
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సుమారు ఏడు జిల్లాల్లో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టాయి. పాజిటివ్ కేసులు పెరిగినా ఆందోళన చెందాల్సిన పనిలేదని, మరణాల నియంత్రణే ముఖ్యమని ఐసీఎంఆర్ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ సూచనలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్ట్ చివరి రెండు వారాల్లో వైద్యారోగ్య శాఖ విశ్లేషణలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతంతో పోలిస్తే గుంటూరు జిల్లాలో మరణాలు 46 శాతం పైనే తగ్గినట్టు వెల్లడైంది. అనంత, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో తగ్గుముఖం పట్టగా, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో మరణాలు నియంత్రణలో ఉన్నాయి. చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది.
ఒక్క శాతం కన్నా తక్కువగా..
రాష్ట్రంలో కరోనా పరీక్షలు సగటున 60 వేలకు పైగా చేస్తుండటం, రోజుకు 10 వేల చొప్పున పాజిటివ్ కేసులొస్తున్నా మరణాలు నియంత్రణలోనే ఉన్నాయి. ఇప్పటివరకూ ఒకటి కంటే తక్కువ శాతం మరణాలున్నాయి.
► జాతీయ సగటు మరణాల శాతం 1.74గా ఉంది
► రాష్ట్రంలో ఈ సగటు కేవలం 0.89 మాత్రమే ఉంది
► మన రాష్ట్రంతో పోలిస్తే 15 రాష్ట్రాల్లో ఎక్కువ మరణాలున్నాయి.
► అత్యధికంగా 3.05 శాతం మరణాలు గుజరాత్‌లో నమోదవుతున్నాయి.
► 3.03 శాతంతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది.
పకడ్బందీగా క్లినికల్ మేనేజ్‌మెంట్
► రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో పటిష్టంగా క్లినికల్ మేనేజ్‌మెంట్ అమలు
► నిపుణులైన వైద్యులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ
► ఎయిమ్స్ వైద్యులతో సలహాలు, సూచనలు తీసుకుంటున్న డాక్టర్లు
► ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు
40 లక్షలు దాటిన టెస్టులు
కరోనా నిర్ధారణ పరీక్షల్లో రాష్ట్రం దూకుడు కొనసాగిస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 40,35,317 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. శనివారం ఒక్కరోజే 69,623 మందికి పరీక్షలు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి ఒకేరోజు 11,941 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు రోజు రోజుకూ పెరుగుతున్నట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శనివారం ఉదయం 10 గంటలవరకు (24 గంటల్లో) 10,825 పాజిటివ్ కేసులు నమోదు కాగా 71 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 4,87,331 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,82,104 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 1,00,880 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 4,347కు చేరుకుంది. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 75,568 టెస్టులు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన దేశంలో ఇదే అత్యధికమని ఐసీఎంఆర్ గణాంకాలు వెల్లడించాయి.