
హెలీప్యాడ్ వద్ద 30 మందికి.. మార్కెట్‌లో 500 మందికే అనుమతి
రోడ్డుషో.. ర్యాలీలు.. బహిరంగ సమావేశాలకు అనుమతిలేదు
చిత్తూరు ఎస్పీ మణికంఠ వెల్లడి
చిత్తూరు అర్బన్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 9న చిత్తూరు జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు ఆంక్షలు విధిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ వెల్లడించారు. పర్యటనలో రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించడానికి వీల్లేదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. మాజీ సీఎం వైఎస్ జగన్ ఈనెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వస్తారని, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ మాకు లేఖ ఇచ్చారు. జిల్లాలో మామిడి రైతుల కష్టాలను తెలుసుకోవడానికి.. వారితో ముఖాముఖి నిర్వహిస్తారని, దాదాపు పది వేల మంది ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశమున్నందున ఆ లేఖలో భద్రత కోరారు.
చిత్తూరు జిల్లా పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం బంగారుపాళ్యం, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాం. వైఎస్ జగన్ వచ్చే హెలిప్యాడ్ వద్ద 30 మందికే అనుమతి ఉంటుంది. బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో రైతులతో ముఖామఖి నిర్వహించడానికి 500 మంది రైతులకు మాత్రమే అనుమతిస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా నాయకులు ఎవరూ కూడా జనసమీకరణ చెయ్యొద్దు.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు. దీనిపై నాయకులకు నోటీసులు కూడా ఇస్తాం. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.
ఒకవేళ నేతలు బహిరంగ సభ కోసం అనుమతి కోరినట్లయితే.. దానికి తగ్గట్లుగా స్థలాన్ని సూచించేవాళ్లం. మరోవైపు.. హెలిప్యాడ్ చుట్టూ డబుల్ బారికేడ్లు, వైఎస్ జగన్‌పర్యటన పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూసుకోవడానికి నాయకులు సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలి. ప్రతిపక్ష నేతను చూడడానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తే ఏం చేస్తారని విలేకరులు ప్రశ్నించగా.. వేలాది మంది గుమికూడటానికి వీల్లేదని ఎస్పీ స్పష్టం చేశారు.