విజయవాడ: యూట్యూబర్ రావణ్ భార్య అనూష కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్‌దని ఆమె చెప్పారు. అంతేగానీ, ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలన్న మనస్తత్వం కాదని తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ లేఖ, వీడియో విడుదల చేశారు.
‘‘యూట్యాబర్ రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న నా భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆ వీడియో కల్పిత వీడియో.. అది సృష్టించిన వీడియో, తమ తప్పులను సమర్థించుకునేందుకు, లేని వీడియోను సృష్టిస్తూ ఈ తప్పుడు ప్రచారానికి దిగారు. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
కులాలు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు మా కుటుంబం వ్యతిరేకం. అయినా సరే ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి నా భర్త కులం కమ్మ కులం. నా భర్త పేరుకూడా అధికారికంగా రావణే. రావణ్ ఫలానా పార్టీ, ఫలానా వర్గం అంటూ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం. మాకు ఏ పార్టీలతోనూ సంబంధాలు లేవు. గొంతులేని వర్గాలకు ఒక గొంతుకై నిలవడమే రావణ్ పార్టీ, అదే వర్గానికి చెందిన రావణ్. సమాజంలో మంచి మార్పు రావాలని, రాజ్యాంగం ప్రకారం వ్యవస్థలు నడుచుకోవాలన్న సిద్ధాంతమే రావణ్‌ది.. తప్ప ఏ ఒక్కరినీ కించపరచాలని, ఎవ్వరినీ నొప్పించాలని కాదు.
ఒక ప్రజాస్వామ్య వాదిగా ప్రశ్నిస్తాడు. గట్టిగానే ప్రశ్నిస్తాడు. ప్రశ్నించడం అతని నైజం. బాధ్యత కలిగిన వారు వాటికి సమాధానాలు ఉంటే చెప్పాలి. లేదంటే, లోపాలను సరిదిద్దుకోవాలి. అంతేకానీ, ఇలా చట్టవ్యతిరేకంగా నడుచుకోవడం అన్యాయం. కేవలం ప్రశ్నిస్తున్నందుకు ఉగ్రవాది తరహాలో కేసులు పెట్టడం దారుణం. రాష్ట్రంలో ఇటీవల జరిగిన దారుణ ఘటనలనుంచి డైవర్ట్ చేయడానికే రావణ్ ను వేధించే కార్యక్రమం పెట్టుకున్నారు. ఒక ప్రభుత్వంతో పోరాడేటంత బలం మాకు లేదు.
కానీ, నిజాయితీ మాకు ఉంది. రేపు ఎవరు ప్రశ్నించినా ఇదే సంప్రదాయం అమలైతే, అది ఈ సమాజానికి మంచిదికాదు. ఈ దేశంలో న్యాయం కాస్త ఆలస్యమైన, న్యాయం తప్పక జరుగుతుందనే విశ్వాసం మాకు ఉంది. కోర్టుల పట్ల, వ్యవస్థల పట్ల అపారమైన నమ్మకం మా కుటుంబానికి ఉంది. ప్రజలందరికీ మా కుటుంబం తరఫున ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. సోషల్ మీడియాపై చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించవద్దు, నమ్మవద్దు. ప్రజాస్వామ్యవాదులంతా రావణ్‌కు అండగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు.
మమ్మల్ని చంపేయండి
‘‘ఇంత హరాస్ చేస్తున్నారు? మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన ముఖం అన్నా చూడండి. లేదా మా కుటుంబ సభ్యులు అందరం ఒకేసారి మం చచ్చిపోతాం. తప్పు అయితే చంపేయండి.. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడినే కాదు ఆయనతో పాటు ఆయన కుటుంబాన్ని చంపేయండి. ఇంతకుమించి మేమేమి చెప్పలేం’’ అని వీడియోలో చెప్పారు.


