హైకోర్టు ఆదేశాలతో నేడు ఆఫ్కాఫ్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు
ఆఫ్కాఫ్ చేపకు వలవేసిన ఇద్దరు మంత్రులు
తాడోపేడో తేల్చుకునేందుకు మంత్రులు అచ్చెన్న–కొల్లు సై
ఓటర్లకు రూ.10 లక్షల వరకు ఎరవేసేందుకు ప్రయత్నాలు
సాక్షి, అమరావతి: హైకోర్టు ఆదేశాలతో బుధవారం నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ మత్స్య సహకార సంఘాల సమాఖ్య (ఆఫ్కాఫ్) చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ పదవుల్ని తమ వర్గీయులకే దక్కించుకోవాలని మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తమ బలగాలతో మోహరించారు. ఎవరి శక్తిమేర వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సిఫార్సుతో వైఎస్సార్ కడప జిల్లా మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ యాతగిరి రాంప్రసాద్ పేరును టీడీపీ అధిష్టానం ప్రకటించగా, చివర్లో చక్రం తిప్పిన మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడితో కర్నూలు జిల్లా మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ బి.శివనవీన్‌కుమార్ పేరిట జీవో వచ్చేలా చేశారు. ఈ జీవోను సవాల్ చేస్తూ మంత్రి కొల్లు వర్గీయులైన జిల్లా సమాఖ్య చైర్మన్లు కోర్టును ఆశ్రయించగా, ఎన్నికల ద్వారా ఆఫ్కాఫ్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను భర్తీచేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో బుధవారం ఈ ఎన్నికలు నిర్వహించేందుకు సహకార సంఘాల డిప్యూటీ రిజి్రస్టార్ (విజయవాడ) పి.కిరణ్‌కుమార్‌ను ఎన్నికల అధికారిగా నియమించారు. మంత్రుల అండతో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు రాంప్రసాద్, నవీన్‌కుమార్ ప్రయత్నిస్తున్నారు.
ఒకరికి చైర్మన్.. మరొకరికి వైస్ చైర్మన్..
ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన 28 జిల్లా సమాఖ్యలుగా విభజించి వాటికి ఎన్నికలు నిర్వహించిన తరువాతే ఆఫ్కాఫ్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని నవీన్‌కుమార్ ఎన్నికల అధికారిని కోరారు. ఓటు హక్కున్న 13 మందిలో ఎనిమిదిమంది తమవైపే ఉన్నారంటున్న ఆయన ఎన్నికల విషయంలో తగ్గేది లేదని అంటున్నారు. రాంప్రసాద్, నవీన్‌కుమార్ ఇద్దరూ రాయలసీమకు చెందినవారు కావడం, ఆఫ్కాఫ్ కార్యకలాపాలన్నీ తీరప్రాంత జిల్లాల్లోనే ఉండడంతో వారిద్దరిని కాదని ఉత్తరాంధ్ర లేదా కోస్తాంధ్రకు చెందిన వారికి ఈ పదవులు కట్టబెట్టాలనే ప్రతిపాదన కూడా తెరపైకి వస్తోంది.
రాంప్రసాద్‌కు ప్రత్యామ్నాయంగా కృష్ణాజిల్లా సమాఖ్య చైర్మన్ కొక్కిలగడ్డ నాగరమేష్ పేరును మంత్రి కొల్లు వర్గీయులు ప్రతిపాదించగా అచ్చెన్నాయుడి వర్గీయులు వ్యతిరేకించినట్లు తెలిసింది. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రాంప్రసాద్, నాగరమే‹Ùలను మంత్రి కొల్లు బలపరుస్తుండగా.. నవీనకుమార్, శ్రీకాకుళం జిల్లా సమాఖ్య చైర్మన్ చీకటి శ్రీరాములును మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిపాదిస్తున్నట్టు చెబుతున్నారు. మధ్యేమార్గంగా రాంప్రసాద్–నవీన్‌కుమార్‌లలో ఒకరికి చైర్మన్, మరొకరికి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టాలన్న ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు.
కానీ రెండు పదవులు తమకే దక్కాలని కొల్లు వర్గీయులు పట్టుబడుతున్నట్టు చెబుతున్నారు. ఒకరు తమ శాఖ మంత్రి, మరొకరు తమ సామాజికవర్గానికి చెందిన మంత్రి కావడంతో ఎవరి వైపు ఉండాలో తెలియక జిల్లా సమాఖ్యల చైర్మన్లు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకరు సీఎంవో నుంచి, మరొకరు మంత్రి లోకేశ్ పేషీ నుంచి ఫోన్ చేస్తుండడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. ఓటర్లయిన జిల్లా సమాఖ్యల చైర్మన్లకు రూ.10 లక్షల వరకు తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నానంటూ ప్రచారం సాగుతోంది.
నేటి ఎన్నికల షెడ్యూల్ ఇలా..
⇒ ఉదయం 9 గంటలకు ఎన్నికల ప్రకటన
⇒ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
⇒ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్ల పరిశీలన
⇒ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
⇒ మధ్యాహ్నం 2.30 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్ల ప్రకటన, చిహ్నాల కేటాయింపు
⇒ ఎన్నికలు ఏకగ్రీవమైతే 2.30 గంటలకు ఫలితాల ప్రకటన
⇒ అవసరమైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్
⇒ సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. అనంతరం ఫలితాల ప్రకటన


