ఎల్‌నినో విశ్వరూపం రెడ్‌ లిస్ట్‌లో రాయలసీమ | Rayalaseema on El Ninos global red list | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో విశ్వరూపం రెడ్‌ లిస్ట్‌లో రాయలసీమ

Jul 6 2026 6:03 AM | Updated on Jul 6 2026 6:03 AM

Rayalaseema on El Ninos global red list

జూలై–సెప్టెంబర్ మధ్య తీవ్ర ప్రభావం

సాధారణ కరువు కాదు.. ఆకస్మిక కరువు  

111 అత్యంత అప్రమత్తత జిల్లాల జాబితాలో మన జిల్లాలు

హెచ్చరించిన ప్రపంచ వాతావరణ సంస్థ

సాక్షి, అమరావతి: పసిఫిక్‌ మహాసముద్రంలో తీవ్రరూపం దాలుస్తున్న ఎల్‌నినో మన రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం విడుదల చేసిన రెడ్‌లిస్ట్‌లో రాయలసీమ జిల్లాలున్నాయి. ఇప్పటికే మొదలైన ఎల్‌నినో పరిస్థితులు జూలై–సెప్టెంబర్‌ మధ్య మరింత బలపడతాయని ఐక్యరాజ్యసవిుతికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తాజాగా హెచ్చరించింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం పుణ్యమా అని రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా ఇవి కంటితుడుపేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

కృష్ణాడెల్టా, సాగర్‌ ఆయకట్టు, రాయలసీమ ప్రాజెక్టులన్నింటికీ ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసే వర్షాలే ఆధారం. కానీ జూలై ఒకటో తేదీ నాటికి మహారాష్ట్ర, కర్ణాటక సహా పశ్చిమ భారతంలో 71 శాతం ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుందని గాంధీనగర్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని నేషనల్‌ డ్రాట్‌ మానిటర్‌ తాజాగా అంచనా వేసింది. దీన్నిబట్టి కృష్ణా పరీవాహకంలో ఎగువన వానల్లేకపోతే రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకమేనని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 41.2 శాతం భూభాగం కరువు ఛాయల్లో ఉంది. నెల కిందట ఇది 19.6 శాతమే. నెలలోనే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చిందంటే కరువు పరిస్థితులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో గమనించవచ్చు. కర్నూలు జిల్లాలో జూన్‌లో సాధారణ వర్షపాతం 77.7 మిల్లీవీుటర్లు కాగా 46.1 మిల్లీవీుటర్లు మాత్రమే నమోదైంది. నంద్యాల జిల్లాలో సాధారణ వర్షపాతం 77 మిల్లీవీుటర్లు కాగా 8.4 మిల్లీవీుటర్ల వర్షం మాత్రమే కురిసింది. 

కేంద్రం రెడ్‌లిస్ట్‌లో మన జిల్లాలు
దేశంలోని 724 జిల్లాల్లో 315 జిల్లాలు వర్షాభావంతో ప్రభావితమవుతాయని కేంద్రం గుర్తించింది. అందులో సాగునీటి సదుపాయం 25 శాతం కంటే తక్కువ ఉన్న 111 జిల్లాలను అత్యంత అప్రమత్తతగా ఉండాల్సిన జిల్లాలుగా కేంద్ర వ్యవసాయశాఖ ప్రకటించింది. ఆ జాబితాలో మన రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలున్నాయి. ప్రస్తుతం బంగాళాఖాతం అల్పపీడనంతో కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కానీ ఎల్‌నినో జూన్‌లో బలహీనంగా మొదలై సీజన్‌ రెండో సగంలో బలపడుతుందని వాతావరణశాఖ ముందే తెలిపింది. అంటే జూలై చివరి నుంచి ఆగస్టు, సెప్టెంబర్‌లలో వానలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అందుకే భారత వాతావరణశాఖ సీజన్‌ మొత్తం వర్షపాతం అంచనాను తగ్గించింది. 

వచ్చే వేసవి చాలా హాట్‌ 
ఎల్‌నినో అంటే కేవలం వర్షాభావం ఒక్కటే కాదు. జూన్‌లోనే రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ వడగాడ్పులు ఉన్న రోజులు నమోదవుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు జూన్‌ అంతా వేడిగాలులు ప్రజలను అతలాకుతలం చేశాయి. ఈ ఎల్‌నినో 2026–27 శీతాకాలం వరకు కొనసాగే అవకాశం 96 శాతం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2027 వేసవిలో వడగాడ్పుల తీవ్రత ఎక్కువ ఉంటుందని చెబుతున్నాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement