
సాక్షి, అమరావతి: 2025–26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ యాజమాన్య కోటా సీట్లలో అడ్మిషన్ల భర్తీ కోసం శనివారం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్, ప్రైవేటు కళాశాలల్లో బీ, సీ కేటగిరీ సీట్లలో ప్రవేశాల కోసం విద్యార్థులు సోమవారం నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
ఆలస్య రుసుముతో ఆగస్టు 4 తేదీ వరకు అవకాశం ఉందని తెలిపింది. ఆరు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బీ–కేటగిరీ, ఎన్‌ఆర్‌ఐ కోటాలో 341 సీట్లు ఉండగా, తిరుపతి స్విమ్స్‌లో ఎన్‌ఆర్‌ఐ కోటాలో 23 సీట్లు ఉన్నట్టు వివరించింది. ప్రైవేట్ కాలేజీల్లో బీ–కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లు 1,074, సీ–కేటగిరీ (ఎన్‌ఆర్‌ఐ) కోటాలో మరో 451 సీట్లు, బీడీఎస్‌లో బీ–కేటగిరీ సీట్లు 1,565, ఎన్‌ఆర్‌ఐ కోటాలో 209 సీట్లు ఉన్నాయని వర్సిటీ రిజి్రస్టార్ డాక్టర్ వి.
రాధికారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఆలిండియా కోటా రిజిస్ట్రేషన్ గడువు పెంపు
ఎంబీబీఎస్ ఆలిండియా కోటా మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 31వ తేదీ వరకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) పొడిగించింది. సోమవారంతో రిజి్రస్టేషన్, చాయిస్ నమోదుకు గడువు ముగియనుండగా, 31 వ తేదీ వరకు పొడిగించారు. ఆగస్టు 3, 4 తేదీల్లో సీట్లు కేటాయిస్తారు. 8వ తేదీలోపు విద్యార్థులు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.