పారదర్శకంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ

Recruitment of Anganwadi Supervisor posts transparently - Sakshi

తప్పుడు కథనాలు.. అసత్య ప్రచారాలొద్దు 

2013లో చేపట్టాల్సిన భర్తీ ఆలస్యమైంది 

సీఎం ఆదేశాలతో 560 పోస్టుల భర్తీ 

మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి స్పష్టికరణ

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌(గ్రేడ్‌–2) పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ స్పష్టం చేశారు. పోస్టుల భర్తీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ ఆమె సోమవారం మీడియాతోమాట్లాడారు. 2013లో చేపట్టిన ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అప్పట్లో పట్టించుకోలేదన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వాటి భర్తీకి చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. 560 పోస్టుల భర్తీకి అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అర్హులైన వారినుంచి దరఖాస్తులు తీసుకుని పారదర్శకంగా రాతపరీక్ష నిర్వహించి మెరిట్‌ ఆధారంగా భర్తీచేసేలా పటిష్ట మైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే 560 పోస్టులకు 21 వేలకు పైగా దరఖాస్తులొచ్చాయని, వారికి ఈ నెల 18న నాలుగు జోన్లలో మాల్‌ ప్రాక్టీస్‌కు తావులేకుండా ఓఎంఆర్‌ షీట్స్‌ ద్వారా రాతపరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. రాతపరీక్ష 45 మార్కులతోపాటు.. మరో ఐదు మార్కులకు ఇంగ్లిష్ పై పట్టు ఏ మేరకు ఉందో తెలుసుకునేందుకు వీడియో చేసి పంపాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్టు తెలిపారు.

రాతపరీక్ష తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరి(క్వాలిఫైడ్‌ లిస్ట్‌)ని ఎంపిక చేసి వారికి సమాచారం అందించినట్టు తెలిపారు. పో స్టుల భర్తీలో రోస్టర్‌ విధానం, దివ్యాంగుల కోటా వంటి అన్ని నిబంధనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఇంటర్వ్యూలు ముగిశాక మార్కుల జాబితాలు వెల్లడిస్తామన్నారు.

పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సైతం ఎటువంటి అనుమానం ఉన్నా తమ ఆన్సర్‌ షీట్లను కూడా పరిశీలించుకునే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల్లో అపోహలు, అనుమానాలు రేకెత్తించేలా అసత్య వార్తలు, తప్పుడు ప్రచారాలు తగదని ఆమె సూచించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top