వికేంద్రీకరణే సీమ అభివృద్ధికి దిక్సూచి

Rayalaseema People Protest decentralization seema development - Sakshi

శ్రీ బాగ్‌ ఒప్పందానికి 85 ఏళ్లు పూర్తి.. సీమవ్యాప్తంగా ర్యాలీలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, దీక్షలు

సాక్షి అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: వికేంద్రీకరణే రాయలసీమ అభివృద్ధికి దిక్సూచి అని సీమ ప్రజ ఎలుగెత్తి చాటింది. పాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంకల్పానికి మద్దతు పలికింది. అన్ని ప్రాంతాల సమానాభివృద్ధి ద్వారా భవిష్యత్తులో వేర్పాటు వాదం రాకూడదన్నదే సీఎం జగన్‌ ఆలోచన అని వెల్లడించింది.

పాలన వికేంద్రీకరణ చేసి, శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. 1937 నవంబర్‌ 16న జరిగిన శ్రీబాగ్‌ ఒడంబడికకు 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ఒప్పందం స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసే ఉద్దే్దశంతో బుధవారం సీమ వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరిగాయి. ర్యాలీలు, మానవ హారాలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, చర్చా కార్యాక్రమాలు, సత్యాగ్రహ దీక్షలు నిర్వహించారు.  ప్రజలు, విద్యార్థి, యువజన సంఘాలు, న్యాయవాదులు, మేధావులు  పొల్గొన్నారు. 

కర్నూలు జిల్లాలో ఉద్యమ శంఖారావం 
కర్నూలు నగరంలో జేఏసీ చైర్మన్‌ విజయకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజ్‌ విహార్‌ సర్కిల్‌లో వేలాది మందితో మానవహారం ఏర్పాటు చేశారు. ప్లకార్డులు పట్టుకుని మూడు రాజధానుల కోసం నినదించారు. విద్యార్థులు వినూత్నంగా ‘శ్రీబాగ్‌ 1937’ ఆకారంలో కూర్చొన్నారు.  పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయ రాజధానిని సాధించుకోకపోతే భావితరాలు మనల్ని క్షమించవవన్నారు. 25న భారీ సభ ఏర్పాటు చేసి రాష్ట్రమంతా తమ వాణిని వినిపిస్తామని చెప్పారు. ఎంపీ సంజీవ్‌కుమార్, ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ పాల్గొన్నారు.

నంద్యాల గాంధీచౌక్‌లో జేఏసీ చైర్మన్‌ బంగారురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ  పాల్గొన్నారు. ఆళ్లగడ్డలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ, మానవహారంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండలో భారీ ర్యాలీలు,ఆదోనిలో, ఆలూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు జరిగాయి. నందికొట్కూరులో నిర్వహించిన మానవహారంలో ఎమ్మెల్యే ఆర్థర్, ప్రజలు పాల్గొన్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందాన్ని అమలు చేయాల్సిందే 
శ్రీబాగ్‌ ఒడంబడికను అమలు చేసి తీరాల్సిందేనని మేధావులు, ప్రజా సంఘాల నేతలు ఉద్ఘాటించారు. వికేంద్రీకరణకు మద్దతుగా బుధవారం వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. కడపలో జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు, కేసీ కెనాల్‌ ఆయకట్టుదారుల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ ఓబుల్‌రెడ్డి, ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.  

మైదుకూరు నియోజకవర్గం, దువ్వూరులో మేధావులు, రైతు, ప్రజా సంఘాల నేతల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బద్వేల్‌ పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌  వరప్రసాద్, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కమలాపురంలో బెక్‌ ర్యాలీ నిర్వహించారు. 

ఇప్పుడు కాకపోతే.. ఇంకెప్పుడు?
తిరుపతిలో జరిగిన శ్రీబాగ్‌ ఒప్పంద దినోత్సవ సమావేశంలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఎంపీ, పలువురు మేధావులు మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో తప్ప మరెప్పటికీ శ్రీబాగ్‌ ఒప్పందం అమలు కాదని భూమన స్పష్టంచేశారు. శ్రీబాగ్‌ ఒప్పందం రాజకీయ పార్టీ ఒప్పందం కాదని, పెద్ద మనుషుల ఒప్పందమని  రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్‌ పురుషోత్తంరెడ్డి స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, సభ నిర్వహించారు. సూళ్లూరుపేట, నాయుడుపేటలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేశారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ్, జెడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో..
కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఆధ్వర్యంలో మానవహారం, రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురంలో వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. శింగనమలలో ప్రభుత్వ సలహాదారు(విద్య) ఆలూరి సాంబశివారెడ్డి నేతృత్వంలో భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. గుంతకల్లులో ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి ప్రజలు, విద్యార్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

రాయలసీమ విమోచన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఉరవకొండ బుదగవిలో మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పుట్టపర్తిలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి పెనుకొండ, మడకశిర, కదిరి ఎమ్మెల్యేలు శంకరనారాయణ, తిప్పేస్వామి, సిద్ధారెడ్డి హాజరయ్యారు. మడకశిరలో ఎమ్మెల్యే తిప్పేస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. 

అందరినోటా.. వికేంద్రీకరణ మాట
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  పొదలకూరులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో,  ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో,  ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు చేశారు. నెల్లూరు రూరల్‌ పరిధిలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో, నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో, కావలి నియోజకవర్గం బోగోలులో ర్యాలీలు నిర్వహించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top