
ప్రభుత్వమే తనకు ఉపాధిని దూరం చేసిందని వేదన
గౌరవంగా బతుకుతున్న కుటుంబం రోడ్డున పడుతుందని ఆందోళన.. గుంటూరులో గుండెపోటుకు గురైన రేషన్ వాహన డ్రైవర్
ఆస్పత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
కలెక్టరేట్ ఎదుట రేషన్ వాహనాల డ్రైవర్ల ఆందోళన
సాక్షి ప్రతినిధి, గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం తమ జీవనాధారాన్ని దూరం చేయడంతో ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాల(ఎండీయూ) డ్రైవర్లు, హెల్పర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గౌరవంగా బతుకుతున్న తమను ఈ ప్రభుత్వం రోడ్డుపాలు చేస్తోందనే వేదనతో కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో రేషన్ వాహనంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గుంటూరుకు చెందిన డ్రైవర్(ఆపరేటర్) షేక్ ఇమ్రాన్ శనివారం గుండెపోటుకు గురయ్యాడు.
కుటుంబ సభ్యులు అతనిని గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. ఇమ్రాన్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎనిమిది నెలల కిందటే అతని తల్లి మెహమూదాబేగానికి క్యాన్సర్ ఆపరేషన్ జరిగింది. ఈ కుటుంబం మొత్తం రేషన్ వాహనంపై వచ్చే ఆదాయంతోనే జీవనం సాగిస్తోంది. ఇమ్రాన్ గుండెపోటుకు గురయ్యాడనే విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో రేషన్ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు గుంటూరు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. ఇన్‌చార్జి కలెక్టర్ భార్గవ్‌తేజను కలిసి తమను కొనసాగించాలని వినతిపత్రం ఇచ్చారు.
నా బిడ్డను కాపాడండి
నా బిడ్డ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేషన్ వాహనం ఆపరేటర్‌గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి దానిపైన వచ్చే ఆదాయంతోనే మా కుటుంబం జీవిస్తోంది. నాకు 8 నెలల కిందటే క్యాన్సర్ ఆపరేషన్ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలను రద్దు చేస్తున్నామని చెప్పిన వార్త విని నా బిడ్డ ఇమ్రాన్ తీవ్ర వేదనకు గురయ్యాడు.
జీవనం కష్టమని బాధపడుతూ గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్చాం. ఈ ప్రభుత్వ నిర్ణయం వల్ల మా లాంటి నిరుపేద కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నా బిడ్డ ఇమ్రాన్‌ను, మా కుటుంబాన్ని ప్రభుత్వమే కాపాడాలి.– మెహమూదాబేగం, ఇమ్రాన్ తల్లి
మమ్మల్ని రోడ్డున పడేసిన కూటమి ప్రభుత్వం
ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాలను జూన్ ఒకటో తేదీ నుంచి రద్దు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కూటమి ప్రభుత్వం రేషన్ వాహనాలపై ఆధారపడిన దాదాపు 18,500 కుటుంబాలను రోడ్డుపాలు చేసింది. మాకు 2027 జవనరి నెల వరకు ప్రభుత్వంతో అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఆకస్మికంగా రద్దు చేయడం బాధాకరం. కూటమి ప్రభుత్వం తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. – చుండూరు సాంబశివరావు, రేషన్ వాహనాల ఆపరేటర్ల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు
ఏలూరులో రేషన్ వాహనాల డ్రైవర్ల ధర్నా
ఏలూరు (టూటౌన్): కరోనా, వరదలు వంటి తీవ్ర విపత్తుల సమయంలో ప్రజలకు విశేష సేవలు అందించిన తమను ఒక్క కలం పోటుతో రాత్రికి రాత్రే తొలగించడం దారుణమని రేషన్ పంపిణీ వాహనాల డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ వ్యవస్థను కొనసాగించాలని కోరుతూ డ్రైవర్లు, హెల్పర్లు శనివారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లు మాట్లాడుతూ ముగ్గురు రేషన్ డీలర్లు చేసే పనిని తాము ఒక్కరమే చేస్తున్నామని చెప్పారు.
ఈ వ్యవస్థను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారనే కక్షతోనే తమను పక్కన పెట్టాలని నిర్ణయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంటి వద్దకే రేషన్ పంపిణీ వ్యవస్థను రద్దు చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తంచేశారు. వీరిలో అత్యధికం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు ఉన్నారని తెలిపారు. తక్షణమే కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తమ జీవనోపాధిని కాపాడాలని కోరారు.
ఈ ధర్నాకు వైఎస్సార్‌సీపీ, ఏఐటీయూసీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పేదల ఇంటికి రేషన్ వద్దు.. మద్యం ముద్దు అన్నట్లు కూటమి ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు బండి వెంకటేశ్వరరావు, పి.కిషోర్, రేషన్ పంపిణీ వాహనాల ఆపరేటర్ల యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ఎస్.జయరాజు తదితరులు పాల్గొన్నారు.
దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం
రేషన్ వాహనాల డ్రైవర్లను కూటమి ప్రభుత్వం దొంగలుగా చిత్రీకరించడం బాధాకరం. మాకు నెలకు ఇచ్చే రూ.21 వేలతోనే వాహనం ఈఎంఐ కట్టుకుంటున్నాం. ఆయిల్ ఖర్చులు భరిస్తున్నాం. మిగిలిన డబ్బులతో మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఇప్పటి వరకు రేషన్ డీలర్లపై ఆరువేలకు పైగా 6ఏ కేసులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే రేషన్ అక్రమ రవాణా ఎవరు చేస్తున్నారో అర్థమవుతుంది.– అంబేడ్కర్, రేషన్ వాహనాల ఆపరేటర్ల సంఘం గుంటూరు నగర అధ్యక్షుడు