వరద నీటిలోనూ విద్యుత్‌ పునరుద్ధరణ

Restoration of electricity even in flood water - Sakshi

ఉభయగోదావరి జిల్లాల్లో ప్రత్యేక బృందాలు

పడవల మీదే ఉపకరణాల చేరవేత

తీగలపై కూలిన చెట్ల తొలగింపు

వీలైనంత త్వరగా విద్యుత్‌ పునరుద్ధరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: వరదల వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్‌ వ్యవస్థకు జరిగిన నష్టంపై సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. విద్యుత్‌ను పునరుద్ధరించే వరకు సిబ్బంది అక్కడే ఉండాలని సీఎం సూచించారు. వీలైనంత త్వరగా అన్ని గ్రామాలకు విద్యుత్‌ అందించాలన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ శాఖకు అన్ని విధాల తోడ్పాటునందిస్తుందని తెలిపారు. వరద ప్రాంతాల్లో పరిస్థితిని, విద్యుత్‌ శాఖ అప్రమత్తమైన తీరును ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి వివరించారు.

రాత్రింబవళ్లు పునరుద్ధరణ పనులు
► ఉభయగోదావరి జిల్లాల్లోని నాలుగు మండలాలు.. నెల్లిపాక, వీఆర్‌పురం, కూనవరం, చింతూరుల్లో ఉన్న 133 గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 10,998 సర్వీసులకు సరఫరా ఆగిపోయింది. మరో 1,528 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు విద్యుత్‌ సరఫరా నిలిపేయాల్సి వచ్చింది. నీటి ముంపుతో ఏలూరు డివిజన్‌లో రెండు 11 కేవీ ఫీడర్లు విద్యుత్‌ సరఫరా ఆపేశాయి. 916 ట్రాన్స్‌ఫార్మర్లు నీటమునిగాయి.
► పోలవరం ముంపు మండలాల్లోనే నష్టం ఎక్కువగా ఉంది. పరిస్థితిని అంచనా వేసి ముందే అక్కడకు అదనపు సిబ్బందిని పంపాం. ప్రస్తుతం రాత్రింబవళ్లు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవసరమైన సామాగ్రిని పడవల ద్వారా చేరవేస్తున్నారు. సోమవారం రాత్రికల్లా 90 శాతం విద్యుత్‌ పునరుద్ధరణ పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 
► గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో సిబ్బంది అక్కడ నిలబడే వీలు లేకపోయినా విద్యుత్‌ పునరుద్ధరణ వేగంగానే సాగుతోంది. విరిగిపోయిన స్తంభాలను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నారు. 
► తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి  పరిస్థితిని తెలుసుకుని అవసరమైన ఆదేశాలిస్తున్నారు. విద్యుత్‌ సౌధలో అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top