రూ. 10816 కోట్లతో రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు పనులు  

Rayalaseema Drought Prevention Project Works - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగంగా జిల్లాలో ఆరు సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎర్రబల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్, గండికోట–సీబీఆర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్‌ విస్తరణ, అలవలపాడు లిఫ్ట్‌ స్కీమ్, జీఎన్‌ఎస్‌ఎస్‌–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిఫ్ట్, జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ విస్తరణ పథకాలను చేపట్టింది. సుమారు రూ. 10,816 కోట్లతో పనులు చేపట్టగా గత మార్చిలో టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇటీవలే అన్ని ప్రాజెక్టుల పరిధిలోనూ పనులు మొదలయ్యాయి.

జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మలు భూసేకరణ పనులను పర్యవేక్షిస్తుండగా జీఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు పనులను వేగవంతం చేశారు. ఈ పనులు పూర్తయితే వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 4.34 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అందులో 4,04,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కాగా, మరో 30 వేల ఎకరాల ఆయకట్టు కొత్తగా సాగులోకి వస్తుంది. 12 లక్షల మందికి తాగునీరు అందనుంది. మొత్తంగా రెండు జిల్లాల్లో సాగు, తాగునీటి కష్టాలు తీరినట్లే.  

పులివెందుల మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు
రూ. 1256 కోట్లతో పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. సీకేఎల్‌ఐ, పీబీసీ, సీబీఆర్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ నుండి నీటిని పంప్‌ చేసి ప్రత్యేకంగా నిర్మించే సంపులు, పైపులైన్ల ద్వారా ఆయకట్టుకు మైక్రో ఇరిగేషన్‌ ద్వారా నీటిని అందించనున్నారు. సంపులు, పైపులైన్ల నిర్మాణ పనులు  సాగుతున్నాయి. 1,22,480 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం లక్ష్యం. 

అలవలపాడు లిఫ్ట్‌ స్కీమ్‌
రూ. 56 కోట్లతో అలవలపాడు లిఫ్ట్‌ స్కీమ్‌ పనులను ప్రభుత్వం చేపట్టింది. పీబీసీ పరిధిలో 50వ కిలోమీటరు తర్వాత టెయిలెండ్‌ పరిధిలోని 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం లక్ష్యం. జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ నుండి 1.5 టీఎంసీల నీటిని తరలించనున్నారు. అలవలపాడు ట్యాంకు, పెండ్లూరు ట్యాంకు, పీబీసీ 50వ కిలోమీటరు చివరి ఆయకట్టుకు నీటిని తరలించనున్నారు.  ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి కావచ్చు. 

ఎర్రబల్లి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం
సీబీఆర్‌ నుంచి రెండు టీఎంసీల నీటిని తరలించి 15 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది లక్ష్యం. ప్రాజెక్టుల నీరు అందించలేని కొండ ప్రాంతాలకు లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించి పైపుల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని అందించనున్నారు. సీబీఆర్‌కు 110 మీటర్ల పైభాగంలో (ఎత్తున) ఉన్న ప్రాంతాలలోని ఆయకట్టుకు పైపుల ద్వారా నీటిని లిఫ్ట్‌ చేసి సాగునీటిని అందించనున్నారు. దీంతోపాటు లింగాల మండలంలో ఎగువపల్లి, దిగువపల్లి, మురారిచింతల, అంబకంపల్లె, ఎర్రబల్లి, గిడ్డంగివారిపల్లె తదితర ఎనిమిది చెరువులను నీటితో నింపనున్నారు.   గిడ్డంగివారిపల్లె చెరువులో 1.2 టీఎంసీల నీటిని నింపి యురేనియం ప్రభావిత ఏడు గ్రామాల పరిధిలోని 10 వేల ఎకరాలకు సాగునీటిని అందించడంతోపాటు అక్కడి ప్రజలకు తాగునీటిని అందించనున్నారు. ఈ లెక్కన మొత్తం 25 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. రూ. 1113 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. భూ సేకరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 

గండికోట–సీబీఆర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్‌ పనుల విస్తరణ
గండికోట నుండి సీబీఆర్‌కు రెండు వేల క్యూసెక్కులు, పైడిపాలెంకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటిని తరలించాలన్నది ఉద్దేశం. పైడిపాలెం ఆరు టీఎంసీల సామర్థ్యం కాగా, సీబీఆర్‌ 10 టీఎంసీల సామర్థ్యంతో ఉంది. మొత్తం 16 టీఎంసీల నీటిని ప్రస్తుతం ఉన్న సామర్థ్యం మేరకు 70 రోజుల్లో నింపాల్సి వస్తోంది. దీనిని 35 రోజులకు తగ్గించేందుకు ఈ కొత్త లిఫ్ట్‌ స్కీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా జీకేఎల్‌ఐ, సీబీఆర్, పీబీసీల పరిధిలో మొత్తం 1,63,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. ఇందులో మైక్రో ఇరిగేషన్‌ ద్వారా 1,22,480 ఎకరాలకు నీటిని అందించనున్నారు. రూ. 3050 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. ప్రస్తుతం కొండాపురం మండల పరి«ధిలోని లావనూరు వద్ద టన్నెల్‌ పనులు జరుగుతున్నాయి. 2023 జూన్‌ నాటికి పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం.  

జీఎన్‌ఎస్‌ఎస్‌–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లిఫ్ట్‌
రూ. 5036 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పథకం ద్వారా వైఎస్సార్‌ జిల్లాలోని చక్రాయపేటతోపాటు అన్నమయ్య జిల్లాలోని రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సుండుపల్లె, వీరబల్లి ప్రాంతాల్లోని 133 చెరువులను నీటితో నింపనున్నారు. వైఎస్సార్‌ జిల్లా పరిధిలో 91 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. జీఎన్‌ఎస్‌ఎస్‌ 56వ కిలోమీటరు నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి తరలించనున్నారు. చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని తంబళ్లపల్లె, పుంగనూరు, మదనపల్లె, పీలేరులో రెండు లక్షల ఎకరాల హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ ఆయకట్టుకు సాగునీరు అందనుంది. వైఎస్సార్‌  జిల్లా పరిధిలో రెండు లక్షల మందికి, అన్నమయ్య, చిత్తూరు జిల్లా పరిధిలో 10 లక్షల మందికి మొత్తం 12 లక్షల మందికి తాగునీటిని అందించనున్నారు. దీని పరిధిలో భూ సేకరణ పనులు, భూ సేకరణ గుర్తింపు పనులు, డిజైన్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 

రాయలసీమ కరువు నివారణ పనులు వేగవంతం 
పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని 4,34,000 ఎకరాలకు సాగునీరు, 12 లక్షల మందికి తాగునీరు అందుతుంది.  అప్‌ల్యాండ్‌ ఏరియాల్లోని భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ పథకాలు రూపుదిద్దుకుంటున్నాయి. 
– మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈ, జీఎన్‌ఎస్‌ఎస్, కడప  

8 జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ విస్తరణ 
రూ. 305 కోట్లతో గండికోట జీరో కిలోమీటరు నుంచి 56వ కిలోమీటరు వరకు జీఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ను విస్తరించడంతోపాటు లైనింగ్‌ పనులను చేపట్టనున్నారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయి. ఈ మొత్తం ఆరు ప్రాజెక్టుల పరిధిలో 2500 ఎకరాల భూమిని సేక రించాల్సి ఉండగా, భూ సేకరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతి మంగళవారం కలెక్టర్‌ విజయరామరాజు, జేసీ సాయికాంత్‌వర్మ, జీఎన్‌ఎస్‌ఎస్‌ ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డిలు పనులను పర్యవేక్షిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top