న్యాయవ్యవస్థకూ పరిమితులున్నాయి 

Retired Judge Justice Chandru Comments Judicial system - Sakshi

న్యాయమూర్తులు ఈ విషయాన్ని గుర్తించాలి

సమాజానికి మంచి చేసే, హక్కులను కాపాడే న్యాయమూర్తులు కావాలి

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రు

సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్‌: మిగతా వ్యవస్థల మాదిరిగానే న్యాయ వ్యవస్థ క్కూడా పరిమితులున్నాయని మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, జైభీమ్‌ సినిమా ఫేం జస్టిస్‌ కె.చంద్రు తెలిపారు. తనకున్న పరిమితులను న్యాయమూర్తులు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం సమాజానికి మంచి న్యాయమూర్తులు, ప్రజల హక్కులను కాపాడే న్యాయమూర్తులు కావాలన్నారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఏపీ సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ (ఏపీసీఎల్‌ఏ)–కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ కె.చంద్రు ఈ వ్యాఖ్యలు చేశారు. మానవ హక్కులతో పాటు తన అనుభవాలను కొన్నిటిని వివరించారు.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు తప్పని న్యాయమూర్తులు బహిరంగ వేదికలపై క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయని, మరింత మంది జడ్జీలు ఇలా తప్పు ఒప్పుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇటీవల తాను ‘ది హిందూ’ పత్రికలో రాసిన వ్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కొందరు న్యాయమూర్తులు పరిధి దాటుతున్నారంటూ కొన్ని సందర్భాలను దాన్లో ప్రస్తావించానని తెలియజేశారు. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి కొన్ని సునిశితమైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో కాకుండా న్యాయవ్యవస్థతో పోరాడాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లలో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకుంటే జరిమానా విధించవచ్చునని ఈ సందర్భంగా చెప్పారాయన. అంతకు మించి ఉత్తర్వులివ్వటం సరికాదన్నారు.

సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలకు సంబంధించి సీబీఐ దర్యాప్తునకు అప్పగించటం, నిందితులను పట్టుకోవటానికి విదేశాలకు దర్యాప్తు అధికారులను పంపటం వంటి చర్యలను తప్పుబట్టారు. కోర్టులు తమ పరిధులను తెలుసుకోవాలని జస్టిస్‌ చంద్రు అభిప్రాయపడ్డారు. ‘‘నేను కోరుకునేది ఒక్కటే. మానవ హక్కుల పరిరక్షణ. అది ఏ వ్యక్తికి సంబంధించినదైనా కావొచ్చు’’ అన్నారాయన. అంతకు ముందు ఏపీసీఎల్‌ఏ ప్రధాన కార్యదర్శి పొత్తూరి సురేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తే తప్ప ఈ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే పనులు అవుతున్నాయన్నారు.

లాయర్లు హక్కుల కోసం పనిచేయాలి...
అనంతరం విజయవాడ సివిల్‌ కోర్టుల ప్రాంగణంలోని బెజవాడ బార్‌ అసోసియేషన్‌ (బీబీఏ)లో ‘మానవ హక్కులు– న్యాయవాదుల పాత్ర’ అంశంపై జరిగిన సదస్సులో జస్టిస్‌ చంద్రు ముఖ్య అతిథిగా ప్రసంగించారు. న్యాయవాదులకు రాజ్యాంగమే ఆయుధమని, వారు డబ్బు కోసం కాకుండా హక్కుల కోసం పని చేయాలని జస్టిస్‌ చంద్రు చెప్పారు. బాధితుడికి న్యాయం చేస్తే ప్రశాంతంగా నిద్ర పోవచ్చన్నారు. డబ్బులు ముఖ్యం కాదని, సేవ చేయాలనే దృక్పథంతో వృత్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. మరో అతిథి హైకోర్టు డిజిగ్నేటడ్‌ సీనియర్‌ అడ్వకేట్‌ వేములపాటి పట్టాభి మాట్లాడుతూ ఎన్నో కేసులలో తీర్పులతో పాటు గతంలో వాదించిన ఎన్నో కేసులతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన జస్టిస్‌ చంద్రూని రోల్‌ మోడల్‌గా తీసుకుని యువ న్యాయవాదులు వృత్తిలో రాణించాలని సూచించారు. విశ్రాంత అదనపు జిల్లా జడ్జి ఎ.పార్థసారథి, ఏపీ ఏజీ ఎస్‌.శ్రీరామ్, బీబీఏ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.పి.రామకృష్ణ, బి.రవి మాట్లాడారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top