పగా ప్రక­టించుకుంది.

గతేడాది జూలై 17న శ్రీశైలం జలా­శయం నుంచి హంద్రీ–నీవా ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడాన్ని అధికారులు ప్రారంభించి  మార్చి 24న ఆపేశారు. మొత్తం 248 రోజుల్లో 52.023 టీఎంసీలు తరలించినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఈ లెక్కన రోజుకు సగటున 2,427.46 క్యూసెక్కు­లను మాత్రమే తరలించారన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు సర్కార్‌ గొప్పగా ప్రకటించినట్లుగా రోజుకు 3,850 క్యూసెక్కులను ఎత్తిపోసి ఉంటే 248 రోజుల్లో హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు 82.50 టీఎంసీలు సరఫరా అయ్యేవని ఇంజనీరింగ్‌ నిపుణులు, రైతులు స్పష్టం చేస్తున్నారు. 2019–24 మధ్య కాలువను వెడల్పు చేయకున్నా రోజుకు గరిష్టంగా 2,850 క్యూసెక్కులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తరలించిందని.. దీన్ని బట్టి చూస్తే వెడల్పు, లైనింగ్‌ ముసుగులో చంద్రబాబు సర్కార్‌ భారీ ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నది స్పష్టమవుతోందని పేర్కొంటున్నారు.

రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా..
హంద్రీ–నీవా రెండో దశ కాలువ, పీబీసీ, కేబీసీ కాలువకు సిమెంట్‌ లైనింగ్‌ చేస్తే భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరు బావులు ఎండిపోతాయని.. పంటలు ఎండిపోయి తాము రోడ్డున పడతామని అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రైతులు ముక్తకంఠంతో వ్యతిరేకించినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 216.30 కి.మీ నుంచి 400–500 కి.మీ వరకు ఐదు ప్యాకేజీలుగా విభజించి ఆర్నెల్ల్లలో పనులు పూర్తి చేయాలనే నిబంధనతో రూ.972.19 కోట్లతో (రూ.520.75 కోట్ల విలువైన మూడు ప్యాకేజీల పనులు ‘ఈనాడు’ కిరణ్‌ వియ్యంకుడు రాయల రఘుకి చెందిన ఆర్వీఆర్‌ ప్రాజెక్ట్స్‌కు.. రూ.451.44 కోట్ల విలువైన రెండు ప్యాకేజీల పను­లు సీఎం చంద్రబాబు సన్నిహితుడు బలుసు శ్రీని­వాసరావుకు చెందిన బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు అప్పగించారు.

పుంగనూరు బ్రాంచ్‌ కాలువలో 0 కి.మీ నుంచి 75వ కి.మీ వరకు లైనింగ్‌ పనులను రెండు ప్యా­కే­జీల కింద విభజించి కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మె­ల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్సార్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు రూ.319.6 కోట్లతో అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్‌ కాలువలో 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు వెడల్పు చేయడం, లైనింగ్‌ పనులను రూ.480.22 కోట్లతో సీఎం చంద్రబాబు సన్నిహితుడికి చెందిన ఎన్‌సీసీ సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టారు. కుప్పం బ్రాంచ్‌ కాలువ లైనింగ్‌ పనులను సీఎం చంద్రబాబు తనకు అత్యంత సన్నిహితుడైన సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.196.91 కోట్లతో అప్పగించారు. 

నిబంధనలకు విరుద్ధంగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ లైనింగ్‌ 
టెండర్‌ నిబంధనల ప్రకారం రాతి పొర ఉన్న చోట్ల మాత్రమే షార్ట్‌ క్రీటింగ్‌ విధానంలో లైనింగ్‌ చేయా­లి. నిబంధనల్లో ఎక్కడా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ ప్రస్తావనే లే­దు. పని స్వభావం మారితే స్టేట్‌ లెవల్‌ టెక్నికల్‌ కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ) ఆమోదంతోపాటు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కానీ.. టెండర్‌లో నిర్దేశించి­న గడువులోగా పనులు పూర్తి చేయాలనే సాకు చూ­పించి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానాన్ని కాంట్రాక్టర్లు ప్రతి­పాదిస్తే ఆ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులు నోరు మెదపలేకపోయారని జల వన­రు­ల శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. రాతి పొర లేకున్నా.. మట్టి పొరకే.. కనీసం కాలువ సైడ్‌ వాలు (స్లోప్‌)ను క్రమానుగతంగా సరి చేయకుండానే ఇ­ష్టా­రాజ్యంగా అత్తెసరు మందంతో ఎస్‌ఎఫ్‌­ఆర్‌­సీ వి­ధానంలో కాంట్రాక్టర్లు లైనింగ్‌ పనులు కానిచ్చే­శారు. కాలువకు నీటిని విడుదల చేయడంతో ఆ ప్రవాహ ఉద్ధృతికి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ విధానంలో వేసిన లైనింగ్‌ అనేక చోట్ల కరిగిపోయి కొట్టుకుపోయింది. 

వెడల్పు పేరుతో రూ.695.53 కోట్లు వృథా..:
హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కులకు పెంచే పనులను టీడీపీ హయాంలో 2017లో చేపట్టింది.  2019 ఫిబ్రవరి 18 నాటికే 2,73,32,444 క్యూబిక్‌ మీటర్ల మట్టి పని పూర్తయింది. ఈ పనులకు రూ.435 కోట్ల మేర బిల్లులు చెల్లించినట్లు అధికార వర్గాలు చెబుతు­న్నాయి. కానీ.. 2025లో మళ్లీ కొత్తగా హంద్రీ–నీవా తొలి దశ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 క్యూ­సె­క్కులకు పెంచే పనులను చంద్రబాబు సర్కారు రూ.695.53 కోట్లతో చేపట్టింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి.. ఒకటో ప్యాకేజీ (0 నుంచి 88 కి.మీ వరకు) కింద రూ.255.79 కోట్లకు మేఘా సంస్థకు, రెండో ప్యాకేజీ (88 కి.మీ నుంచి 216.3 కి.మీ వరకు) కింద రూ.439.74 కోట్లకు టీడీ­పీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన వీపీఆర్‌­–డీఎస్సార్‌(జేవీ) సంస్థకు అప్పగించింది.

ప్రధాన కాలువను వెడల్పు చేయడంతోపాటు.. బ్రిడ్జిలు, అక్విడెక్టులు లాంటి కాంక్రీట్‌ నిర్మాణాలు ఉన్న చోట ఇరువైపులా వంద మీటర్ల పొడవున కాలువకు లైనింగ్‌ చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఒకటో ప్యాకేజీలో 37.79 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 5.61 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని.. రెండో ప్యాకేజీలో 84.97 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 14.13 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని చేయా­లని లెక్క కట్టింది.

కానీ.. కాలువ గట్లపై ముళ్ల పొ­ద­లు తొలగించి, ఇన్‌స్పెక్షన్‌ పాత్‌ (తనిఖీ మార్గం)ను సరి చేసి.. ప్రొక్లెయిన్‌తో అక్కడక్కడ తవ్వి.. గతంలో చేసిన పనులనే మళ్లీ కొత్తగా చేసినట్లు కాంట్రాక్టర్లు మాయాజాలం చేశారు. ఇక కాంక్రీట్‌ నిర్మాణాలు ఉన్న చోట్ల అత్యంత నాసిరకంగా లైనింగ్‌ చేశారు. మల్యాల ఎత్తిపోతల నుంచి కాలువలోకి నీటిని ఎత్తిపోయడంతో ప్రవాహ ఉధృతికి కాలువ గట్లు కోతకు గురై బలహీనంగా మారాయి. అనేక చోట్ల సిమెంటు లైనింగ్‌ కొట్టుకుపోయింది.

హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశలో అంతర్భా­గమైన పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌లో 87.622 కి.మీ. నుంచి 88.925 కి.మీ. వరకు ఎక్క­డికక్కడ జారిపోయిన కాంక్రీట్‌ లైనింగ్‌కు ఈ ఫొటోనే సాక్ష్యం. అన్నమయ్య జిల్లా పరిధిలో పుంగనూరు బ్రాంచ్‌ కెనాల్‌ 75 కి.మీ నుంచి 207.80 కి.మీ వరకు వెడల్పు­తో లైనింగ్‌ పనులను రూ.480.22 కోట్లకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడి సంస్థ ఎన్‌సీసీకి నామినేషన్‌పై కట్టబెట్టారు. కాలువ సైడ్‌ స్లోప్స్‌ (ఏటవాలు ప్రాంతం) సరిచేయకుండానే.. ఇన్‌క్లైయిన్డ్‌ రోలర్‌తో గట్టిపరచకుండానే మట్టి పొరకు అత్యంత నాసిరకం ఎం–25, ఎం–20 రకం కాంక్రీట్‌ మిశ్రమంతో లైనింగ్‌ చేశారు. దీంతో కాలువకు నీటిని విడుదల చేయగానే లైనింగ్‌ ఎక్కడికక్కడ పగిలిపోయి జారిపోయింది. నీటి ప్రవాహం ఆగిపోవడంతో కాలువ లైనింగ్‌ డొల్లతనం తేలిపోయింది.

హంద్రీ–నీవా కాలువ లైనింగ్‌ పనుల్లో అక్రమాలకు ఇవో మచ్చుతునక. తొలి దశ, రెండో దశ ప్రధాన కాలువ, పుంగనూరు బ్రాంచ్‌ కాలువ, కుప్పం బ్రాంచ్‌ కాలువ లైనింగ్‌ పనులను కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా చేసి అడ్డగోలుగా ప్రజాధనాన్ని దోచుకున్నారు. టెండర్‌ నిబంధనల ప్రకారం రాతి పొర, డీప్‌ కట్‌ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే షార్ట్‌ క్రీటింగ్‌ విధానంలో లైనింగ్‌ చేయాలి. కానీ నిబంధనలను తుంగలో తొక్కి పని స్వభావం (స్కోప్‌ ఆఫ్‌ వర్క్‌) మార్చేసి.. వేగంగా పూర్తి చేయాలనే సాకుతో అడ్డగోలుగా ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ చేశారు. షార్ట్‌ క్రీటింగ్‌ పద్ధతిలో లైనింగ్‌ చేస్తే చదరపు మీటర్‌కు రూ.1,407 చొప్పున బిల్లు చెల్లిస్తారు. అదే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ చేస్తే రూ.1,854 చెల్లిస్తారు. కానీ.. హంద్రీ–నీవా పనుల్లో మాత్రం రూ.2,400 చొప్పున బిల్లులు చెల్లించారంటూ ఇంజనీరింగ్‌ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి సమీపంలో కమ్మవారిపల్లి వద్ద హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ 340 కి.మీ నుంచి 341 కి.మీ. మధ్య స్టీల్‌ ఫైబర్‌ రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ (ఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) విధానంలో వేసిన లైనింగ్‌ కరిగిపోయిందనడానికి ఈ ఫొటోనే రుజువు! చిన్న చిన్న ఇనుప తీగలు, సిమెంటు, సిలికా, ఇసుక, కంకర, నీటితో కలిపి ఎస్‌ఎఫ్‌ఆర్‌సీని తయారు చేస్తారు. కాలువ రాతి పొర ప్రదేశంలో మాత్రమే.. సైడ్‌ స్లోప్స్‌ (ఏటవాలు ప్రాంతం) సరిచేసుకుని 38 మిల్లీమీటర్ల (ఎంఎం) మందంతో ఒకసారి, ఆ తర్వాత అదే మందంతో మరోసారి అధిక ఒత్తిడితో ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ చేయాలి.

కానీ, మట్టి పొరకే.. అదీ కాలువ సైడ్‌ స్లోప్స్‌ క్రమానుగతంగా ఉండేలా చేయకుండానే, వాలు ఎగుడు దిగుడుగా ఉన్నప్పటికీ 10 నుంచి 20 ఎంఎం మందంతో మాత్రమే ఎస్‌ఎఫ్‌ఆర్‌సీతో లైనింగ్‌ వేశారు. ఈ దారుణాన్ని గతేడాది జూలై 14న ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇంత అడ్డదిడ్డంగా లైనింగ్‌ చేసిన దాఖలాలు ఎక్కడా లేవని.. ఇదో వింత అని ఇంజనీరింగ్‌ నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షం కురిసినా, కాలువకు కనిష్ట  స్థాయిలో నీటిని విడుదల చేసినా.. ఈ లైనింగ్‌ ఎక్కడికక్కడ జారిపోవడం, కరిగిపోవడం ఖాయమని.. భారీ ఎత్తున ప్రజాధనం వృథా కావడం తథ్యమని స్పష్టం చేశారు. ఇప్పుడు అదే జరిగిందని ఇంజనీరింగ్‌ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఆ పనులు చేసిన  కాంట్రాక్టు సంస్థ బీఎస్సార్‌ ఇన్‌ఫ్రా మేనేజింగ్‌ డైరెక్టర్‌ బలుసు శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.

లైనింగ్‌ పనులు ఎలా చేయాలంటే..
  తొలుత కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలగించాలి. కాలువపై ఇన్‌స్పెక్షన్‌ పాత్‌ (దారి) వేయాలి. కాలువకు ఇరు వైపులా(సైడ్‌ స్లోప్స్‌).. అడుగు భాగంలో ఇన్‌క్లెయిన్‌డ్‌ రోలర్‌ (ప్రొక్లెయినర్‌కు రోలర్‌ను అమర్చడం) ద్వారా గట్టి పరచాలి.
  ఆ తర్వాత 12 ఎంఎం, 20 ఎంఎం గ్రానైట్‌ కంకర, నాణ్యమైన ఇసుక, సిమెంటుతో తయారు చేసిన ఎం–25 మిక్సర్, ఎం–20 మిక్సర్‌తో పేవర్‌ మిషన్‌ ద్వారా కాలువకు ఇరువైపులా లైనింగ్‌ వేయాలి. ఆ తర్వాత అడుగు భాగంలో లైనింగ్‌ వేయాలి. అనంతరం రెండు వారాలపాటు క్యూరింగ్‌ (నీటితో తడపాలి) చేయాలి.

 రాతి పొర ఉన్న ప్రాంతాల్లో షార్ట్‌ క్రీటింగ్‌ విధానంలో లైనింగ్‌ చేయాలి. రాతి పొరకు ఇనుప బోల్ట్‌ కొట్టి.. దానికి ఇనుప జాలరీ అమర్చి దానిపై అధిక ఒత్తిడితో ఎం–20 కాంక్రీట్‌ వేయాలి. 
పనులను ఏఈ, డీఈ, ఈఈలు నిరంతరం పర్యవేక్షించాలి. ఎస్‌ఈ, సీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. నాణ్యత నియంత్రణ విభాగం(క్వాలిటీ కంట్రోల్‌) అధికారులు ఎప్పటికప్పుడు సిమెంటు కాంక్రీట్‌ లైనింగ్‌ శాంపుల్స్‌ను తీసి ల్యాబొరేటరీల్లో పరీక్షించి నాణ్యతను ధ్రువీకరించాలి. నాసిరకంగా ఉన్నట్లు తేలితే వాటిని తొలగించి మళ్లీ నాణ్యంగా పనులు చేయించాలి.

పనులు దక్కించుకున్న ప్రధాన కాంట్రాక్టర్‌ సబ్‌ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడానికి వీల్లేదు. ఏవైనా పనులను సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగించాలంటే జల వనరుల శాఖ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి. కానీ పనుల నాణ్యతకు ప్రధాన కాంట్రాక్టరే బాధ్యత వహించాలి.

లైనింగ్‌ పనులు ఎలా చేశారంటే..
కాలువ గట్లపై ముళ్ల కంప చెట్లను తొలగించి దారి వేశారు. ఇన్‌క్లెయిన్‌డ్‌ రోలర్‌తో కాలువ ఇరు వైపులా అడుగు భాగాన్ని గట్టి పరచలేదు. కేవలం పొక్లెయిన్‌ బకెట్‌తో తూతూ మంత్రంగా గట్టి పరిచే పనులు కానిచ్చేశారు. దాంతో కాలువకు ఇరు వైపులా మట్టి ఎక్కడికక్కడ జారిపోతున్నా సరే సిమెంటు కాంక్రీట్‌తో లైనింగ్‌ వేశారు.
గతంలో కాలువ తవ్వినప్పుడు వచ్చిన మట్టిని, రాళ్లను గట్టుగా పోశారు. ఆ గట్లపై ఉన్న రాళ్ల నుంచే ఇప్పుడు కంకర తయారు చేస్తున్నారు. ఆ కంకర పిండి పిండిగా నాసిరకంగా ఉంది. సమీపంలో వాగులు, వంకల్లో నుంచి ఇసుకను తెచ్చారు. నాసి­రకం కంకర, ఇసుక.. తక్కువ పరిమాణంలో సిమెంటుతో ఎం–25 మిక్సర్‌ (ఒక పాలు సిమెంటు, ఒక పాలు ఇసుక, రెండు పాళ్లు 20 ఎంఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం), ఎం–20 (1 పాలు సిమెంటు, 1.5 పాళ్లు ఇసుక, 3 పాళ్లు 12 ఎం ఎం కంకర కలిపి తయారు చేసే మిశ్రమం) మిక్సర్‌ తయారు చేశారు. 

 కాలువకు ఇరువైపులా ఇన్‌క్లెయిన్‌డ్‌ రోలర్‌తో గట్టిపరచక పోవడంతో ఎక్కడికక్కడ మట్టి జారిపోతున్నా పేవర్‌ యంత్రాన్ని వినియోగించకుండా.. కార్మి­కుల ద్వారా సిమెంట్‌ కాంక్రీట్‌తో లైనింగ్‌ వేశారు. మట్టిజారిపోతున్నా సరే అలానే లైనింగ్‌ వేస్తున్నారు. దీని వల్ల లైనింగ్‌ ఎక్కువ కాలం నిలబడదని ఇంజనీరింగ్‌ నిపుణులు స్పష్టం చేశారు. ఇష్టారాజ్యంగా లైనింగ్‌ చేయడంతో నీటి ప్రవాహ ఉద్ధృతికి లైనింగ్‌ ఎక్కడికక్కడ కొట్టుకుపోయింది. ఎం–25, ఎం–20 కాంక్రీట్‌లో సిమెంటు తక్కువగా, ఇసుక ఎక్కువగా, నాసిరకం కంకర వినియోగించడం వల్ల లైనింగ్‌ చేసిన ప్రాంతాల్లో ఇసుక పైకి తేలి స్పష్టంగా కనిపిస్తోంది.  

Advertisement
 
Advertisement
Advertisement